Begin typing your search above and press return to search.

ముద్ర‌గ‌డ బాట‌లో కోదండ‌రాం

By:  Tupaki Desk   |   29 Dec 2016 7:26 AM GMT
ముద్ర‌గ‌డ బాట‌లో కోదండ‌రాం
X
తెలంగాణ ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న భూసేక‌ర‌ణ విధానానికి వ్య‌తిరేకంగా త‌న ఇంట్లోనే దీక్ష‌కు దిగిన టీజేఏసీ ఛైర్మ‌న్ కోదండ‌రాంకు విప‌క్షాల మ‌ద్దతు దొరుకుతోంది. వివిధ పార్టీల నేత‌లు ఆయ‌న‌కు మ‌ద్దతు ప‌లుకుతున్నారు. అసెంబ్లీ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించి మ‌రీ కాంగ్రెస్ - టీడీపీ - సీపీఎం నేత‌లు ఆయ‌న ఇంటికి బ‌య‌లుదేరారు. కాగా ప్ర‌జా ఉద్య‌మాల‌కు పేరుగాంచిన కోదండ‌రాం ప్ర‌స్తుత త‌న దీక్ష‌కు ఏపీలోని కాపు నేత ముద్ర‌గ‌డ ప‌ద్మానాభాన్ని ఆద‌ర్శంగా తీసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. ధ‌ర్నాలు - స‌భ‌లు - ర్యాలీల‌తో ద‌ద్ద‌రిల్లింప‌జేయ‌డంలో ముందుండే కోదండం ఈసారి ప్ర‌భుత్వం ఆ అవ‌కాశం ఇవ్వ‌క‌పోవ‌డంతో ముద్ర‌గ‌డ త‌ర‌హాలో ఇంట్లోనే దీక్ష‌కు దిగారు. ముద్ర‌గ‌డ కూడా ప్ర‌తిసారీ దీక్ష‌లు త‌లపెట్ట‌డం... దానికి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అడ్డుత‌గ‌ల‌డం .. ఆయ‌న ఇంట్లో నిరాహార దీక్షకు దిగ‌డం... దాంతో ఉద్రిక్త‌త‌లు త‌లెత్తి ప్ర‌భుత్వం దిగిరావ‌డం తెలిసిందే. ఇప్పుడు కోదండం కూడా అదే రూటు ఎంచుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది.

భూసేక‌ర‌ణ విధానానికి నిర‌స‌న‌గా ఈ రోజు హైద‌రాబాద్‌ లోని ఇందిరాపార్క్ వ‌ద్ద ధ‌ర్నా చేయ‌డానికి కోదండ‌రాం త‌ల‌పెట్టారు ఇందుకోసం అనుమ‌తి తీసుకోవ‌డానికి నిన్న పోలీసుల‌కి విన‌తి ప‌త్రాన్ని కూడా స‌మ‌ర్పించారు. అయితే, ఆయ‌న ధ‌ర్నాకు పోలీసులు అనుమ‌తి నిరాక‌రించారు. అలాగే ధ‌ర్నాలో పాల్గొన‌డానికి ప‌లు జిల్లాల నుంచి త‌ర‌లివ‌స్తున్న టీజేఏసీ నేత‌ల‌ను పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ అరెస్టు చేశారు. దీంతో ఆగ్ర‌హించిన కోదండ‌రాం ఈ రోజు త‌న ఇంట్లోనే దీక్ష‌కు దిగారు. శాంతియుతంగా చేయ‌త‌ల‌పెట్టిన ధ‌ర్నాను అడ్డుకోవ‌డం ఏంట‌ని ఆయ‌న మండిప‌డ్డారు. దీంతో ఆయ‌న ఇంటి వ‌ద్ద ఉద్రిక్తత నెల‌కొంది. భారీగా పోలీసులు మోహ‌రించారు.

మ‌రోవైపు కోదండ‌రాం చేప‌ట్టిన‌ దీక్ష‌కు కాంగ్రెస్‌ - టీడీపీ - సీపీఎం పార్టీలు మ‌ద్ద‌తు తెలిపాయి. నిన్న శాస‌న‌స‌భ‌లో భూసేక‌ర‌ణ చ‌ట్టం బిల్లు స‌వ‌ర‌ణ‌ల‌కు ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే. అయితే, స‌భ‌లో సీఎం కేసీఆర్ మాట్లాడిన త‌రువాత త‌మ‌ను మాట్లాడ‌నివ్వ‌లేద‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు ఈ రోజు మండిప‌డ్డారు. త‌మ నిర‌స‌న‌ను లేఖ రూపంలో స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారికి అంద‌జేసి వారంతా అసెంబ్లీని బ‌హిష్క‌రించారు. అక్క‌డి నుంచి కోదండరాంను క‌లిసేందుకు వెళ్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/