Begin typing your search above and press return to search.

చౌక డిపోల మీద మంత్రి కొడాలి నాని ఫుల్ క్లారిటీ.. !

By:  Tupaki Desk   |   22 July 2019 10:02 AM GMT
చౌక డిపోల మీద మంత్రి కొడాలి నాని ఫుల్ క్లారిటీ.. !
X
ఐదేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌లో ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ తీసుకున్న నిర్ణ‌యాల కార‌ణంగా జ‌రిగిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. శాఖ‌ల వారీగా దిద్దుబాటు చ‌ర్య‌ల్ని చేప‌డుతున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. చౌక‌డిపోలకు సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అయితే.. ప్ర‌భుత్వం చెప్పిన మాట ఒక‌టైతే.. దాని మీద సాగుతున్న ప్ర‌చారం మ‌రోలా ఉంది. చౌక‌డిపో డీల‌ర్ల‌ను తీసేయ‌నున్న‌ట్లుగా మీడియాలో పెద్ద ఎత్తున వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో రేష‌న్ డీల‌ర్ల‌లో పెద్ద ఎత్తున ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఏపీ వ్యాప్తంగా ఉన్న రేష‌న్ డీల‌ర్ల‌ను మొత్తంగా తీసేస్తున్న‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది. దీనికి ఏపీ విప‌క్షం సైతం త‌న‌వంతు సాయంగా ప్ర‌య‌త్నిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా రేష‌న్ డీల‌ర్ల మీద సాగుతున్న సందేహాల‌కు ఫుల్ స్టాప్ పెట్టే ప్ర‌య‌త్నం చేశారు మంత్రి కొడాలి నాని. తాజాగా ఆయ‌న మాట్లాడుతూ.. రేష‌న్ డీల‌ర్ల‌ను తొల‌గించాల‌న్న ఆలోచ‌న ఏదీ ప్ర‌భుత్వానికి లేద‌ని స్ప‌ష్టం చేశారు.

కొత్త విధానంలో వ‌చ్చినా డీల‌ర్లు కొన‌సాగుతార‌ని చెప్పారు. కాకుంటే.. వారు స్టాకిస్టులుగా మారుతారని చెప్పారు. కొత్త విధానంలో డీల‌ర్లు కొన‌సాగుతార‌ని.. కాకుంటే గ‌త ప్ర‌భుత్వంలో దొడ్డిదారిన వ‌చ్చిన డీల‌ర్ల‌ను మాత్రం ఇంటికి పంపుతున్న‌ట్లుగా స్ప‌ష్టం చేశారు.

వాలంటీర్ల వ్య‌వ‌స్థ అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత రేష‌న్ కార్డుల‌పై స‌మీక్ష జ‌రుపుతామ‌న్న ఆయ‌న‌.. అర్హులైన వారికి త్వ‌ర‌లోనే కార్డులు జారీ చేయ‌నున్న‌ట్లు చెప్పారు. చాలామంది డీల‌ర్లు బీపీఎల్ ల‌బ్దిదారుల కార్డుల్ని త‌మ వ‌ద్ద‌నే ఉంచుకొని.. త‌ప్పుడు లెక్క‌లు చూపిస్తున్న‌ట్లుగా మంత్రి కొడాలి నాని చెప్పారు.

అలాంటి వాటిపై దృష్టి సారిస్తామ‌ని చెప్పిన ఆయ‌న‌.. బీపీఎల్ కుటుంబాల‌కు ప్ర‌త్యేకంగా కార్డులు ఇచ్చే ఆలోచ‌న త‌మ ప్ర‌భుత్వానికి ఉంద‌న్నారు. కొడాలి నాని ఇచ్చిన తాజా క్లారిటీతో రేష‌న్ డీల‌ర్లకున్న సందేహాల‌న్ని తొలిగిపోయే అవ‌కాశం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.