Begin typing your search above and press return to search.

కోదండ‌రాం సీఎం అయినా జేఏసీ ఉంటుంద‌ట‌

By:  Tupaki Desk   |   26 Dec 2016 4:13 AM GMT
కోదండ‌రాం సీఎం అయినా జేఏసీ ఉంటుంద‌ట‌
X
ఆచితూచి మాట్లాడటం పోయి చాలా కాలమే అయ్యింది. విమర్శల పదునెక్కి కొద్ది కాలమైంది. ఇక.. ఇప్పుడు సూటిగా..స్పష్టంగా వార్నింగ్ లు ఇచ్చేసే సమయం ఆసన్నమైంది. అవును.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరో మాట లేకుండా.. మొహమాటానికి పోకుండా ముఖం మీద పంచ్ పడేలా..సూటిగా.. ఘాటుగా వార్నింగ్ ఇచ్చేశారు తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం. ఆయన అధ్యక్షతన తాజాగా సమావేశమైన జేఏసీ.. పూర్తి స్థాయి కమిటీని ఎన్నుకున్నారు. జేఏసీ భవిష్యత్ ప్రణాళిక ఏమిటన్న అంశంపైనా ఫోకస్ చేశారు.

కేసీఆర్ పాలన మీదా.. ఆయన సర్కారు తీసుకుంటున్న నిర్ణయాల మీదా కోదండం మాష్టారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేసీఆర్ పాలనను హుందాగా విమర్శించే ప్రయత్నాన్ని గులాబీ నేతలు అస్సలు ఇష్టపడకపోవటమే కాదు.. తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఒకప్పటి తన శిష్యుడైన.. ఎంపీ బాల్క సుమన్ మాటలే ఇందుకు నిదర్శనం. ఒకప్పడు తానెంతో అభిమానం ప్రదర్శిస్తూ గురువుగారి సలహాల కోసం తిరిగిన ఆయన.. ఈ రోజు కోదండం మాష్టారి మీద ఒంటికి మీద లేవటమే కాదు.. ఎంత మాట పడితే అంత మాట అంటూ చులకన చేయటం లాంటివి కోదండం మాష్టారి మైండ్ లో రిజిష్టర్ కాకుండా పోవన్న విషయాన్ని మర్చిపోకూడదు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఏం చేయాలనుకున్నామో.. మిగిలిన వారి కంటే కోదండం మాష్టారికి ఎక్కువ క్లారిటీ ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. తానెన్నోకలలు కన్న తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తన ఊహలకు భిన్నంగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన.. సాపేక్షంగా ఇచ్చే సలహాల్ని.. సూచనల్ని తిరస్కరించటమే కాదు.. తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేయటం.. తన ఉనికిని ప్రశ్నించేలా మాట్లాడటం లాంటి వాటితో కోందండం మాష్టారి నోటి ‘మాట’ను మార్చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇందుకు తగ్గట్లే తాజాగా ఆయన వ్యాఖ్యలున్నాయి. ప్రజల అవసరాలకు తగ్గట్లు పాలన ఉండాలే కానీ పాలకుల ఇష్ట ప్రకారం కాదన్న కోదండం మాష్టారు..‘‘ఒక డాక్టరు మందు ఇవ్వకుంటే మరో డాక్టర్ దగ్గరకు పోకుండా ఉంటామా? ఇప్పుడున్న డాక్టరు వైఖరి మార్చుకుంటారని ఆశిస్తున్నా. డాక్టర్ వైఖరి మారకుంటే ఏమైతదో మీరే చూస్తరు’’ అంటూ సూటిగా.. సుత్తి లేకుండా విషయాన్ని తేల్చేశారు.

పాలనను వ్యతిరేకించటమే జేఏసీ లక్ష్యం కాదని స్పష్టం చేసిన కోదండం మాష్టారు.. ప్రజల సమస్యల కోసం పాలకుల్ని ప్రశ్నించటానికి పునరంకితమైన సంస్థగా జేఏసీని అభివర్ణించారు. జేఏసీ రాజకీయ వేదిక కాదని.. జేఏసీగానే కొనసాగుతుందన్న ఆయన.. సమస్యలపై అధ్యయనం చేసి.. ప్రభుత్వానికి నివేదించి.. ప్రజల్లో ప్రచారం చేసిన తర్వాత సమస్య పరిష్కారం కాకుంటే ఆందోళనకు దిగుతామన్న ఆయన.. అవసరమైతే ఎంత పెద్ద ఉద్యమాలకైనా సిద్ధమని ప్రకటించటం గమనార్హం.

ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల్ని ఆయన వ్యతిరేకించారు. అలాంటి వాటిల్లో శాంపిల్ గా కొన్ని చెబితే.. ‘‘భూసేకరణ చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేయటం.. జోనల్ వ్యవస్థతో తీవ్ర నష్టం.. నిరుద్యోగులపై తీవ్ర పరిణామాలుఉంటాయని.. దీనిపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే జోనల్ వ్యవస్థను పునర్ వ్యవస్థీకరించాలన్నారు. నిరుద్యోగాన్ని నిర్మూలించటమే లక్ష్యమన్న రీతిలో ఆర్థిక విధానాలు ప్రకటించాలన్న కోదండం.. లోకాయుక్తను పెంపొందించి.. రాజకీయ నాయకుల్ని ఆ పరిధిలోకి తీసుకురావాలన్నారు. నిజాం షుగర్స్ పై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన అసంబద్ధంగా ఉందన్న ఆయన.. ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని.. క్రమంగా రైతుల్ని భాగస్వామ్యం చేయాలన్నారు. ఆదివాసీలకు చట్టబద్ధంగా దక్కిన భూమిని గుంజుకుంటున్నారని.. వారి భూములు వారికి తిరిగి ఇవ్వాలన్న ఆయన.. మహిళా సాధికారత.. భద్రత కల్పించాలని.. ప్రభుత్వంలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలంటూ పలు డిమాండ్ల చిట్టాను విప్పి చెప్పారు.

ఇవే కాదు.. సమైక్య రాష్ట్రంలో విలువల్లేని రాజకీయాలు ఉన్నాయని.. తెలంగాణ రాష్ట్రంలో అందుకు భిన్నమైన రాజకీయాలు ఉంటాయని ఆశించామని.. కానీ.. రాష్ట్రంలోనూ విలువల్లేని రాజకీయాలే ఉన్నాయంటూ మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అమలు చేయాల్సిందేనని.. ఆ బాధ్యత స్పీకర్ మీద ఉందన్న ఆయన.. గవర్నమెంటు ఆఫీసుల్లో సిటిజన్ చార్టర్ ను చట్టబద్ధంగా అమలు చేయాలన్నారు. ప్రజా సమస్యల మీదా ఎంత పెద్ద ఉద్యమానికైనా తాము సిద్ధమేనంటూ కోదండం మాష్టారు బహిరంగంగా ఇచ్చిన వార్నింగ్ పైన ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగతంగా.. వ్యవస్థకు అధినేతగా ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/