Begin typing your search above and press return to search.

జగన్ ప్రపోజల్ కి కొడాలి నో... అసలు ఏం జరుగుతోంది....?

By:  Tupaki Desk   |   13 April 2022 10:35 AM GMT
జగన్ ప్రపోజల్ కి కొడాలి నో... అసలు ఏం జరుగుతోంది....?
X
నేను పదవుల కోసం పాకులాడేవాడిని కాను అంటూ ఈ మధ్య బిగ్ సౌండ్ చేస్తున్నారు మాజీ మంత్రి కొడాలి నాని. ఆయనకు జగన్ మలి విడత విస్తరణలో బెర్త్ కన్ ఫర్మ్ అని అంతా నూటికి నూరు శాతం భావించారు. కానీ అనూహ్యంగా మంత్రి పదవి జారిపోయింది. అది కాస్తా జోగి రమేష్ కి దక్కింది. అయితే కొడాలి నాని ఫీలింగ్స్ ఏంటి అని మీడియా ఆరా తీస్తే ఆయన‌ ఐ యామ్ ఓకే అంటున్నారు. మంత్రి పదవులు నాకు అవసరమా అని కూడా లైట్ తీసుకుంటున్నారు.

మేమేమీ చంద్రబాబు మాదిరిగా తండ్రి లాంటి మామ ఎన్టీయార్ ని వెన్నుపోటు పొడిచేసి పదవులు తీసుకునే బాపతు కాదు, మాకు ప్రజలు ముఖ్యం, పార్టీ ముఖ్యమని కొడాలి చాలానే చెప్పారు. అయితే ఇన్ని మాటలు చెప్పిన నాని తనకు ఏదో కీలకమైన పదవి ఇస్తారని జరుగుతున్న ప్రచారం మీద కూడా క్లారిటీ ఇచ్చారు.

తనకూ జగన్ కి మధ్య జరిగినవి రివీల్ చేయడం అనవసరం అని ఆయన అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే కొడాలికి క్యాబినేట్ ర్యాంక్ తో సరిసమానమైన పదవిగా ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ పదవిని క్రియేట్ చేసి మరీ ఇద్దామని జగన్ ప్రతిపాదించారుట. దాన్ని కొడాలి నాని వద్దు అంటూ తిరస్కరించారు అని ఇపుడు ప్రచారం సాగుతోంది.

మరి జగన్ పట్ల అమితమైన విశ్వాసం, అభిమానాన్ని చూపించే కొడాలి నాని ఈ ప్రతిపాదనను ఎందుకు కాదంటున్నారు అన్నది రాజకీయ చర్చగా ముందుకు వస్తోంది. నానికి పదవి ఆశలు లేవని ఎంత చెప్పుకున్నా ఆయన ఒక బలమైన సామాజికవర్గానికి చెందిన నేత అన్నది ఇక్కడ గమనార్హం. అదే టైమ్ లో ఏపీలో ఆ సామజిక వర్గానికి చెందిన పార్టీ పలు మార్లు అధికారంలోకి వచ్చింది.

ఇపుడు అపోజిషన్ లో ఉంది. మరి ఆ సామాజికవర్గానికి ఒక్క మంత్రి పదవి కూడా దక్కలేదు అంటే అది వైసీపీకే పెద్ద ట్రబుల్ గా మారుతోంది. అందుకే నానికి ఎలాగోలా ఒప్పించి పదవి కట్టబెట్టాలని ఆ పార్టీ పెద్దలు చూస్తున్నారు. కానీ నాని మాత్రం ఎందుకో వద్దు అనేస్తున్నారు. మరి ఆ పదవి మంత్రి పదవికి సాటి రాదని కాదని అంటున్నారా లేక తనకు మంత్రి పదవి దక్కలేదు అన్న బాధ మనసులో ఎక్కడో ఉందా అన్నది కూడా సీరియస్ డిస్కషన్ గా ఉంది.

ఇక గుడివాడకే తాను పరిమితం అవుతాను అని కొడాలి నాని అంటున్నారు. వైసీపీ విజయం కోసం తాము పనిచేస్తామని కూడా ఆయన ఒట్టేసి చెబుతున్నారు. ఈ నేపధ్యంలో ఆయన ప్రభుత్వ పదవి వద్దు అనుకుంటే పార్టీ పదవిని అప్పగించాలని జగన్ చూస్తున్నారు అని తెలుస్తోంది. ఆయనకు క్రిష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లా పార్టీ పగ్గాలు ఇచ్చి రీజనల్ కో ఆర్డినేటర్ ని చేయాలని చూస్తున్నారుట. మరి ఈ పదవి అయినా నాని స్వీకరిస్తారా. ఇక్కడా నో చెబితే మాత్రం కొడాలి కొడవలి పదును ఏంటో ఫ్యూచర్ పాలిటిక్స్ చెప్పాల్సిందే