Begin typing your search above and press return to search.

కరోనా కంటే 'ఎల్లో' వైరస్ డేంజర్.. కొడాలి నాని ఫైర్

By:  Tupaki Desk   |   31 March 2020 11:37 AM GMT
కరోనా కంటే ఎల్లో వైరస్ డేంజర్.. కొడాలి నాని ఫైర్
X
ఏపీలో కరోనా వైరస్ మంటలు ఆరడం లేదు. దీనిపై ప్రతిపక్ష టీడీపీ రాద్ధాంతం చేయడంపై అధికార వైసీపీ మండిపడింది. టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది.

తాజాగా చోడవరం లో వృద్ధురాలి మృతిపై చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని.. కోడిగుడ్డుకు ఈకలు పీకుతున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శించారు. కరోనా వైరస్ కు భయపడి చంద్రబాబు ఇంట్లో దాక్కున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయం చేయడం మానుకోవాలని సూచించారు. తప్పుడు రాజకీయం, రాతలు రాయడానికి ఇది సందర్బం కాదని కొడాలి నాని విమర్శించారు.

రాష్ట్రంలో ప్రజలు కరోనాతో భయపడుతుంటే ఇబ్బందులు పడుతుంటే శవ రాజకీయాలు చేయడానికి చంద్రబాబుకు సిగ్గులేదా అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ప్రజలకు రేషన్ అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని.. పేర్కొన్నారు.

చంద్రబాబు ఎల్లో వైరస్ అని.. కరోనాకు తీసిపోరని.. దాన్ని భూస్థాపితం చేస్తామని కొడాలి నాని అన్నారు. ఆ వ్యాక్సిన్ పేరు వైఎస్ జగన్ అని నాని అన్నారు. చంద్రబాబుపై తిట్ల వర్షం కురిపించారు. చంద్రబాబు తో పాటు ఆ పార్టీ నేతలు సిగ్గూ శరం లేని కుక్కలని.. ప్రభుత్వం ఒక పక్క విపత్తును ఎదుర్కోవడానికి కష్టపడుతుంటే అనవసరపు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు 70 ఏళ్ల వయసున్నా సిగ్గు శరం లేదని.. బుద్ధి జ్ఞానం లేదని విమర్శించారు. చంద్రబాబుకు అనుకూలంగా తప్పుడు వార్తలు రాస్తున్న ఎల్లో వైరస్ కోరలు పీకే మందు తమ దగ్గర ఉందని నిప్పులు చెరిగారు. ఎండలో నిలబడి వృద్ధురాలు చనిపోతే శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.