Begin typing your search above and press return to search.

కిచెన్.. కర్రీ పాయింట్.. కొత్త జిల్లాలు.. సింఫుల్ గా చెప్పేశారు

By:  Tupaki Desk   |   16 April 2022 6:31 AM GMT
కిచెన్.. కర్రీ పాయింట్.. కొత్త జిల్లాలు.. సింఫుల్ గా చెప్పేశారు
X
కొత్త జిల్లాల ఏర్పాటు హడావుడి ఇప్పుడు ఏపీలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఆ మాటకు వస్తే కొంతకాలం క్రితమే ఇదే అంశాన్ని తెలంగాణలోని కేసీఆర్ సర్కారు అమలు చేసింది. కొత్త జిల్లాల మీద సీఎం కేసీఆర్ చెప్పిన మాటలకు.. చేతలకు తేడా ఏమిటన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించారు. జిల్లాల సంఖ్య పెరిగిన తర్వాత భూముల ధరలు పెరగటం.. మరింతమందికి పదవులు లభించటం.. రాజకీయ నిరుద్యోగం కొంత తగ్గటం మినహా.. సామాన్యుడికి ఒరిగిందేమీ లేదు. కొత్త జిల్లాలతో పాలనా పరమైన మార్పులు కానీ.. సౌలభ్యం కానీ పెద్దగా వచ్చింది లేదు.

ఏదైనా పెద్ద పరిణామం చోటు చేసుకున్నప్పుడు కొత్త జిల్లాల కంటే కూడా ఉమ్మడి జిల్లాల పేరుతో కార్యాచరణ చేపట్టటం చూస్తున్నదే. ఇదంతా చూసినప్పుడు కొత్త జిల్లాలు అన్నది కొందరికి మేలు చేసేదే తప్పించి.. అందరికి ప్రయోజనం కలిగించేది ఎంతమాత్రం కాదన్న సత్యం బోధ పడుతుంది.

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు.. దానికి సంబంధించిన హడావుడి నడుస్తోంది. ఇలాంటి వేళ.. కొత్త జిల్లాల మీద తన స్పందనను తెలియజేశారు సీనియర్ రాజకీయ నేత.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.

ఎప్పటిలానే ఆయన ప్రెస్ మీట్ సుదీర్ఘంగా సాగింది. మిగిలిన రాజకీయ నేతల మాదిరి కాకుండా తనకంటూ సొంత ఇమేజ్ ఉన్న ఉండవల్లి.. తనను అడిగిన ప్రతి అంశం మీదా ఎలాంటి తడబాటు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్ధలు కొట్టేశారు.

కొత్త జిల్లాల ఏర్పాటు మీద ఆయన్ను ప్రశ్నించినప్పుడు ఆయన బదులిచ్చిన వైనం వింటే.. కాసింత ఆశ్చర్యం కలుగుక మానదు. విషయాన్ని ఎంత చక్కగా చెప్పేశారనిపిస్తుంది. చెప్పింది సింఫుల్ గా అయినప్పటికీ ఫుల్ గా అందరికి అర్థమయ్యేలా ఆయన ఇచ్చిన ఉదాహరణ ఆకట్టుకుంటుందని చెప్పాలి.

కొత్త జిల్లాలతో ఉద్యోగుల సంఖ్య ఏమీ పెరగదన్న ఆయన.. "చెప్పాను కదా. ఇది పక్కా బిజినెస్సు. ఈ బిజినెస్ లో ఇక్కడ (విశాఖపట్నంలో) ఒక హోటల్ ఉంది.. గాజువాకలో కనుక ఒక కర్రీపాయింట్ పెట్టామనుకో. బాగా వ్యాపారం లాగుతుంది. కిచెన్ మాత్రం విశాఖపట్నంలోనే ఉంచుదాం అని ఆలోచించాడనుకోండి.. బిజినెస్ మ్యాన్ కరెక్టుగా క్లిక్ అవుతాడని అర్థమవుతుంది. కాస్త దగ్గర చేయటం.. ఏదో గవర్నరెన్సు కనపడాలి కదా? ఇలా చేస్తున్నాం పరిపాలన అని. జిల్లాలు పెంచటం అన్నవి అందరూ చేసే ట్రిక్కులే. దాని వల్ల పెద్ద నష్టమూ ఉండదు.. పెద్ద లాభమూ ఉండదు" అని తేల్చేశారు. కొత్త జిల్లాలపై ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి.