Begin typing your search above and press return to search.

రాజు వర్సెస్ రాజు...రాజకీయ మంట

By:  Tupaki Desk   |   8 Sep 2022 11:30 PM GMT
రాజు వర్సెస్ రాజు...రాజకీయ మంట
X
ఇద్దరూ రాజులే. ఇద్దరూ పొరుగు జిల్లాల నుంచి వచ్చిన వారే. విశాఖ అందరినీ ఆదరిస్తుంది కాబట్టి ఒక రాజు గారు ఎమ్మెల్యే అయిపోయారు. మరో రాజు గారు ఇంకా కావాల్సి ఉంది. ఆ ఇద్దరూ విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని కీలకమైన రాజులే. ఇద్దరికీ అంగబలం, అర్ధ బలం బాగానే ఉన్నాయి. ఒక రాజు గారు మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు. ఆయన 2014లో టీడీపీ బీజేపీ పొత్తులో ఎమ్మెల్యే అయిపోయారు. ఈ సీటు కోసం ఎందరో కన్నేసినా లాస్ట్ మినిట్ లో వచ్చి గెలిచి మరీ పంచ్ అంటే తనదే అనిపించారు.

ఇక 2019 ఎన్నికల్లో కూడా ఆయన బీజేపీ నుంచి పోటీ చేసి ఓడారు. ఈసారి పొత్తులు లేవు. అయితే రాజు గారు ఇతర పార్టీల నుంచి పోటీకి ట్రై చేసి విఫలం కావడం వల్లనే చివరికి బీజేపీ తరఫున బరిలో దిగారని ప్రచారం అయితే ఉంది. ఆయంకు ఇష్టమైన రాజకీయ నాయకుడు చంద్రబాబు అని ప్రత్యర్ధులు అంటారు. ఆయన కూడా తన మనసులో ఏదీ దాచుకోకుండా నిండు అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నపుడే బాబుని తెగ పొగిడారు. బాబు గ్రేట్ అని బీజేపీ లో ఉంటూ కూడా ఆయన అనగలరు.

ఇక ఆయన 2024 ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాలనుకుంటున్నారు. అయితే పొత్తు లేకపోతే ఈసారి కూడా ఆయన ఓటమి ఖాయమని ఆయనకూ తెలుసు. పొత్తులు ఉంటాయో లేవో తెలుసు. అందుకే ఆయన తెలుగుదేశం జనసేనలతో కూడా దోస్తీ చేస్తూ ఉంటారని ప్రత్యర్ధులు అంటారు. ఇక ఆయన లేటెస్ట్ గా జగన్ సర్కార్ మీద విమర్శలు చేశారు. జగన్ సర్కార్ తొందరలో కూలుతుందని కూడా జోస్యం చెప్పారు.

దాంతో విశాఖ ఉత్తరాన ఆయన రాజకీయ ప్రత్యర్ధి వైసీపీ ఇంచార్జి అయిన కేకే రాజు విష్ణు కుమార్ రాజు మీద భారీ ఎత్తున విరుచుకుపడుతున్నారు. అసలు వచ్చే ఎన్నికల్లో మీరు ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారో చెప్పండి గురువా అని నిలదీశారు. ఉన్నది బీజేపీ మనసులో ఉన్నది టీడీపీ అంటూ కాషాయం రాజు గారికి పసుపు పూసేశారు. మీ గొంతుక టీడీపీ అయినపుడు మీరు బీజేపీలో ఉంటూ పాలిటిక్స్ చేస్తూ నన్నే ఎలా విమర్శిస్తారు అని కూడా గట్టిగానే నాలుగు దట్టించారు.

తాను వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచే పోటీలో ఉంటాను, అదే బీజేపీ రాజు గారు పార్టీ మారకుండా ఉండగలరా అలా ప్రమాణం చేయగలరా అని నిలదీశారు. మొత్తానికి చూస్తే ఉత్తరాన రాజు వర్సెస్ రాజు అన్నట్లుగా పోరు సాగుతోంది. రాజకీయం రంజుగా ఉంది. ఈ ఇద్దరూ మళ్లీ ప్రత్యర్ధులుగా బరిలోకి దిగబోతున్నారు. ఎవరు ఎమ్మెల్యేగా అసెంబ్లీకు వెళ్తారో చూడాలి. ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటి అంటే ఈ ఇద్దరూ బంధువులేనట. అందుకే మరి రాజుల కోటలో రాజకీయం ఒక పట్టాన అర్ధం కాదు అన్నది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.