Begin typing your search above and press return to search.

కోదండరాం కు మిగిలింది ఇదొక్క‌టే

By:  Tupaki Desk   |   8 Dec 2018 5:30 AM GMT
కోదండరాం కు మిగిలింది ఇదొక్క‌టే
X
తెలంగాణ‌ లో గ‌త ఏడాదిన్న‌ర రెండేళ్లు గా ఇటు రాజ‌కీయ పార్టీలు....అటు తెలంగాణ‌వాదులు ఆస‌క్తిక‌రం గా గ‌మ‌నించిన వ్య‌క్తి ఎవ‌రైనా ఉన్నారా అంటే రిటైర్డ్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం అని చెప్పుకోవ‌చ్చు. తెలంగాణ ఉద్య‌మం లో రాజ‌కీయ పార్టీల‌కు అతీతంగా క్రియాశీలంగా వ్య‌వ‌హ‌రించిన ప్రొఫెస‌ర్ అనంత‌రం టీఆర్ ఎస్ స‌ర్కారుకు వ్య‌తిరేక జెండా ఎగుర‌వేసి త‌న‌దైన శైలిలో పోరుబాట ప‌ట్టారు. అనంత‌రం తెలంగాణ జ‌న‌స‌మితి పేరు తో ఓ పార్టీ ఏర్పాటు చేసిన ఆయ‌న ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని భావించారు. అయితే, ఆ ఆశ‌లు అడియాస‌ల‌య్యాయ‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. తాజా గా జ‌రిగిన ఎన్నిక‌ల్లో పొత్తు ప‌ర్వం-సీట్ల కేటాయింపు- పోలిగ్ స‌ర‌ళి చూస్తుంటే ఇది స్ప‌ష్ట‌మ‌వుతోందంటున్నారు.

టీఆర్ఎస్ వ్య‌తిరేక‌తే ప్ర‌ధాన అజెండా గా ఉద్య‌మ నేప‌థ్యమే అండ‌గా తెలంగాణ జనసమితిని కోదండ‌రాం ఏర్పాటు చేశారు. ఒంట‌రి గా పోటీ చేస్తామ‌న్న కోదండ‌రాం అనంత‌రం కాంగ్రెస్‌-టీడీపీ- సీపీఐ తో ప్రజాకూటమి లో జ‌ట్టుక‌ట్టారు. పొత్తులో భాగంగా ఆ పార్టీ రాష్ట్రం లో తొమ్మిది స్థానాల్లో పోటీకి దిగింది. వీటి లో నాలుగు అంబర్‌ పేట (నిజ్జన రమేష్‌) - మల్కాజిగిరి (దిలీప్‌ కుమార్‌) - సిద్దిపేట (భవానీ రెడ్డి) - వర్దన్నపేట (దేవయ్య) స్థానాల్లో సొంతంగానూ - మిగిలిన ఐదు దుబ్బాక (రాజ్‌ కుమార్‌) - వరంగల్‌ తూర్పు (గాదె ఇన్నయ్య) - ఆసిఫాబాద్‌ (ఆత్రం సక్కు) - మిర్యాలగూడ (విద్యాధర్‌ రెడ్డి) - మహబూబ్‌ నగర్‌ (రాజేందర్‌ రెడ్డి) స్థానాల్లో కాంగ్రెస్‌ తో కలిసి `స్నేహపూర్వక` బరిలో నిలిచింది. ఈ పోటీ ద‌శ‌లోనే ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు వినిపించాయి. ఎనిమిది స్థానాలు ఇస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చిందని ఆ హామీని కూడా నిలబెట్టుకోలేకపోయిందని టీజేఎస్ నేత‌ లే వాపోతున్నారు. తాము 12 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తే నాలుగింటి లో సొంతంగానూ - మిగిలిన ఐదింటిలో కాంగ్రెస్‌ తో కలిసి స్నేహపూర్వక బరిలో నిలవాల్సి వచ్చిందని అంటున్నారు.కాంగ్రెస్‌ తమను మోసిం చేసిందని ఆ పార్టీ వర్గాలు బహిరంగంగానే విమర్శిస్తున్నాయి.

ఈ విమ‌ర్శ‌ల సంగ‌తి అటుంచితే - శుక్రవారం ఎన్నికలు ముగియడంతో మొత్తం స్థానాల్లో ఎంత మంది అభ్యర్థులు విజయం సాధిస్తారోనని ఆ పార్టీ లెక్కల్లో మునిగింది. కానీ ప‌రిస్థితి ఎంత మాత్రం ఆశాజ‌న‌కంగా లేద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. కానీ వ‌చ్చే ఐదేళ్లు మనుగడ సాగించాలంటే ఆ పార్టీ అభ్యర్థులు కనీసం నాలు గైదు స్థానాల్లో గెలవడం తప్పనిసరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, అలాంటి అవ‌కాశం ఉందా? అనేది కాల‌మే తేల్చాలి. ప్ర‌స్తుత త‌రుణంలో కోదండ‌రాం ముందు మిగిలింది ఫ‌లితాల కోసం ఎదురుచూడ‌టం - భ‌విష్య‌త్ గురించి ఆశావాహ దృక్ప‌థంతో ఉండ‌టం మాత్ర‌మేన‌ని ప‌లువురు అంటున్నారు.