Begin typing your search above and press return to search.

నాకు రాజకీయ భిక్ష పెట్టింది ఆయనే...కొడాలి నాని

By:  Tupaki Desk   |   4 Sep 2020 2:00 PM GMT
నాకు రాజకీయ భిక్ష పెట్టింది ఆయనే...కొడాలి నాని
X
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతోపాటు మంత్రి దేవినేని ఉమపై కూడా నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు తనకు రాజకీయ భిక్ష పెట్టానని చెబుతున్నారని, ఆయనే ఒక బిచ్చగాడని, అటువంటిది తనకు ఆయన రాజకీయ భిక్ష పెట్టడమేమిటని విమర్శించారు. రాజకీయ వారసత్వం కోసం దేవినేని ఉమా ఏం చేశారో తనకు తెలుసని, తన వదిన హత్య గురించి ఉమ మాట్లాడడానికి సిధ్దమా అంటూ నాని ప్రశ్నించారు. ఉమ మైసూర్ మహారాజు కుమారుడిలా మాట్లాడుతున్నారని, కంచికచర్లలో ఉమ, ఆయన తండ్రి దేవినేని చిన్ని క్రాంతి కూల్‌డ్రింక్ షాప్‌ నడిపేవారని విమర్శించారు. తనను బూతుల మంత్రి అని ఉమ విమర్శించారని, తాను నిజంగా బూతులు తిడితే చంద్రబాబు, ఉమ బతికి ఉండేవారు కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆనాడు తనను తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించిన దివంతగ నేత హరికృష్ణ తనకు రాజకీయ భిక్ష పెట్టారని, ఆ తర్వాత గుడివాడ అసెంబ్లీ టికెట్ ను జూనియర్ ఎన్టీఆర్ తనకు ఇప్పించి తన రాజకీయ భవిష్యత్తుకు పునాది వేశారని అన్నారు. అందుకే, నందమూరి కుటుంబానికి తాను రుణపడి ఉంటానని అన్నారు. చంద్రబాబే పెద్ద భిక్షగాడని.. తనకు ఆయన రాజకీయ భిక్ష పెట్టడమేంటని ప్రశ్నించారు. ఉమ తనను లారీ డ్రైవర్ అంటున్నారని, గుడివాడలో తమ కుటుంబానికి 50 లారీలున్నాని అందరికీ తెలుసునన్నారు. దేవినేని ఉమాకు చాలా విషయాలు చెప్పాలని, కానీ, ఆయన ఎన్నిసార్లు కాల్ చేసినా తన ఫోన్ ఉమ లిఫ్ట్ చేయడం లేదని ఎద్దేవా చేశారు. 73 రోజులు ఆసుపత్రిలో రిమాండ్‌లో ఉన్న ఖైదీ ఈ భూప్రపంచంలో అచ్చెన్నాయుడు ఒక్కరే అని ఎద్దేవా చేశారు.

వైఎస్ మానస పుత్రిక అయిన ఉచిత విద్యుత్ పథకాన్ని తమ ప్రభుత్వం ఎందుకు తీసేస్తుందని, ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని నాని మండిపడ్డారు. ఉచిత విద్యుత్ చేసిన డిస్కమ్‌లకు చంద్రబాబు పెండిం బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించిందన్నారు. స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల రైతులకు జరిగే అన్యాయం ఏమిటో వివరించే దమ్ము చంద్రబాబుకు ఉందా అని నాని ప్రశ్నించారు. చంద్రబాబు వంటి దళారి, ఆయనకు వంతపాడే ఎల్లో మీడియా మాటలను రైతులు నమ్మవద్దని కోరారు. 2024 ఎన్నికల నాటికి టీడీపీ మరింత బలహీనపడుతుందని, ఎప్పుడు ఎన్నికలొచ్చినా టీడీపీ ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదని నాని సెటైర్లు వేశారు. మరి, నాని వ్యాఖ్యలపై ఉమ, చంద్రబాబుులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.