Begin typing your search above and press return to search.

కొడాలి నాని తిట్టాడా ? తిట్టించారా ?

By:  Tupaki Desk   |   10 July 2022 4:40 AM GMT
కొడాలి నాని తిట్టాడా ? తిట్టించారా ?
X
ఈ రాష్ట్రానికి పట్టిన శని, నిష్ట దరిద్రం, దుష్ట చతుష్టయాన్ని రాజకీయంగా సమాధి చేసేంద‌కు వైఎస్సార్సీపీ పూనుకుందని అన్నారు కొడాలి నాని. అంత‌టితో ఆగ‌క ప‌వ‌న్ క‌ల్యాణ్ ను, చంద్ర‌బాబును తిట్టిపోశారాయ‌న. అలానే ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల నిర్వాహ‌కుల‌నూ ఇదే సంద‌ర్భంలో అన‌రాని మాట‌లు అన్నారు. ఇవన్నీ రాజ‌కీయ ఉద్దేశంతో చేసినా క‌నీస విజ్ఞ‌త లేకుండా మాట్లాడ‌డం స‌బ‌బుగా లేద‌ని విప‌క్షం మండిప‌డుతోంది. ద‌త్త పుత్రుడు అంటూ పవ‌న్ ను ప‌దే ప‌దే టార్గెట్ చేస్తున్నార‌ని అయితే తాము కూడా ఊరుకునేదే లేద‌ని జ‌న‌సేన అంటోంది.

ఏ విధంగా చూసుకున్నా రాయ‌డానికి వీల్లేని భాష.. చెప్పేందుకు వీలుకాని భాష‌..ఆయ‌న భాష గురించి ఏం చెప్పినా సిగ్గుతో త‌ల‌దించుకోవాల్సిందే. మాజీ మంత్రి కొడాలి నాని నిన్న‌టి ప్లీన‌రీ ముగింపులో మ‌ళ్లీ రెచ్చిపోయారు. 420లు అంటూ ప్ర‌ధాన మీడియా నిర్వాహ‌కుల‌ను తిట్టిపోశారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనే వ్య‌క్తి సింహం అని, ఆయ‌న సింగిల్ గానే వ‌స్తాడ‌ని అన్నారు. అభిమానుల కేరింత‌లు తుళ్లింత‌ల మ‌ధ్య ఇష్టానుసారం తిట్టిపోశారు. తాము చేప‌డుతున్న సంక్షేమ ప‌థ‌కాలు ఓర్వ‌లేక చంద్ర‌బాబు, లోకేశ్ బాబు అబ‌ద్ధ ప్రచారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఇంత‌టి స్థాయిలో భాష ఉప‌యోగించి ఆయ‌నేం సాధిస్తార‌ని ? ఒక ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను, మీడియా నిర్వాహ‌కుల‌ను ఘోరంగా తిట్టి ఆయ‌నేం సాధిస్తార‌ని ?

ప్లీన‌రీలో చెప్పాల‌నుకున్న‌దేంటి ? చెప్పిందేంటి ? ఆయ‌న‌కు ద‌గ్గ‌ర్లోనే ఉండే పోల‌వ‌రం ప్రాజెక్టు గురించి మాట్లాడారా ? సుదీర్ఘ కాలంలో అంచ‌నా వ్య‌యాల స‌వ‌రింపులో నెల‌కొన్న జాప్యంపై మాట్లాడారా? అసలు రైతు బాగు కోసం ఏం చేశామో చెప్పారా ? ఎంత సేపు అధినేత భ‌జ‌న‌తో ఏమొస్తుంద‌ని విప‌క్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్ర‌జ‌ల‌కు మేలు చేసే మాట‌లు కాకుండా కేవ‌లం విప‌క్షాల‌ను తిట్టిపోయ‌డానికే ప్లీన‌రీ స‌మయాన్ని కేటాయించార‌ని విమర్శ‌లూ వినిపిస్తున్నాయి. ప్ర‌జా సంక్షేమం కోసం పాటుప‌డే ప్ర‌భుత్వాలు కేవ‌లం ఆ మాట‌ల‌పైనే దృష్టి సారిస్తే మంచి ఫ‌లితాలు అందుకోవ‌చ్చు లేదంటే స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు అని కూడా అంటున్నారు.

420 ముఠాకు రాజకీయ సమాధి తప్పదు.. అని నాని అన్నారు. 2024లో దుష్టచతుష్టయం రాజకీయ జీవితాలను పాతాళంలో పాతిపెడతాం అని కూడా అన్నారు. ప‌వ‌న్ ను ఉద్దేశించి కూడా అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. రాజకీయ ప్ర‌త్యర్థుల‌ను ఉద్దేశించి అన‌రాని మాట‌లు అన్నారు. మ‌రి! ఇవి ఆయ‌న అన్నారా లేదా అనిపించారా ఏమో కానీ ఆయ‌న మాట్లాడుతున్నంత సేపు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి న‌వ్వుతూనే ఉండ‌డం ఏం బాలేద‌ని మాత్రం టీడీపీ అంటోంది. విప‌క్షాల‌ను తిట్టించి ఆయ‌న న‌వ్వుతున్నార‌ని,అన‌రాని మాట‌లు అనిపించి, లాస్ట్ లో మా నాయ‌కుడు మాకు సంస్కారం నేర్పాడు క‌నుక ఇక్క‌డితో ఆగిపోతున్నాం అని చెప్ప‌డం కూడా ఏం భావ్యంగా లేద‌ని టీడీపీ మండిప‌డుతోంది.