Begin typing your search above and press return to search.

కృష్ణా టీడీపీ కొంప కూల్చేస్తోన్న వైసీపీ మంత్రి!!

By:  Tupaki Desk   |   4 Aug 2019 4:40 AM GMT
కృష్ణా టీడీపీ కొంప కూల్చేస్తోన్న వైసీపీ మంత్రి!!
X
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ప్రస్తుతం ఏపీ రాజధాని కేంద్రంగా ఉన్న కృష్ణాజిల్లా ఆ పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. 2019 ఎన్నికల్లో ప్రజారాజ్యం ఎంట్రీతో జరిగిన ముక్కోణపు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్. రాజశేఖర్ రెడ్డి రెండోసారి అధికారంలోకి వచ్చినా కృష్ణా జిల్లాలో మాత్రం తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం కొన‌సాగుతోంది. కాంగ్రెస్ - ప్రజారాజ్యం పార్టీలను వెనక్కి నెట్టి తెలుగుదేశం ఎక్కువ సీట్లు గెలుచుకుంది. గత దశాబ్ద కాలంగా కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీకి పెట్ట‌నికోట‌గా ఉంటోంది. తాజా ఎన్నికల్లో జిల్లా ఓట‌రు ఆ పార్టీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. గన్నవరం - విజయవాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.

కీలకమైన విజయవాడ ఎంపీ సీటును ఆ పార్టీ స్వల్ప తేడాతో గెలుచుకుంది. ఇక్కడ టిడిపి కంటే ఎంపీగా గెలిచిన నాని వ్యక్తి ఇమేజ్ కొంత వరకు పని చేసిందని చెప్పాలి. తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జిల్లాకు చెందిన నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి త‌న టీంతో సహా బీజేపీలోకి జంప్ చేసేశారు. ఇప్పుడు ఇదే క్రమంలో ఎంపీగా గెలిచిన నాని - గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ - నూజివీడు నియోజకవర్గ ఇన్ చార్జి ముద్ద‌ర‌బోయిన‌ వెంకటేశ్వర రావు - మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ - గుడివాడ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఏపీ తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ తో పాటు పలువురు సీనియర్ నేతలు సైతం బిజెపి - వైసీపీలోకి వెళ్లేందుకు కాచుకొని కూర్చుని ఉన్నారు.

జిల్లాలో తెలుగుదేశం పార్టీతో పొలిటిక‌ల్ కెరీర్ ప్రారంభించిన‌ ప్రస్తుత మంత్రి కొడాలి నాని తెలుగుదేశం పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసే బాధ్యతను తీసుకున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో తనపై పోటీ చేసి ఓడిపోయిన దేవినేని అవినాష్‌ ను వైసీపీలోకి తీసుకు వెళ్లేందుకు తెర‌ వెనుక నాని మంత్రాంగమే ఉందట. టిడిపికి భవిష్యత్తు లేదు... వైసీపీలోకి వస్తే మీ సొంత నియోజకవర్గమైన విజయవాడ తూర్పు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంతో పాటు... వచ్చే ఎన్నికల్లో తూర్పు సీటుపై జగన్ హామీ ఇచ్చేలా చూసుకుంటానని భరోసా ఇవ్వడంతో అవినాష్ సైతం టిడిపికి రామ్ రామ్ చెప్పినట్టు తెలుస్తోంది.

ఇక కొడాలి నానికి మరో స‌న్నిహితుడు అయిన గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని సైతం వైసీపీలోకి తీసుకు వెళ్ళాలా నాని పావులు కదుపుతున్నారట. వంశీకి నానితో పాటు సీఎం జగన్ మోహన్ రెడ్డి తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. టిడిపిలో కొద్దిరోజులుగా ఇమ‌డ‌లేకపోతున్న వంశీ రాజకీయంగా తనకు ప్రత్యర్థిగా ఉన్న దేవినేని ఉమాకు చంద్రబాబు - లోకేష్ ఎక్కువ ప్ర‌యార్టీ ఇవ్వ‌డాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికలకు ముందే వంశీ వైసీపీలోకి వెళ‌తార‌న్న ప్ర‌చార‌మే ఎక్కువుగా జ‌రిగింది. అయితే వంశీ టీడీపీ నుంచే పోటీ చేసి విజయం సాధించారు.

జిల్లాలో కీల‌క నేత‌లుగా ఉన్న అవినాష్‌ - వంశీతో పాటు త‌న సామాజికవ‌ర్గానిక చెందిన కొంద‌రు మీడియం రేంజ్ నేత‌ల‌ను కూడా వైసీపీలోకి తీసుకువెళ్లే బాధ్య‌త‌ల‌ను నాని స్వీక‌రించార‌ట‌. ఏదేమైనా చంద్ర‌బాబుతో పాటు జిల్లాలో దేవినేని ఉమాను టార్గెట్ చేసే క్ర‌మంలోనే నాని టీడీపీ కీల‌క నేత‌ల‌పై వ‌లవేసి టీడీపీకి పెద్ద షాకే ఇస్తున్నాడు.