Begin typing your search above and press return to search.

బీజేపీలో టీడీపీ విలీన‌మైతే ప్ర‌త్యేక హోదా!

By:  Tupaki Desk   |   19 May 2016 6:09 AM GMT
బీజేపీలో టీడీపీ విలీన‌మైతే ప్ర‌త్యేక హోదా!
X
ఆస‌క్తిక‌ర‌మైన స్టేట్‌మెంట్ల‌తో రాజ‌కీయాల్లో ఉండే నాయ‌కుల్లో ఒక‌రైన కృష్ణాజిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తాజాగా మ‌రో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ప్ర‌తిపాద‌న తెచ్చారు. య‌థావిధిగా ఆయ‌న ఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేసుకున్న కొడాలి నాని ప్ర‌జాసంక్షేమం కోణంలో బాబుకు ఓ క్రేజీ ప్ర‌తిపాద‌న పెట్టారు.

వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తేనే నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తామని చెబుతున్న చంద్రబాబు తన పార్టీని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విలీనం చేస్తే 24 గంటల్లో రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా - నిధులను ప్రధాని నరేంద్రమోదీ ఇస్తారని నాని జోస్యం చెప్పారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో ఒక టీఎంసీ నీటి కోసం మ‌హారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ దగ్గర హైడ్రామా సృష్టించిన చంద్రబాబు న‌వ్యాంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జ‌రుగుతుంటే స్పందించ‌డం లేద‌న్నారు. ఎగువన ఉన్న తెలంగాణ‌లో నాలుగు అక్రమ ప్రాజెక్ట్‌ లను నిర్మిస్తున్నా నోరు మెదపక పోవడం దారుణమని నాని మండిప‌డ్డారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన త‌న‌ను తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎక్క‌డ చిక్కుల పాలు చేస్తారోన‌నే ఉద్దేశంతోనే బాబు భ‌య‌ప‌డిపోతూ ఆంధ్ర‌ప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నార‌ని మండిప‌డ్డారు. భవిష్యత్తులో డెల్టాలో సాగునీటి సమస్య ఎదురైతే అందుకు చంద్రబాబు ఒక్కరే బాధ్యులవుతారని నాని అన్నారు.

ఓటుకు నోటు కేసుతో పొరుగు రాష్ట్రానికి దాసోహం అన్న చంద్ర‌బాబు రాజ‌కీయ అవ‌స‌రాల కోసం రాష్ట్రానికి ప్రత్యేక హోదా విష‌యంలో బీజేపీని నిల‌దీయ‌డం లేద‌న్నారు. కేంద్రంలో ప‌ద‌వులు ప‌ట్టుకొని వేలాడాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని నాని నిల‌దీశారు. ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డ‌ని ప‌ద‌వులు ఎన్ని ఉన్నా లాభం లేద‌నే విష‌యం బాబుకు తెలిసి వస్తుంద‌నే ఆశ త‌మ‌కు లేద‌ని ఎందుకంటే అధికార పీఠం కోసం ఏమైన చేసే చ‌రిత్ర చంద్రబాబుకు ఉన్న‌ద‌ని నాని దుయ్య‌బ‌ట్టారు.