Begin typing your search above and press return to search.

తెలంగాణ ఇంటెలిజెన్స్ ఇంత వీకా?

By:  Tupaki Desk   |   10 Nov 2016 7:55 PM GMT
తెలంగాణ ఇంటెలిజెన్స్ ఇంత వీకా?
X
తెలంగాణ జేఏసీ చైర్మెన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఆస‌క్తిక‌ర విమ‌ర్శ చేశారు. త‌న‌పై ప్ర‌భుత్వ పెద్ద‌లు చేస్తున్న విమ‌ర్శలు శృతి మించిపోతున్న నేప‌థ్యంలో ప‌రిపాల‌న ప‌రంగా ఉన్న వైఫ‌ల్యాల‌పై సెటైర్ వేశారు. కోదండ‌రాం కాంగ్రెస్‌ పార్టీ ఏజెంట్ అని టీఆర్‌ ఎస్ ఎంపీ బాల్క సుమ‌న్ పేర్కొంటూ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియా గాందీని కలిసి వచ్చార‌నిఆరోపించారు. దీనిపై కోదండ‌రాం ఘాటుగా స్పందిస్తూ జూన్‌ 16న వారణాసి వెళ్లాను తప్ప ఢిల్లీకి వెళ్లలేదన్నారు. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను? ఎవరితో మాట్లాడుతున్నానో..? కూడా కనిపెట్టలేనంత బలహీనంగా తెలంగాణ ఇంటలిజెన్స్‌ విభాగం ఉన్నదా? అని కోదండ‌రాం విమర్శించారు.

తమపై విమర్శలు చేసిన వారిపై కోపం లేదని, ఆరోపణలు చేయించిన వారికే సమాధానం చెబుతున్నామని ప‌రోక్షంగా సీఎం కేసీఆర్‌పై జేఏసీ చైర్మెన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ఘాటుగా స్పందించారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తే సర్కారు దాడులకు దిగుతోందని, వాటికి భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరటాన్ని ప్రభుత్వం నేరంగా భావిస్తోందన్నారు. దాడులు చేయటాన్ని మాని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోదండ‌రాం హితవు పలికారు. 'వ్యవసాయానికి ఒక విధానం ప్రవేశపెట్టాలని చెప్పాం. రైతు ఆత్మహత్యలు అరికట్టాలని కోరాం. ఎస్సీ - ఎస్టీ బలహీన వర్గాలకు కేటాయించిన నిధులను వారి కోసం ఖర్చు చేయాలని సూచించాం. సర్కారు దృష్టికి సమస్యల్ని ఎప్పటికప్పుడూ తీసుకెళ్తున్నాం. అయినా పట్టించుకోవట్లేదు' అని వాపోయారు. చెప్పినవన్నీ ప్రభుత్వం పెడచెవిన పెడుతోందన్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే లేనిపోని ఆరోపణలు చేయిస్తోందన్నారు. వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. నయీమ్‌ ఆస్తుల వివరాలు వెల్లడించాలన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని, చ‌ర్చ‌లకు జేఏసీ నేతలు సిద్ధంగా ఉన్నారని కోదండ‌రామ్ తెలిపారు.

మల్లన్న సాగర్‌ నిర్వాసితుల హక్కులను పరిరక్షించాలని కోదండ‌రాం కోరారు. కరువు సమయంలో పర్యటనలు చేసి రైతులను ఆదుకోవాలని కోరితే సర్కారు పెడచెవిన పెట్టిందన్నారు. జూలై నెలలోనే డీజీపీని కలిసి హాంగార్డుల సమస్యలు పరిష్కరించాలని కోరినా పట్టించుకోలేదన్నారు. న‌వంబరు 11న మంథనిలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులతో ముఖాముఖి కార్యక్రమాన్ని చేపడతామని కోదండ‌రాం ప్ర‌క‌టించారు. 13న వైద్య రంగం సమస్యలపై - 20న సాగునీటి ప్రాజెక్టులు - రిజర్వాయర్లు - విద్యుత్‌ కేంద్రాలు - ఓపెన్‌ కాస్ట్‌ ల సమస్యలపై హైదరాబాద్‌ లో సదస్సు నిర్వహిస్తామన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/