Begin typing your search above and press return to search.

చిరంజీవి బ‌ర్త్ డే వేడుక‌ల్లో కొడాలి నాని.. వారి ఓట్ల‌పై క‌న్నేశారా?

By:  Tupaki Desk   |   22 Aug 2022 11:30 AM GMT
చిరంజీవి బ‌ర్త్ డే వేడుక‌ల్లో కొడాలి నాని.. వారి ఓట్ల‌పై క‌న్నేశారా?
X
ఆగ‌స్టు 22న చిరంజీవి జన్మ‌దినం సంద‌ర్బంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయ‌న జ‌న్మదిన వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఈ వేడుక‌ల్లో చిరంజీవి అభిమాన సంఘాల నేత‌లు, ఇత‌ర మెగాభిమానులు పాల్గొన్నారు. అయితే రాజ‌కీయ పార్టీ నేత‌లు చిరంజీవి జ‌న్మ‌దిన వేడుకల్లో పాలుపంచుకున్నారు. ముఖ్యంగా దివంగ‌త ఎన్టీఆర్ కుటుంబానికి వీర విధేయుడిగా పేరున్న మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చిరంజీవి జ‌న్మ‌దిన వేడుక‌ల్లో పాలుపంచుకోవ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

కృష్ణా జిల్లా గుడివాడ‌లో చిరంజీవి అభిమాన సంఘాల నేత తోట సాయి ఆధ్వ‌ర్యంలో వేడుక‌లు జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మంలో కొడాలి నాని పాల్గొన్నారు. అంతేకాకుండా తెలుగు చలనచిత్ర రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయే కథానాయ‌కుల్లో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటార‌ని కొడాలి నాని కొనియాడారు.

భగవంతుని ఆశీస్సులతో చిరంజీవి నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని నాని ఆకాంక్షించారు. చిరంజీవి అభిమాన సంఘం అధ్య‌క్షుడు తోట సాయి ఎన్నో మంచి సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నార‌ని ప్ర‌శంసించారు.

కాగా గ‌తంలో ఎప్పుడూ చిరంజీవి జ‌న్మ‌దిన వేడుక‌ల్లో పాలుపంచుకోని కొడాలి నాని తొలిసారి ఈ వేడుక‌ల్లో పాలుపంచుకోవడం విశేషం. గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో మెగాభిమానులు భారీ సంఖ్య‌లో ఉన్నారు. అందులోనూ కాపు సామాజిక‌వ‌ర్గం ఓటర్లు 30 వేల‌కు పైగానే ఉన్నార‌ని చెబుతున్నారు. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై త‌ర‌చూ తీవ్ర విమ‌ర్శ‌లు చేసేవారిలో కొడాలి నాని ఒక‌రు.

ఈ నేప‌థ్యంలో కొడాలి నానిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడిస్తామ‌ని ఇప్ప‌టికే ప‌వ‌న్ అభిమానులు చాలెంజ్ చేశారు. ఈ నేప‌థ్యంలో కాపు సామాజిక‌వ‌ర్గాన్ని ఆక‌ట్టుకోవ‌డానికే కొడాలి నాని.. చిరంజీవి ప‌ల్ల‌కీ ఎత్తుకున్నార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఓవైపు చిరు సోద‌రుడు ప‌వ‌న్‌ను తిడుతూ.. మ‌రోవైపు చిరుని పొగుడుతూ కొడాలి నాని రాజకీయం చేస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి కొడాలి నాని ప్ర‌య‌త్నాలు ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతాయో తెలియాలంటే వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు ఆగాల్సిందే.