Begin typing your search above and press return to search.

ఇవేం ప్రవచనాలు కొడాలి నాని?

By:  Tupaki Desk   |   20 Dec 2019 4:52 AM GMT
ఇవేం ప్రవచనాలు కొడాలి నాని?
X
నిత్యం రాజకీయాల్లో ఫుల్ గా బిజీగా ఉండే నేత.. తనకు పూర్తి భిన్నమైన ట్రాక్ కు షిఫ్ట్ అయినప్పుడు కాస్త ఇబ్బందులు తప్పవేమో? తాజాగా ఏపీ మంత్రి కొడాలి నాని మాటలు విన్నంతనే ఈ భావన కలగటం ఖాయం. ఏపీ విపక్ష నేత చంద్రబాబును వెనుకా ముందు చూసుకోకుండా కడిగేయటంలో కొడాలి నానికున్న ఈజ్ చాలా తక్కువమందిలో ఉంటుందని చెప్పాలి.

రాజకీయంగా సెటైర్లు వేయటం.. పంచ్ డైలాగులతో బాబు పరువును గోదాట్లో కలిపేసే కొడాలి నాని.. తాజాగా చేసిన ఒక ప్రసంగం అవాక్కు అయ్యేలా చేస్తోంది. తన రాజకీయ ప్రత్యర్థుల్ని ఎటకారంతో ఆడేసుకునే కొడాలి మాష్టారు.. తాజాగా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామంలో ఆనంద ప్రార్థనా మందిరం నూతన భవనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా తనకేమాత్రం అలవాటు లేని అధ్యాత్మిక స్పీచ్ ను ఇచ్చారు. సమాజంలో ఒక వ్యక్తి తప్పు చేస్తే శిక్షించేందుకు వ్యవస్థలు ఉన్నాయని.. కానీ అదే వ్యక్తి తప్పు చేయకుండా ఆపగలిగే శక్తి భగవంతుడొక్కడికే ఉందన్నారు. తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడనే భయం.. నమ్మకంతో ఉన్నవారు ఎలాంటి తప్పులు చేయరంటూ చేసిన స్పీచ్ అకట్టుకునేలా ఉంది. మాంచి ఫ్లోలో సాగిన స్పీచ్ అక్కడితే ఆపేస్తే బాగుండేది.

కానీ.. ఉరకలెత్తే ఉత్సాహంతో ఉన్నప్పుడు కంట్రోల్ మిస్ అవుతారు కదా? కొడాలి విషయంలోనూ అదే జరిగింది. ఇదే ఇప్పుడు ఆయన మాటల్ని ఎటకారం చేసేలా చేసింది. భారతదేశంలో 800 కోట్ల మంది జనాభా ఉంటే అందులో 700 కోట్లకు పైగా ప్రార్థించేది ఆ దేవదేవుడు ఏసుక్రీస్తునేనని..అలాంటి ప్రభువు మందిరాన్ని తన చేతుల మీదుగా స్టార్ట్ చేయటం చాలా సంతోషంగా ఉందన్నారు.

ప్రపంచ జనాభా అనేందుకు బదులు భారతదేశ జనాభా అనాల్సిన మంత్రివర్యులు అలా అనేయటంతో అక్కడున్న వారు అవాక్కయ్యారు. మాంచి ఊపులో మాట్లాడుతున్నప్పుడు ఒకట్రెండు మాటలు ఎక్కువ తక్కువ మామూలే. అంతదానికే ఇలా ఎటకారం చేసేస్తారా? అంటూ మంత్రిగారి అనుచరవర్గం ఫైర్ అయిపోవటం గమనార్హం.