Begin typing your search above and press return to search.

సుపారి మీద బిగ్ పంచ్ : మరోసారి ప్యాకేజీ స్టార్ ని చేసిన కొడాలి

By:  Tupaki Desk   |   6 Nov 2022 6:30 AM GMT
సుపారి మీద బిగ్ పంచ్ : మరోసారి ప్యాకేజీ స్టార్ ని చేసిన కొడాలి
X
పంచులకు పెద్దన్న కొడాలి నాని అనే చెప్పాలి. కొడాలి నాని మాట్లాడితే తప్పో ఒప్పో పక్కన పెడితే సోషల్ మీడియా మెయిన్ స్ట్రీం మీడియా ఫోకస్ అటెన్షన్ ఆయన మీదనే ఉంటుంది అన్నది వాస్తవం. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ ఇప్పటం టూర్ మీద చంద్రబాబు నందిగామాలో రాయి దాడి మీద కొడాలి తనదైన శైలిలో పంచులేసి మంట పెట్టారు. ఇంతకీ కొడాలి నాని అన్నదేంటంటే పవన్ కళ్యాణ్ ఇప్పటం టూర్ కేఏ పాల్ కంటే తాను ఎక్కడ వెనకబడిపోతానో అని ఆత్రం మీద చేసినదట.

ఇక పోటీ పడితే పవన్ పాల్ తోనే పడాలని కూడా ఆయన గుచ్చేసే కౌంటర్లేశారు. ఈ దేశానికి ప్రధాని కావాలని పవన్ని కోరుతూనే పాల్ తో పోటీ పడి మరీ పీఎం కావాలని సూచించారు. ఇక ఇప్పటం లో పవన్ ది ఓవరాక్షన్ అంటూ గాలి కబుర్లు చెప్పటమే తప్ప అక్కడ సాధించింది ఏముందని కొడాలి పవన్ కి క్వశ్చన్ వేశారు. పవన్ కళ్యాణ్ ది సొంత సమస్య తప్ప ఇప్పటానికి వచ్చిన సమస్య ఏదీ లేదని కూడా తేల్చేశారు

పవన్ కళ్యాణ్ ఇంటి ముందు రెక్కీ నిర్వహించి ఆయన ప్రాణానికి ముప్పు తెస్తున్నారు అన్న వార్తల మీద కూడా కొడాలి మార్క్ పంచులేశారు. ఎవడో అంటున్నాడు 250 కోట్ల సుపారీ ఇచ్చి పధకం వేశారని, నిజంగా ఆ 250 కోట్లు ప్యాకేజీగా ఇస్తే కనుక పవన్ కళ్యాణ్ తమ వైపే ఉంటాడు కదా. తమ గురించే మాట్లాడుతూ తిరుగుతారు కదా అని ఒక రేంజిలో కొడాలి పంచులేయడం విశేషం.

ఆ విధంగా ఆయన మాట్లాడడం ద్వారా సుపారీ అన్నది గాలి మాటలను చెబుతూనే పవన్ని మరోసారి ప్యాకేజీ స్టార్ ని చేసేశారు. నిజానికి పవన్ ఇంటి ముందు ముగ్గురు తాగుబోతులు గొడవ చేస్తే దాన్ని రెక్కీ అని తనను చంపబోతున్నారు అని పవన్ చెప్పడం మిగిలిన వారు తందానా అనడమేంటని కొడాలి ఫైర్ అయ్యారు. ఆ విషయం తెలంగాణా పోలీసులు తేల్చాక కూడా ఇంకా అదే మాటలు అంటున్నారు అంటే ఇదంతా సానుభూతి కోసం ఆడే డ్రామా తప్ప మరేమీ కాదని అన్నారు.

ఇక రెక్కీ వో మరోటో ఎక్కడో హైదరాబాద్ లో నిర్వహిస్తే ఏపీలో ఉన్న జగన్ ప్రభుత్వానికి ఏంటి సంబంధమని ఆయన మరో పాయింట్ లేవదీశారు. పవన్ మీద జరిగింది పబ్ రెక్కీ తప్ప మరేమీ కాదని అన్నారు. తమను ఏపీలో తిరగనివ్వడంలేదని, ప్రజాస్వామ్యం ఖూనీ అని పవన్ చంద్రబాబు చెబుతున్న మాటలన్నీ గాలి మాటలే అని కొట్టిపారేశారు.

మూడున్నరేళ్ళు అయింది ఈ రెండు పార్టీలూ ఒక్కటైనా నిర్మాణాత్మకమైన సూచన కానీ సలహా కానీ ఇచ్చాయా అని ఆయన ప్రశ్నించారు. ఒక్కటైనా ప్రజా పోరాటాన్ని నిఖార్సుగా చేశాయా అని నిలదీశారు. ఏపీకి వచ్చే పొలిటికల్ టూరిస్టులు చంద్రబాబు పవన్ అని ఆయన ఎద్దేవా చేశారు. గులకరాయిని తన మీద తానే కొట్టించుకుని సింపతీ కోసం బాబు చేస్తున్న హంగామా అని ఆయన తీసి పడేసారు. గులకరాయితొ కొడితే దెబ్బ తగలడానికి చంద్రబాబు ఏమైనా పావురాయా పిట్టా అని కొడాలి కెలికి పడేసారు.