Begin typing your search above and press return to search.

జూనియర్ ఎన్టీఆర్ వస్తే.. వీళ్లు టీడీపీలోకి వెళ్తారా?

By:  Tupaki Desk   |   18 Nov 2019 5:30 PM GMT
జూనియర్ ఎన్టీఆర్ వస్తే.. వీళ్లు టీడీపీలోకి వెళ్తారా?
X
తెలుగుదేశం పార్టీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్ తీసుకోవాలంటూ కొంతమంది వాదిస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ ఓడిపోయినప్పటి నుంచి ఈ వాదనలు వినిపిస్తున్నాయి. లోకేష్ పనికిరాడని - చంద్రబాబుకు వయసు మీద పడుతూ ఉందని.. ఇలాంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆరే ప్రత్యామ్నాయం అంటూ వారు అంటున్నారు.

లోకేష్ పదే పదే తడబడుతూ ఉండటంతో వారి వాదనకు ఆస్కారం ఏర్పడుతూ ఉంది. ఇక తెలుగుదేశం పార్టీపై కొంతమంది సానుభూతి కురిపిస్తూ కూడా ఆ పార్టీకి జూనియర్ ఎన్టీఆరే దిక్కని అంటున్నారు. ఆ పార్టీని ఇది వరకే వీడిన కొడాలి నాని - ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసినట్టుగా ప్రకటించిన వల్లభనేని వంశీ మోహన్ కూడా అదే మాటే మాట్లాడుతూ ఉన్నారు!

మరి ఇక్కడ వచ్చే ఆసక్తిదాయకమైన సందేహం ఏమిటంటే.. ఒకవేళ చంద్రబాబుకు నాయుడుకు వీరు చెప్పే తత్వం బోధపడి - పార్టీ పగ్గాలను జూనియర్ కు అప్పగించారని అనుకుందాం! తారక్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి - రాజకీయంగా చంద్రబాబు నాయుడు కొత్త సంచలనానికి తెరతీస్తే.. అప్పుడు వీళ్లంతా ఏమంటారు?

అధికార పార్టీని వదులుకుని కొడాలి నాని బయటకు వస్తారా? జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వాన్ని సమర్థిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఈ మంత్రి వీడతారా? అలాగే తెలుగుదేశం నేతలను కూడా తిడుతున్న వల్లభనేని వంశీ మోహన్ అప్పుడు మళ్లీ జై టీడీపీ అంటాడా? అనే చర్చ సోషల్ మీడియాలో సాగుతూ ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ వీళ్లకు సన్నిహితుడు అనే పేరుంది. తారక్ ను హీరోగా పెట్టి సినిమాలు తీసిన నిర్మాతలు కూడా వీళ్లు! వైసీపీలో ఉన్నా కొడాలి నాని హరికృష్ణతో - జూనియర్ ఎన్టీఆర్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగించారంటారు. మరి టీడీపీ బాధ్యతలను ఇప్పటికిప్పుడు నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ తీసుకుంటే.. వీళ్లు అటు వైపు వెళ్తారా? లేక అధికార పార్టీనే అంటిపెట్టుకుంటారా? వారే చెప్పాలి!