Begin typing your search above and press return to search.

ఏపీలో 40-50 శాతం ఎమ్మెల్యేలను మార్చేయాల్సిందేనన్న కొడాలి నాని

By:  Tupaki Desk   |   28 April 2022 7:30 AM GMT
ఏపీలో 40-50 శాతం ఎమ్మెల్యేలను మార్చేయాల్సిందేనన్న కొడాలి నాని
X
మంత్రిగా ఉన్న వేళ.. తన ఘాటు వ్యాఖ్యలతో తరచూ మీడియాలో హాట్ టాపిక్ గా ఉండేవారు మాజీ మంత్రి కొడాలి నాని. పదవి పోయిన తర్వాత పెద్దగాఆయన మాట్లాడటం లేదు. మీడియా ముందుకు రావటం లేదు. మంత్రి పదవి తనకు వెంట్రుకతో సమానమని.. తనకు ఎమ్మెల్యే పదవి పోతే బాధపడతానని.. మంత్రి పదవి లేనందుకు ఎలాంటి బాధ లేదని చెప్పటం తెలిసిందే. ఇలా చెబుతూనే తనను మాజీ మంత్రి అని మాత్రం పిలవొద్దని కోరటం గమనార్హం. ఇదిలా ఉంటే.. బుధవారం సీఎం కమ్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు.. ప్రాంతీయ సమన్వయకర్తలు.. జిల్లా అధ్యక్షులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్భంగా కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. విభేదాలు విడనాడి అందరూ కలిసి పని చేయాలని సీఎం ఆదేశించారన్నారు.

వచ్చే ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి వచ్చేలా కష్టపడి పని చేయాలన్నట్లు చెప్పారు. వచ్చే నెల నుంచి గ్రామ సచివాలయాల్ని ఎమ్మెల్యేలు తప్పక సందర్శించాలని చెప్పారన్నారు. సీఎం జగన్ తనను సొంత మనిషిలా చూసుకుంటుననారని.. అందుకే మంత్రి పదవి నుంచి తప్పించినా ఎలాంటి నష్టం ఉండదన్నారు.

తనను పార్టీ కోసం పని చేయాల్సిన కారణంగా మంత్రివర్గంలో స్థానం దక్కలేదన్నారు. అధినేత సూచనలతో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడకే పరిమితం కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ చేస్తానని.. సీఎం నమ్మకంతో ఇచ్చిన బాధ్యతల్ని సైనికుడి తరహాలో నిర్వర్తిస్తానని చెప్పారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ నేతలు పని చేయాలని.. సమన్వయంతో వ్యవహరించాలని దిశా నిర్దేశం చేశారన్నారు.

కొందరు ఎమ్మెల్యేల గ్రాఫ్ 40-50 శాతం ఉందని సీఎం జగన్ చెప్పారని.. గ్రాఫ్ మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని సీఎం వెల్లడించినట్లుగా చెప్పారు. గ్రాఫ్ మెరుగుపర్చుకోకపోతే పక్కన పెట్టేసే అవకాశం ఉందన్నారు.

సీఎంజగన్ చెప్పినట్లుగా కొడాలి నాని చెప్పిన వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకుంటే.. ఇప్పుడున్న 151 మంది ఎమ్మెల్యేల్లో 40-50 శాతం మంది ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్లు రావన్న విషయాన్ని కొడాలి చెప్పినట్లైందని చెప్పాలి. ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజులుగా సాగుతున్న ముందస్తు ఎన్నికల మీదా క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.