Begin typing your search above and press return to search.

ఎన్టీయార్ చేసిన అతి పెద్ద తప్పు.... టీడీపీ జూనియర్ దే... కొడాలి మార్క్ సెన్సేషన్

By:  Tupaki Desk   |   13 Oct 2022 11:30 AM GMT
ఎన్టీయార్  చేసిన అతి పెద్ద తప్పు.... టీడీపీ జూనియర్ దే... కొడాలి మార్క్ సెన్సేషన్
X
దివంగత ఎన్టీయార్ వెన్నుపోటు విషయం ఈ మధ్య మళ్లీ ఏపీ రాజకీయాల్లో ప్రముఖంగా ముందుకు వస్తోంది. విజయవాడలోని ఎన్టీయార్ హెల్త్ వర్శిటీకి ఆయన పేరు తీసివేయడంతో వైసీపీ తరఫున మొదలైన ఈ వెన్నుపోటు విమర్శలు ఇపుడు ఒక రేంజికి చేరాయి. ఇక ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫారం మీద వస్తున్న బాలయ్య అన్ స్టాపబుల్ ప్రోగ్రాం ప్రొమోలో చంద్రబాబు నాటి వెన్నుపోటు ఎపిసోడ్ మీద మాట్లాడుతూ తనకు ఎన్టీయార్ ఆరాధ్య దైవం అంటూ ఆయన కాళ్ళు పట్టుకుని బతిమాలాను అని చెప్పడం మీద కూడా పెద్ద ఎత్తున ఎన్టీయార్ ఫ్యాన్స్ నుంచి విమర్శలు వస్తున్నాయి.

ఇక ఈ విషయం మీద మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అయితే ప్రతీ రోజూ విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఎన్టీయార్ ని వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ఇపుడు పచ్చిగా అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. బాలక్రిష్ణ, చంద్రబాబు ఇద్దరూ కలసి ఇన్నేళ్ళ తరువాత సీనియర్ ఎన్టీయార్ మీద ఇలా విమర్శలు చేయాలనుకోవడం చాలా పెద్ద తప్పు అని కొడాలి అంటున్నారు. ఎన్టీయార్ చేసిన తప్పు ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ లో ఉన్న తన అల్లుడు చంద్రబాబుని టీడీపీలోకి తెచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రిని చేయడమే అని కొడాలి తేల్చి చెప్పారు.

అయితే ఏ మాత్రం కృతజ్ఞత లేకుండా బాబు ఆయనకు వెన్నుపోటు పొడిచారు అని విమర్శించారు. ఎన్టీయార్ వెన్నుపోటుకు లక్ష్మీ పార్వతి కారణం అని అంటున్నారని, ఆమె ఎన్టీయార్ ద్వారా ఏమి లబ్ది పొందిందని కొడాలి చిత్రమైన వాదన కూడా ఈ సందర్భంగా చెప్పడం విశేషం. ఎన్టీయార్ చివరి రోజుల్లో ఆయన గుండె జబ్బుతో బాధపడుతూంటే ఆయన వెంట ఉన్నది లక్ష్మీ పార్వతి మాత్రమే అని కొడాలి ఆమెను సమర్ధిస్తూ మాట్లాడారు.

అదే టైమ్ లో ఎన్టీయార్ పార్టీని ప్రభుత్వాన్ని చంద్రబాబు కబలించారని విమర్శలు గుప్పించారు. అలా కనుక చూస్తే ఎన్టీఆర్‌ నుంచి లక్ష్మీపార్వతికి ఏం వచ్చింది అని కొడాలి బాబుని నిలదీశారు. ఎన్టీయార్ వృద్ధాప్యంతో పాటు అనారోగ్యంతో బాధపడుతూంటే ఆయన వెంట లక్ష్మీపార్వతి తప్ప ఎవరూ లేరని కొడాలి నాని చెప్పుకొచ్చారు. ఎన్టీయార్ పిల్లలు ఆనాడు ఎక్కడ ఉన్నారని కూడా ఆయన ప్రశ్నించారు.

ఇదిలా ఉండగా తన రాజకీయ ఉన్నతికి కార‌కులు అయిన హరిక్రిష్ణకు, జూనియర్ ఎన్టీయార్ కి తాను జీవితాంతం రుణపడి ఉంటానని కొడాలి నాని చెప్పుకున్నారు. జూనియర్ సిఫార్సు వల్లనే తనకు టీడీపీ ద్వారా గుడివాడ టికెట్ వచ్చిందని కూడా కొడాలి నాని చెప్పారు. అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీయార్ తో తనకు మాటలు లేవని చెబుతూ తమ మధ్య విభేధాలు ఉన్నాయని కొడాలి ఓపెన్ అయినట్లుగా తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ మీద సర్వహక్కులూ జూనియర్ కి ఉన్నాయని నాని అంటున్నారు. 2009 ఎన్నికల వేళ ఏమీ ఆశించకుండా టీడీపీ కోసం ప్రచారం చేసిన జూనియర్ కంటే టీడీపీకి అసలైన ఆసామి ఎవరుంటారని ఆయన అంటున్నారు. ఇక అమరావతి రైతులపై కూడా కొడాలి నాని విమర్శలు చేశారు. తన మానాన తాను సినిమాలు చేసుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్‌ను అనవసరంగా అమరావతి రాజధాని అంశంలోకి లాగారని ఆయన మండిపడ్డారు అలాగే తమ ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో కట్టుబడి ఉందని కొడాలి నాని నొక్కి చెప్పడం విశేషం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.