Begin typing your search above and press return to search.

రేణుకమ్మా... కార్పోరేటర్ గా కూడా గెలవలేవా. ..?

By:  Tupaki Desk   |   15 Sep 2022 4:23 PM GMT
రేణుకమ్మా... కార్పోరేటర్ గా కూడా గెలవలేవా. ..?
X
ఆమె ఫైర్ బ్రాండ్. ఆది నుంచి అంతే. ఆమె బిగ్ సౌండ్ చేస్తే ఎంతటి రాజకీయ ప్రత్యర్ధులు అయినా సైలెంట్ అయిపోవాల్సిందే. ఆమె 1986లో కార్పోరేటర్ గానే తన పొలిటికల్ కెరీర్ ప్రారంభించి రాజ్యసభ మెంబర్ గా నామినేట్ అయి జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఆమె తెలంగాణా కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి. ఆమె ఒకసారి లోక్ సభ ఎంపీగా కూడా గెలిచారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. అలాంటి రేణుకమ్మను పట్టుకుని కనీసం కార్పోరేటర్ కూడా గెలవని లీడర్ అని మాజీ మంత్రి కొడాలి నానీ తీసి పక్కన పెట్టేశారు.

నిండు అసెంబ్లీలో ఆయన రేణుకమ్మ మీద ఈ కామెంట్స్ చేశారు. ఈ మధ్య అమరావతి రైతులు రెండవ విడత పాదయాత్ర చేపట్టినపుడు రేణుకాచౌదరి వచ్చి హడావుడి చేశారు. రైతులను ఉత్సాహపరచారు. జగన్ని మూర్ఖుడు అని కూడా నిందించారు. ఆయన రాజ్యం ముగుస్తోందని జోస్యం పలికారు. తాను అమరావతి రైతుల పక్షం అని ఆమె గట్టిగా చెప్పుకున్నారు.

అందుకే కాస్తా మూడు రోజులు లేట్ గా అయినా కొడాలి నానీ రివర్స్ లో ఆమె మీద మాటల తూటాలతో అటాక్ చేశారు. రేణుకమ్మకు అంత సీన్ లేదని ఎద్దేవా చేశారన్న మాట. ఖమ్మంలో రాజకీయ పలుకుబడి లేని రేణుక అమరావతిలో రచ్చ చేయడమేంటి అన్నట్లుగానే కొడాలి నాని కామెంట్స్ ఉన్నాయి మరి ఈ మాటలు వింటే లేడీ ఫైర్ బ్రాండ్ ఊరుకుంటారా. ఆమె ఇప్పటికే కొన్నిసార్లుగా జగన్ మీద ఒంటి కాలు మీద లేస్తున్నారు అనాల్సినవి అన్నీ గట్టిగానే అంటున్నారు.

ఇక ఆమెతో కొడాలి నాని పెట్టుకున్నారు, కానీ రేణుక నిప్పులు చెరిగితే అవన్నీ కూడా జగన్ మీదకే రాజుకుంటూ వస్తాయని అంటున్నారు. ఇక తన బంధువులు, మిత్రులు, ఇష్టులకు అమరావతిలో చంద్రబాబు భూములు అప్పనంగా అప్పగించారని కొడాలి నాని షరా మామూలు స్టైల్ లో కామెంట్స్ చేశారు. అమరావతిని కమ్మరావతి, భ్రమరావతి చేసింది ఎవరో కాదు చంద్రబాబే అని నిందించారు.

పాపం ఏమీ తెలియక అమరావతి భూముల కోసం రాజమండ్రీలో ఉన్న భూములను అమ్మి అక్కడ కొన్న మాజీ మంత్రి, టీడీపీ నేత బుచ్చయ్యచౌదరి ఇపుడు దిగాలు పడ్డారని కూడా కామెంట్స్ చేశారు. ఆయన అమ్మేసిన చోట రాజమండ్రీలో భూమి విలువ పదకొండు కోట్లకు చేరితే అమరావతిలో భూముల రేట్లు అమాంతం పడిపోయాయని కొడాలి నాని సెటైర్లు వేశారు. ఇలా చాలా మంది నాడు పరిగెత్తి పాలు తాగుదామని ఆరాటపడి మొత్తం బొక్కబోర్లా పడ్డారని ఆయన అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.