Begin typing your search above and press return to search.

కొడాలి నానికి..నందమూరి కుటుంబంపై ఉన్న అభిమానమిదీ..

By:  Tupaki Desk   |   13 Jun 2019 5:25 AM GMT
కొడాలి నానికి..నందమూరి కుటుంబంపై ఉన్న అభిమానమిదీ..
X
వైసీపీ నుంచి గెలిచిన మంత్రి కొడాలి నాని.. ఆ పార్టీ సిద్ధాంతాలను - పార్టీని గౌరవించాలి. అయితే చాలా రోజులుగా టీడీపీలో ఎమ్మెల్యేగా పనిచేసి చంద్రబాబు చీత్కారాలు - పద్ధతి నచ్చక వైసీపీలో చేరిన కొడాలి నాని తన మాతృపార్టీపై మమకారాన్ని మాత్రం చంపుకోలేదు.

కొడాలి నాని టీడీపీతోనే రాజకీయ జీవితం ఆరంభించారు. 2004 - 20019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. జూనియర్ ఎన్టీఆర్ కు బాగా సన్నిహితుడైన నాని.. ఆయనను చంద్రబాబు పక్కనపెట్టడం.. నందమూరి ఫ్యామిలీని పాలిటిక్స్ లో అవమానించడంతో ఈయన కలత చెందారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ స్నేహితుడైన కొడాలి నానికి కూడా బాబు ఇబ్బందులు పెట్టడంతో ఆ అవమానాలను తట్టుకోలేక వైసీపీలో చేరారు. వైఎస్ మరణం తర్వాత జగన్ వెంట నడిచారు..

అయితే అనూహ్యంగా ఈ ఎన్నికల్లో కొడాలి నాని గెలవడం.. మంత్రి కూడా అవ్వడం జరిగిపోయింది. అయితే వైఎస్ ఫ్యామిలీకి టీడీపీకి ఆది నుంచి రాజకీయ వైరం ఉంది. అయినా కొడాలి నాని మాత్రం తాజాగా తనకు ఎంతో ఆప్తులైన నందమూరి హరికృష్ణ విగ్రహాన్ని తాజాగా తన నియోజకవర్గమైన గుడివాడలో ఆవిష్కరించి సంచలనం సృష్టించారు. ఎన్టీఆర్ విగ్రహం పక్కనే హరికృష్ణ చిన్న విగ్రహాన్ని నెలకొల్పారు.

హరికృష్ణకు టీడీపీలో సరైన గుర్తింపు దక్కలేదని.. ఆశించిన ప్రాధాన్యత లభించలేదని.. నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు రాజకీయంగా వాడుకొని వదిలేశాడని హరికృష్ణ విగ్రహావిష్కరణ సందర్భంగా కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఇలా వైసీపీలో మంత్రిగా ఉన్న ఏకైక కమ్మ సామాజికవర్గ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ నేతల విగ్రహావిష్కరణ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.