Begin typing your search above and press return to search.

కొడాలి కొడవలి : అన్న గారి కూతురు మీదకే ఈసారి...?

By:  Tupaki Desk   |   13 Jun 2022 3:30 PM GMT
కొడాలి కొడవలి : అన్న గారి కూతురు మీదకే ఈసారి...?
X
వైసీపీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నాని ఈసారి తాను ఎంతగానో ఇష్టపడే నందమూరి కుటుంబం మీదనే కొడవలి దూసారు. ఎన్టీయార్ కుమార్తె, బీజేపీ నాయకురాలు అయిన దగ్గుబాటి పురంధేశ్వరి మీద ఆయన మండిపడుతున్నారు. పిచ్చి ప్రయత్నాలు మానుకో అని గట్టి హెచ్చరికలే చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటి అంటే గుడివాడకు ఫ్లై ఓవర్లు మంజూరు అయ్యాయి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వాటిని గుడివాడకు శాంక్షన్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎంపీ వల్లభనేని బాలశౌరిల ప్రయత్నాలతో అలా ఫ్లై ఓవర్లు గుడివాడకు వచ్చాయని కొడాలి నాని చెబుతున్నారు.

ఇపుడు ఆ ఫ్లై ఓవర్లను పురంధేశ్వరి ఆపాలని చూస్తున్నారు అని కొడాలి నాని హాట్ కామెంట్స్ చేశారు. ఇదంతా కేవలం నలుగురు వ్యాపారుల ప్రయోజనాల కోసమే ఆమె అలా చేస్తున్నారు అని ఆరోపించారు. ఈ మేరకు ఆమె కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అపాయింట్మెంట్ కూడా తీసుకుని గుడివాడలో అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

గుడివాడలో ఫ్లై ఓవర్లను నిర్మిస్తే ఆమెకు అభ్యంతరం ఏమిటని ఆయన నిలదీశారు. గుడివాడవాసులు ఫ్లై ఓవర్లను వద్దు అని చెప్పారా అని ప్రశ్నించారు. పురంధేశ్వరి గుడివాడ వచ్చి వారిని అడిగి ఆ సంగతి తేల్చుకోవాలని కూడా కోరారు. ఎవరైనా ఫ్లై ఓవర్లు వద్దు అంటే ఆమె వాటిని ఆపవచ్చు అని అన్నారు. అలా కాకుండా అంతా ముక్తకంఠంతో కోరుకుంటున్న అభివృద్ధిని ఆపితే మాత్రం గుడివాడ నుంచి ఒక్క రైలుని కూడా కదలనివ్వమని కొడాలి నాని హెచ్చరించారు.

అంతే కాదు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేపడతామని నాని స్పష్టం చేశారు. పురంధేశ్వరి ఎన్టీయార్ కుమార్తెగా గుడివాడ అభివృద్ధి విషయంలో ఆలోచించాలని ఆయన హితవు పలికారు. మొత్తానికి కొడాలి నాని ఇపుడు పురంధేశ్వరి మీద హాట్ కామెంట్స్ చేస్తున్నారు. మరి చిన్నమ్మ ఇవన్నీ విని ఊరుకుంటారా. ఆమె తన ప్రయత్నాలు తాను చేస్తే అపుడేమవుతుందో చూడాల్సిందే.