Begin typing your search above and press return to search.

ఒత్తిడి అయితే ఉంది కానీ నిర్ణ‌య‌మే తీసుకోలేద‌ట‌

By:  Tupaki Desk   |   15 Nov 2017 7:40 AM GMT
ఒత్తిడి అయితే ఉంది కానీ నిర్ణ‌య‌మే తీసుకోలేద‌ట‌
X
త‌మ‌కు తిరుగు లేద‌న్న‌ట్లుగా దూసుకెళుతున్న తెలంగాణ స‌ర్కారుకు ముకుతాడు వేసే స‌త్తా ఉన్న అతి కొద్దిమందిలో తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మ నేత.. మాష్టారు కోదండ‌రాంగా చెప్పాలి. ఉద్య‌మ‌నేత‌గా సుప‌రిచిత‌మైన మాష్టారు.. తెలంగాణ రాష్ట్ర సాధ‌న త‌ర్వాత ప‌ద‌వులు.. అధికారానికి దూరంగా ఉండి సామాన్య ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న వారిలో కోదండ‌రాం ముందుంటారు. అలాంటి ఆయ‌న రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే? అన్న‌ది ఎంతోకాలంగా న‌లుగుతున్న ప్ర‌శ్న‌.

కేసీఆర్ కు ధీటుగా రాజ‌కీయాలు చేయాలంటే ప్ర‌జాజీవితంలో ఎలాంటి మ‌చ్చ లేని కోదండం లాంటి వ్య‌క్తి రాజ‌కీయాల్లోకి రావాల్సి ఉంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్తం చేసే వారు చాలామందే క‌నిపిస్తారు. ప్ర‌స్తుతం ఉన్న పార్టీల‌కు భిన్నంగా.. కొత్త రూపులో వ‌చ్చే పార్టీకి తెలంగాణ‌లో ఆద‌ర‌ణ ఉంటుంద‌ని.. అలాంటి పార్టీకి కోదండం మాష్టారి లాంటి క్లీన్ చిట్ ఉన్న వ్య‌క్తి అయితే మ‌రింత బాగుంటుంద‌న్న అభిప్రాయం ఉంది.

రాజ‌కీయాల్లోకి రావ‌టం.. రాజ‌కీయ పార్టీ ఏర్పాటు విష‌యంలో కోదండ‌రాం ఎటూ తేల్చుకోలేక‌పోతున్నార‌ని చెబుతారు. తొలుత నుంచి పార్టీ కంటే ప్ర‌జా ఉద్య‌మాల పైనే ఆయ‌న మ‌క్కువ ప్ర‌ద‌ర్శించేవారు. అయితే.. పోరాడి సాధించుకున్న తెలంగాణలో త‌మ ఆశ‌లు.. ఆకాంక్ష‌లు వాస్త‌వ రూపం దాల్చ‌టం లేద‌న్న అసంతృప్తి ఉంది.

తెలంగాణ రాష్ట్ర ఫ‌లాలు సామాజిక తెలంగాణ‌గా మారితే త‌ప్పితే లాభం లేద‌న్న భావ‌న‌ను కోదండం వ్య‌క్తం చేస్తుంటారు. ఒంటెద్దు పోక‌డ‌ల‌తో పాటు.. కేసీఆర్ తీరుపై కోదండం అండ్ కో తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. క‌నీస నిర‌స‌న‌కు సైతం కేసీఆర్ స‌ర్కారు నో అంటున్న తీరుపై ఆయ‌న గుర్రుగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్ పాల‌న‌కు చెక్ పెట్టేలా రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణ అవ‌స‌ర‌మ‌ని.. అందుకు కోదండం మాష్టారి లాంటి మ‌చ్చ‌లేని నేత ఎంట్రీ ఇస్తే తెలంగాణ రాజ‌కీయ ముఖ‌చిత్రంలో మార్పు వ‌స్తుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ వాద‌న నిజ‌మేన‌న్న మాట తాజాగా మాష్టారి మాట వింటే అర్థ‌మ‌వుతుంది.

పార్టీ పెట్టాల‌న్న ఒత్తిడి త‌న‌పై వ‌స్తున్న మాట నిజ‌మేన‌ని ఆయ‌న వెల్ల‌డించారు. అయితే.. ఇందుకు సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేద‌న్నారు. పార్టీ ఏర్పాటు చేసే ప‌క్షంలో ముందుగా ప్ర‌క‌టిస్తామ‌ని ఆయ‌న చెబుతున్నారు. పార్టీ ఏర్పాటుపై కోదండం రానున్న రోజుల్లో కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.