Begin typing your search above and press return to search.

గుడివాడ‌లో బిగ్ ఫైటే!... కొడాలి వ‌ర్సెస్ దేవినేని!

By:  Tupaki Desk   |   13 March 2019 4:42 PM GMT
గుడివాడ‌లో బిగ్ ఫైటే!... కొడాలి వ‌ర్సెస్ దేవినేని!
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు న‌గారా మోగిన వేళ ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు లెక్క‌లేన‌న్ని వినిపిస్తున్నాయి. అసెంబ్లీతో పాటు పార్ల‌మెంటుకు కూడా ఒకే ద‌ఫా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ఏపీలో... అస‌లు సిస‌లు బ‌రి ఎక్క‌డ‌న్న విష‌యంపై ఇప్ప‌టికే పెద్ద ఎత్తున విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో కృష్ణా జిల్లా గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌ర‌గ‌నున్న పోటీ కూడా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ స్థానం విప‌క్ష వైసీపీకి కంచుకోట కిందే లెక్క. వైసీపీ ప్రారంభానికి ముందు టీడీపీకి కంచుకోట‌గా ఉన్న ఈ స్థానాన్ని అప్ప‌టి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ప్ర‌స్తుత ఎమ్మెల్యే కొడాలి శ్రీ‌వెంక‌టేశ్వ‌ర‌రావు అలియాస్ కొడాలి నాని వైసీపీకి కంచుకోట‌గా మార్చేశారు. 2009 ఎన్నిక‌ల్లో టీడీపీ ఎమ్మెల్యేగానే గెలిచిన కొడాలి నాని... ఆ త‌ర్వాత వైసీపీలో చేరిపోయారు. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా అదే సీటు నుంచి బ‌రిలోకి దిగిన నాని... టీడీపీకి షాకిస్తూ విజ‌యం సాధించారు. టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావు స్వ‌స్థ‌లం ఉన్న గుడివాడ‌లో వైసీపీ విజ‌యం సాధించ‌డ‌మంటే మాట‌లు కాదు క‌దా.

ఆ త‌ర్వాత త‌న‌దైన శైలి మంత్రాంగం న‌డిపిన కొడాలి నాని... గుడివాడ‌ను వైసీపీకి కంచుకోట‌గా మార్చేశారు. ఈ సారి ఎన్నిక‌ల్లోనూ త‌న‌దే విజ‌య‌మ‌నీ దీమాగా ఉన్న నాని... టీడీపీ నుంచి ఎవ‌రు బ‌రిలోకి దిగినా కూడా త‌న‌దే విజ‌య‌మ‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ఈ సీటుపై ప్ర‌త్యేక దృష్టి సారించిన టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు.. కొడాలి నానికి చెక్ పెట్టాల్సిందేన‌ని తీర్మానించి... పార్టీ టికెట్ ను పార్టీ యువ‌జ‌న విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు - కృష్ణా జిల్లాలో మంచి పేరున్న దివంగ‌త నేత దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాశ్ కు ఇచ్చారు. పార్టీ అదేశ‌మే త‌రువాయి అన్న‌ట్టుగా దేవినేని అవినాశ్ ఇప్ప‌టికే గుడివాడ‌లో దిగిపోయారు. ఈ క్ర‌మంలో ఈ స్థానానికి జ‌ర‌గ‌నున్న పోటీ రాష్ట్రంలోనే బిగ్ ఫైట్ గా నిల‌వ‌నుంద‌ని విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. అయినా ఇప్పుడు అక్క‌డ విజ‌యం ఎవ‌రిని వ‌రిస్తుంద‌న్న విష‌యానికి వ‌స్తే... కొడాలి నానికే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయ‌న్న వాదన వినిపిస్తోంది. వ‌రుస‌గా మూడు సార్లు అక్క‌డి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాని... నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి గ్రామంలోనూ ప‌ట్టు పెంచుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు భారీ ఎత్తున కేడ‌ర్ ఏర్పాటైంది. స్థానిక నేత‌గా నానికి మంచి ఇమేజీ ఉంది. అంతేకాకుండా వైసీపీ వైపు వీస్తున్న గాలిలో నాని ఈజీగానే విన్న‌వుతార‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఇక నానిని వేధిస్తున్న ఒకే ఒక్క స‌మ‌స్య ఏమిటంటే... దేవినేని అవినాశ్ పెట్టినంత‌గా నాని ఖ‌ర్చు పెట్ట‌గ‌ల‌రా? అన్న‌దే కాస్తంత అనుమానంగా ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇక దేవినేని అవినాశ్‌ కు అనుకూలంగా ఉన్న అంశాలేమిట‌న్న విష‌యానికి వ‌స్తే... సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న‌ప్ప‌టికీ అంద‌రికీ షాకిస్తూ టీడీపీకి - ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన కొడాలి... ఉప ఎన్నిక‌ల్లోనూ స‌త్తా చాటారు. ఎంతమేర అయినా ఖ‌ర్చు చేయ‌గ‌ల స‌త్తాతో పాటు త‌న ఫ్యామిలీకి జిల్లా వ్యాప్తంగా మంచి పేరు కూడా క‌లిసి వ‌స్తుంద‌న్న వాద‌న వినిపిస్తోంది. అంతేకాకుండా అక్క‌డ గ‌డ‌చిన మూడు సార్లు గెలిచిన నానిని ఇప్ప‌టికే చూసేసిన జ‌నం... కొత్త‌గా బ‌రిలోకి దిగ‌తున్న అవినాశ్ ను కూడా ఓసారి చూద్దామ‌ని భావిస్తుండ‌టం కూడా ఆయ‌న‌కు ప్ల‌స్ అయ్యేలా ఉందట‌. ఇక అవినాశ్ మైన‌స్ పాయింట్ల విష‌యానికి వ‌స్తే... స్థానికేత‌రుడు - సొంతంగా కేడ‌ర్ లేక‌పోవ‌డం, పెద్ద‌గా ఇమేజీ లేక‌పోవ‌డ‌మేన‌ని తెలుస్తోంది. ఈ లెక్క‌ల‌న్నీ ఎలా ఉన్నా... ఇక్కడ జ‌రిగే ఎన్నిక మాత్రం బిగ్ ఫైట్ గానే ప‌రిగ‌ణించ‌క తప్ప‌ద‌న్న విశ్లేష‌ణ‌లు కొన‌సాగుతున్నాయి.