Begin typing your search above and press return to search.

కేసీఆర్ పాలన ఎంత డేంజరో చెప్పిన కోదండరాం

By:  Tupaki Desk   |   26 Oct 2016 4:45 AM GMT
కేసీఆర్ పాలన ఎంత డేంజరో చెప్పిన కోదండరాం
X
తెలుగు ప్రజలకు ఏ మాత్రం పరిచయం చేయాల్సిన అవసరం లేని పేర్లల్లో కోదండరా మాష్టారు ఒకరు. తెలంగాణ రాష్ట్ర సాధనకు సంబంధించిన క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే.. కేసీఆర్ తో పాటు కోదండరాంకు ఇవ్వాల్సిందే. పుష్కరానికి పైబడి కేసీఆర్ ఉద్యమం నడిపినా.. కోదండరాం మాష్టారు ఉద్యమ సీన్లోకి వచ్చాక సమీకరణాలు వేగంగా మారిపోయాయి. తెలంగాణ సెంటిమెంట్ మరింత బలోపేతమైంది. కేసీఆర్ ను విబేధించేవారు.. ఆయన మాటల్ని విశ్వసించని వారంతా కోదండరాంతో జత కట్టటానికి ఏ మాత్రం సందేహించకపోవటంతో తెలంగాణ ఉద్యమం మరింత బలోపేతమైన విషయాన్ని ఎవరూ కాదనలేరు.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమంలో కీలకభూమిక పోషించిన వారంతా అధికారపక్షంతో జత కట్టి.. పదవుల్ని చేపట్టగా.. కోదండరాం మాష్టారు మాత్రం అందుకు భిన్నంగా సీదాసాదాగా ఉండిపోయారు. తన అధ్యాపక వృత్తిని కొనసాగించి రిటైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర సంక్షేమమే తన ఎజెండాగా చెప్పి.. పదవులు.. పవర్ తనకేమాత్రం ఇష్టం లేని విషయాలుగా చేతల్లో చూపించిన అరుదైన ఉద్యమకారుడిగా కోదండరాంను చెప్పొచ్చు. అలాంటి ఆయన.. గడిచిన కొద్దినెలలుగా తెలంగాణ అధికారపక్షాన్ని తప్పుపడుతున్నారు.

కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల్లోని లోపాల్ని ఎత్తి చూపటమే కాదు.. ప్రభుత్వ వైఖరి మారాలని పట్టుబడుతున్నారు. అయితే.. ఆయన మాటలను ఏ మాత్రం పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వంపై ఆయనిప్పుడు గుర్రుగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అలాంటి సమస్యలే పట్టి పీడించటం.. తెలంగాణ రాష్ట్రంలోనూ రైతులకు ఆత్మహత్యలు తప్పకపోవటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆయన.. తాజాగా ప్రభుత్వ వైఖరికి నిరసనగా దీక్ష చేపట్టారు.

ఇదిలా ఉండగా.. కోదండరాంతో ఒక ప్రముఖ ఛానల్ ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆసక్తికర అంశాలకు కోదండరాం మాష్టారు సూటిగా సమాధానాలు చెప్పేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కారుపై ఒక కీలక వ్యాఖ్య చేశారు. ‘‘పాలనలో లోపాల్ని ఎత్తి చూపే వారి వల్లే అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని ఆరోపించటం తప్పు. మాకు అన్నీ తెలుసు కదా మీరెవరు చెప్పటానికి అని పాలకులు ప్రశ్నించటం అంటే నా దృష్టిలో చాలా ప్రమాదకరమైన ధోరణి. ప్రభుత్వం తనను ప్రశ్నిస్తున్న సంస్థల పట్ల సహనంతో ఉండాలి. వారు చెప్పే అభిప్రాయం తప్పు అయితే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు కదా’’ అని వ్యాఖ్యానించటం గమనార్హం.

ఈ ఇంటర్వ్యూలో వివిధ అంశాల మీద కోదండరాం మాష్టారు చెప్పిన మాటలు చూస్తే..

= ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ బలోపేతం కావటానికి ఉన్న మార్గం ప్రజలకు దగ్గర కావటమే. కానీ.. ఇంకో పార్టీలోని రాజకీయ నేతను కొనేసి తెచ్చుకొని తాను బలపడతానని అంటే అది ప్రజాస్వామ్య పద్ధతి కానే కాదు. పార్టీ విసిరే పైసలకు వచ్చేటోడు మరో పార్టీ ఇంకో ఆకర్షణ చూపితే మరోవైపు పోడని చెప్పలేం కదా. పైసలిచ్చి ఎమ్మెల్యేలను కొనుక్కోవాలని చూడటం ఎంత తప్పో.. అవతలివాళ్లు కూడా పైసలిచ్చి ఓటు వేయించుకోవాలని చూడటం కూడా అంతే తప్పు.

= బంగారు తెలంగాణ అంటే కొంతమంది దృష్టిలో కొంత ఉత్పత్తి పెరగటమే. ఒక రోడ్డు బాగు పడిపోగానే.. బంగారు తెలంగాణ అయిపోయిందని కొందరు అనుకుంటారు. ప్రతి మనిషీ ఆత్మగౌరవంతో జీవిస్తూ.. సామాజిక న్యాయం పొందినప్పుడు అసలైన తెలంగాణ ఏర్పడుతుందని భావిస్తున్నా.

= ఈ ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సరళీకరణ విధానాల ప్రభావం కారణంగా ఈ రంగాలను విస్మరించారు. ఈ రోజు తెలంగాణలో వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ.. అలా జరగటం లేదు. విద్య.. వైద్యం అందరికి అందుబాటులోకి తేవాలి.

= మల్లన్నసాగర్ పై మేం పోరాడే నాటికి డీపీఆర్ అన్నది కూడా సిద్ధం కాలేదు. డీపీఆర్ లేకుండా ప్రాజెక్టు ఎలా కడతారు? మేం దీన్ని నిలదీశాం. ప్రభుత్వాలు తప్పు చేసేది ఇలాంటి విషయాల్లోనే. చట్టం చెప్పిన సూత్రాల ప్రకారం నడుచుకోవాలి. మేం అధికారంలో ఉన్నాం కాబట్టి అన్నీ కరెక్టుగా చేస్తాం మాకు వదిలేయొచ్చుగా అంటే.. ఇక చట్టం ఎందుకు? రాజ్యాంగం ఎందుకు? ఎన్నికలు ఎందుకు? టీఆర్ ఎస్ ప్రభుత్వంలో ప్రధాన లోపం ఏమిటంటే.. భూసేకరణ విషయంలో చట్టం కల్పించిన హక్కులన్నింటిని విస్మరించ‌డ‌మే. ఆసైన్డ్ భూములున్న వారిని బెదిరించి భూమి తీసుకోవటం ఏ మేరకు సమంజసం..?

= మాకు అన్ని తెలుసు కదా? మీరు చెప్పేదేమిటి? అన్న ప్రశ్నలే నా దృష్టిలో చాలా ప్రమాదకరమైన ధోరణి. ప్రభుత్వం ప్రశ్నించే వారి పట్ల సహనంతో ఉండాలి. వారు చెప్పేది తప్పు అయితే ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వం పట్ల మరింత గౌరవం పెరుగుతుంది. వారు చెప్పేది వాస్తవమే అయితే ప్రభుత్వానికి పడిపోయే కిరీటాలు ఏమీ లేవు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సలహాలు వినటం అవసరం. ప్రజాస్వామిక దేశాల్లో ప్రభుత్వానికి చెట్టుకున్నంత.. భూమికి ఉన్నంత.. రాయికి ఉన్నంత సహనం ఉండాలి.

= తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యతల విషయంలో విఫలమవుతోంది. వివిధ వర్గాల ప్రయోజనాలను గుర్తించటంలోనూ.. వాటిని పరిష్కరించటంలోనూ విఫలమవుతోంది. సగటు మనిషి ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వానికి చేరటం లేదు. ఈ రోజు మల్లన్నసాగర్ ప్రజల సమస్యలోనూ ఇలాంటి కోణమే కనిపిస్తుంది. వారి ఆవేదన చెబితే వినాలి కదా. కానీ.. ప్రజలు తమ బాధలు చెప్పుకోవటానికి ఉన్న దారులన్నీ మూసేశారు.

= ఒక పార్టీ రాజకీయ నాయకుడ్ని తెచ్చుకుంటే నేను బలపడతాను అనుకోవటం తప్పు. పైసలకు వచ్చినోడు.. ఇంకా ఆకర్షణ చూపిస్తే.. ఇంకోవైపు పోడని చెప్పగలమా? ప్రభుత్వాన్ని పడగొట్టటానికి జరిగిన ప్రయత్నాల్ని రాజకీయంగా ఎదర్కొని ఉంటే.. కచ్ఛితంగా ఇంకాస్త ఎక్కువ మద్దతు వచ్చేది. మేం కూడా మద్దుతుగా నిలిచేవాళ్లం. ఎన్టీఆర్ ను 1984లో బర్తరఫ్ చేసినప్పుడు ప్రజల్లో ఎంత పెద్ద ప్రతిస్పందన వచ్చిందో తెలుసు కదా. అప్పట్లో మేం పౌరహక్కుల సంఘంలో ఉండి అలాంటి పద్ధతులను విమర్శిస్తూ కరపత్రాలు వేశాం.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/