Begin typing your search above and press return to search.

బిగ్ బీకి, టీ స‌ర్కారుకు ముడేసిన కోదండ‌రాం

By:  Tupaki Desk   |   24 Oct 2016 1:08 PM GMT
బిగ్ బీకి, టీ స‌ర్కారుకు ముడేసిన కోదండ‌రాం
X
ప‌రిశ్ర‌మ‌లు - ప్రాజెక్టుల పేరిట తెలంగాణ స‌ర్కారు చేస్తున్న భూసేక‌ర‌ణ‌పై తెలంగాణ రాజ‌కీయ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం క‌త్తి దూశారు. ఇప్ప‌టిదాకా కేవ‌లం కేసీఆర్ స‌ర్కారు విధివిధానాల‌ను మాత్ర‌మే తుల‌నాడిన కోదండ‌రాం... భూసేక‌ర‌ణ‌కు నిర‌స‌న‌గా ఏకంగా దీక్ష‌కు దిగ‌డం క‌ల‌క‌లం రేపేదే. నిన్న హైద‌రాబాదులో కోదండ‌రాం చేప‌ట్టిన దీక్ష‌కు ప్ర‌జా సంఘాల నేత‌లు పెద్ద సంఖ్య‌లో మ‌ద్ద‌తు ప‌లికారు. నేరుగా దీక్షా శిబిరానికి వ‌చ్చిన ఆయా సంఘాల నేత‌లు... కోదండ‌రాం దీక్ష‌కు సంఘీభావం తెల‌ప‌డ‌మే కాకుండా... కేసీఆర్ స‌ర్కారుపై త‌మ‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు.

ఇక కోదండ‌రాం అయితే... భూసేక‌ర‌ణ‌లో కేసీఆర్ స‌ర్కారు వ్య‌వ‌హార స‌ర‌ళి దారుణంగా ఉంద‌ని దుమ్మెత్తిపోశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న భూసేక‌ర‌ణ‌పై ప‌లు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు అవలంభిస్తున్న వైఖ‌రిని కూడా ప్ర‌స్తావించారు. త‌ద్వారా కేసీఆర్ స‌ర్కారు మొండి వైఖ‌రిని అవ‌లంబిస్తోంద‌ని ఆయ‌న నిప్పులు చెరిగారు. త‌న ప్ర‌సంగంలో కోదండ‌రాం... బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్‌ - క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ పేర్ల‌ను కూడా ప్రస్తావించారు. కేసీఆర్ స‌ర్కారు చేస్తున్న భూసేక‌ర‌ణ‌కు నిర‌స‌న‌గా దీక్ష‌లో తీర్మానం చేసిన కోదండ‌రాం... ఈ తీర్మానంలో అమితాబ్ - స‌చిన్ పేర్ల‌ను ప్ర‌స్తావించారు. అయినా ప్ర‌భుత్వాలు సేక‌రిస్తున్న భూమికి సంబంధించిన విష‌యాల్లో అమితాబ్‌ - స‌చిన్‌ ల‌కు ప్ర‌మేయ‌మేంట‌నే డౌటు రాక మాన‌దు. దీనికి కూడా కోదండ‌రాం స‌మాధానం చెప్పేశారు. దేశ‌వ్యాప్తంగా ప్రజాద‌ర‌ణ క‌లిగిన అమితాబ్ బ‌చ్చ‌న్‌ - స‌చిన్ టెండూల్క‌ర్లు ఊరికే భూములివ్వ‌మంటే ఏ రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా అందుకు సిద్ధంగా లేద‌ని కోదండ‌రాం చెప్పుకొచ్చారు. కోరుతున్న భూమికి కార‌ణం చెప్ప‌కుండా - వ్య‌వ‌సాయం చేయ‌కుండా అమితాబ్ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో - స‌చిన్ మ‌హారాష్ట్ర‌లో ప్ర‌భుత్వ భూముల‌ను ద‌క్కించుకోలేర‌ని ఆయ‌న అన్నారు.

భూమిని దున్నుతాం... వ్య‌వ‌సాయం చేస్తామ‌ని వారు చెబితే మాత్రమే ఆ రాష్ట్రాల ప్ర‌భుత్వాలు భూముల‌నిస్తాయ‌ని చెప్పారు. అలా కాకుండా కార‌ణం లేకుండానే భూములు కావాలంటే ఎంత ప్ర‌జాదర‌ణ క‌లిగిన వారి ప్ర‌తిపాద‌న‌లనైనా దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాలు తిర‌స్క‌రిస్తాయ‌న్నారు. వ్య‌వ‌సాయేత‌ర అవ‌స‌రాల కోసం ఎంత‌టి ప్ర‌ముఖ వ్య‌క్తులు అడిగినా ఇత‌ర రాష్ట్రాల్లో భూములు ద‌క్కే ప‌రిస్థితి లేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. అయితే అన్ని రాష్ట్రాల‌కు విరుద్ధంగా అడిగిన వారికంతా... అడిందే త‌డ‌వుగా భూముల‌ను ఇచ్చేస్తున్న తెలంగాణ స‌ర్కారు వైఖ‌రిని ఏమ‌నాల‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/