Begin typing your search above and press return to search.

కిషన్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ ట్విటర్ వార్.. పైచేయి ఎవరిది?

By:  Tupaki Desk   |   8 Feb 2022 11:30 PM GMT
కిషన్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ ట్విటర్ వార్.. పైచేయి ఎవరిది?
X
గడిచిన కొద్ది రోజులుగా నడుస్తున్న బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ రగడ తాజాగా మరో స్థాయికి వెళ్లింది. ఎప్పుడైతే సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రావటం.. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్య కారణంగా రాలేకపోతున్నట్లుగా ప్రకటించటం లాంటి పరిణామాలతో వాతావరణం మరింత వేడెక్కింది. ఇదిలా ఉంటే.. మంత్రి కేటీఆర్ మోడీ అండ్ కో మీద మండిపడటం.. ఏ మాత్రం అవకాశం లభించినా ట్వీట్ లతో విరుచుకుపడటం లాంటివి చేస్తున్న సంగతి తెలిసిందే.

సమతామూర్తి విగ్రహాన్ని పక్షపాతి ఆవిష్కరించారంటూ ప్రధాని మోడీపై సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ పుణ్యమా అని బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ ట్వీట్ తో ఇరు పార్టీల మధ్య ట్వీట్ల వార్ మొదలైంది. కేటీఆర్ వ్యాఖ్యలకు స్పందించిన కిషన్ రెడ్డి.. పదిహేను నిమిషాల పాటు పోలీసుల్ని తొలగిస్తే సత్తా చూపిస్తామన్న మజ్లిస్ నేతల వ్యాఖ్యలు.. నిజాం రజాకార్ ఆర్మీ.. హిందువుల ఊచకోత లాంటి అంశాలపై ఒవైసీని.. మజ్లిస్ ను కేసీఆర్.. కేటీఆర్ సమర్థిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ కోసం శ్రమిస్తున్న ప్రధానిని అవమానిస్తున్నారంటూ ట్వీట్ తో విరుచుకుపడ్డారు.

చివరకు సమానత్వాన్ని బోధించిన రామానుజాచార్యుల విగ్రహావిష్కరణను సైతం టీఆర్ఎస్ రాజకీయాలకు వాడుకోవటం ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. పాతబస్తీలో అనేక వందల హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేసిన మజ్లిస్ పార్టీకి మద్దతుగా నిలిచిన చరిత్ర టీఆర్ఎస్ దని ఫైర్ అయ్యారు. మజ్లిస్ కు మద్దతు పలికిన మీ రాజవంశ పాలన కలుషితమైందన్న విషయాన్ని.. ధర్మాలను ప్రబోధించేవారు గ్రహించాలన్నారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఘాటు ట్వీట్లకు మంత్రి కేటీఆర్ స్పందించారు. బీజేపీ విధానాలను.. మోడీ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. ఎన్డీయే ప్రభుత్వం తెలంగాణ పట్ల చూపిన వివక్షకు ఇదీ నిదర్శనమంటూ భారీ జాబితాను ఆయన ఉటంకించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా.. పసుపు బోర్డు.. ఫార్మాసిటీ.. కేఎంటీపీలకు నిధులు కేటాయించకపోవటం.. ఐటీఐఆర్ లాంటి 19 అంశాల్ని ప్రస్తావించారు. కేంద్రం సహకరించకున్నా.. తమకు తాము పనులు చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. రాష్ట్రానికి అండగా తాము ఉన్నామని.. దేశానికి దండగా మీరు ఉన్నారంటూ బీజేపీపై కేటీఆర్ నిప్పులు చెరిగారు.

ఇక.. ఇద్దరు నేతల ట్వీట్లను చూసినప్పుడు.. భావోద్వేగానికి కిషన్ రెడ్డి పెద్ద పీట వేస్తే.. కేటీఆర్ మాత్రం ప్రజలు ఇట్టే కనెక్టు అయ్యే అంశాలు.. సమకాలీన విషయాల్ని ప్రస్తావించారని చెప్పాలి. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. కేంద్రం తెలంగాణపై వివక్ష చూపిస్తుందన్న కేటీఆర్ మాటకు మాత్రం కిషన్ రెడ్డి సూటిగా సమాధానం ఇవ్వలేదన్నట్లుగా ఉండటం కనిపిస్తోంది.