Begin typing your search above and press return to search.

నోటి దురదతో చిక్కులు తెచ్చుకుంటున్న కొడాలి నాని

By:  Tupaki Desk   |   19 Nov 2019 1:08 PM GMT
నోటి దురదతో చిక్కులు తెచ్చుకుంటున్న కొడాలి నాని
X
చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, ఇతర టీడీపీ నాయకులపై విరుచుకుపడడంలో ముందున్న ఏపీ మంత్రి కొడాలి నాని కొద్ది రోజులుగా తన నోటికి పనిచెబుతున్నారు. ఇప్పుడు ఆ నోరే ఆయనకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. నోటి దురుసుతనం కారణంగా ఆయన రెండు వివాదాల్లో చిక్కుకున్నారు.

తిరుమల ఆలయానికి సంబంధించి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ నాని చేసిన వ్యాఖ్యలపై హిందూ సంస్థలు - బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్ తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమల వెంకటేశ్వరుడి దర్శనానికి అన్యమతస్తులు ఎవరు వెళ్లాలన్న డిక్లరేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని భానుప్రకాశ్ అన్నారు.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీకి జై కొట్టిన తరువాత రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం సాగింది. ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్ గతంలో తిరుమలకు వెళ్లడానికి సంబంధించీ రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఈ సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యే - పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తిరుమల దర్శనంతో పాటు ఆలయ నిర్మాణానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు చిలికి చిలికి గాలివానగా మారుతున్నాయి. ‘‘సీఎం జగన్ ఆలయ ప్రవేశానికి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు - ఆలయాన్ని ఎవడి అమ్మమొగుడు నిర్మించాడు’’ అంటూ టీడీపీ నేతలపై విమర్శలు చేశారు. ఆయన చేసిన ఈ పరుష వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

బీజేపీతో పాటు హిందూ - బ్రాహ్మణ సంఘాలూ మంత్రిపై ఆగ్రహిస్తున్నాయి. ఏపీ అర్చక సమాఖ్య - బ్రాహ్మణ చైతన్య వేదిక - బాలాజీ భక్త బృందంతో పాటు ఇతర సంఘాలు పలు విమర్శలు చేశాయి. భక్తుల విశ్వాశాలు - తిరుమల నియామావళితో పాటు - సాంప్రదాయాలపై సైతం మంత్రి నీచంగా మాట్లాడని వారు మండిపడ్డారు. టీటీడీ ఆలయం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆలయం కాదని ... స్వయం ప్రతిపత్తి గల్గిన దేవాలయమని వివరించారు. స్యయంగా అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం తోపాటు యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ సైతం డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే ఆలయంలోకి ప్రవేశించే వారని గుర్తు చేశారు.

బీజేపీ నేతలయితే హిందువుల మనోభావాలు దెబ్బతీసిన మంత్రిని జగన్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇతర మతాల గౌరవాన్ని కాపాడతానని ప్రమాణం చేసిన సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ఇంతవకు మంత్రి కొడాలి చేసిన వ్యాఖ్యలను పట్టించుకోకపోవడంపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి వర్గంలో ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే సీఎం భాద్యత తీసుకోవాల్సిన అవసరముందని ఆయన తెలిపారు. ఇక అన్యమతస్తులు ఎవరు ఆలయాన్ని సందర్శించాలన్న డిక్లరేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని భానుప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే మూడు రోజులుగా నాని చేసిన వ్యాఖ్యలుపై దుమారం రేగుతున్నా..వాటిపై ఎలాంటీ వివరణ ఇచ్చేందుకు మంత్రి ముందుకు రాలేదు.

మరోవైపు నాని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడిని బ్రోకర్ అనడంపై జాతీయ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు రోజుల్లోగా మంత్రి కొడాలి నాని బహిరంగ క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలను వెన్నక్కి తీసుకోవాలని హెచ్చరించింది. లేని పక్షంలో వైసీపీ నేతల ఇళ్లను ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చింది.