Begin typing your search above and press return to search.

కేసీఆర్ కలలకు కోదండం ‘కొత్త’ చెక్

By:  Tupaki Desk   |   18 Sep 2016 7:30 AM GMT
కేసీఆర్ కలలకు కోదండం ‘కొత్త’ చెక్
X
అనుకున్నది అనుకున్నట్లు జరగాలని తపించే అధినేతల్లో తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరు. ఏది ఏమైనా.. ఒకసారి డిసైడ్ చేసిన తర్వాత వెనక్కి తగ్గేందుకు ఏ మాత్రం ఇష్టపడరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పుడున్న పది జిల్లాల స్థానే ఏకంగా 17కొత్తజిల్లాల్ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవటమే కాదు.. దసరా రోజున కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయాలన్న ధృడ సంకల్పంతో పని చేస్తున్నారు. నిజానికి.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్లో కొత్త జిల్లాల ఏర్పాటు అంత సులువు కాదు.

కానీ.. కేసీఆర్ వైఖరితో ఎన్నిఅడ్డంకులు ఎదురైనా దసరా నాటికి కొత్తజిల్లాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ షురూ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ తీరును తప్పు పడుతున్నారు తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం. దసరా నుంచి కొత్తజిల్లాల ఏర్పాటును తొందరపాటు చర్యగా అభివర్ణిస్తున్నారు. సమగ్ర నివేదిక లేకుండా.. విస్తృత ప్రజాభిప్రాయం తీసుకోకుండా..సామాజిక.. భౌగోళి.. సాంస్కృతి అంశాల్నిపరిగణలోకి తీసుకోకుండా జిల్లాల్ని విభజించటం అన్యాయంగా ఆయన గళం విప్పారు.

జిల్లాల ఏర్పాటు రాజకీయ నాయకుల స్వప్రయోజనాల కోసం జరుగుతోందన్న భావనను ఆయన వ్యక్తం చేశారు. అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా జిల్లాల్నివిభజించటం సరికాదన్న కోదండరాం.. నేతల ప్రయోజనాల కోసం జిల్లాల్ని ఏర్పాటు చేయటం ఏ మాత్రం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుందని చెప్పారు. జిల్లాల ఏర్పాటు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. తాత్కాలిక అవసరాల కోసం తీసుకొచ్చిన 1974 జిల్లాల చట్టం ఒకటిరెండు జిల్లాల ఏర్పాటుకు మాత్రమే పనికొస్తుందన్నారు. రాజకీయ పార్టీలు ఇష్టానుసారం కొత్త జిల్లాల ఏర్పాటు.. పాత జిల్లాల రద్దుకు మార్గం చూపినట్లు అవుతుందని చెప్పారు.

రాజకీయ ప్రయోజనాల్ని పక్కన పెట్టి తెలంగాణ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ముందుకు వెళ్లాలన్నారు. పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటును జేఏసీ స్వాగతిస్తూనే.. అందరిని కలుపుకుపోవాలన్న విషయాన్ని నొక్కి చెప్పటం గమనార్హం. జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్న మాటను కోదండం మాష్టారు కుండబద్ధలు కొట్టేశారు.

‘‘స్వాతంత్ర్యం తర్వాత ఏర్పాటైన జస్టిస్ ఫజల్ అలీ కమిషన్ స్ఫూర్తికి భిన్నంగా ప్రభుత్వం వ్యవహరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 244.. షెడ్యూల్ 5ను పట్టించుకోలేదు. ప్రస్తుత ఏపీ చట్టంతో జిల్లాల సరిహద్దుల్ని మాత్రమే మార్చగలం. జిల్లాల స్వరూపాన్ని మార్చేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావాలి. చట్టం తీసుకురాకుండా.. అసెంబ్లీలో చర్చ లేకుండా ప్రకటన చేసింది. విభజన చట్టంలో 1974కు అనుబంధంగా వచ్చిన 1984 నియమావళిలోని ప్రధాన విషయాల్ని విస్మరించింది’’ అని కోదండం మాష్టారు తేల్చేశారు.

పాలనా పరమైన సౌలభ్యాన్ని కూడా పట్టించుకోలేదని.. ఆర్థికాభివృద్ధి మార్గాలను పరిగణలోకి తీసుకోకుండా.. రెండున్నరేళ్ల కొత్త రాష్ట్రం అసెంబ్లీలో చర్చ జరపకుండానే కొత్త జిల్లాల విషయంలో ముందుకు వెళుతుందన్నఅభ్యంతరాన్ని కోదండం వ్యక్తం చేశారు. కొత్త చట్టాన్ని తీసుకొచ్చే వరకూ జిల్లాల ఏర్పాటును నిలిపివేయాలన్న ఆయన.. మార్గదర్శకాల్ని పాటించాలన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారం ముంగిట్లోకి వచ్చిన వేళ.. కోదండం మాష్టారు మొదటికే చెక్ చెప్పేయటం ఆసక్తికరమైన పరిణామంగా చెప్పాలి. తాజాగా ఆయన వ్యాఖ్యలు వింటే.. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో తెలంగాణ రాష్ట్ర సర్కారుకు చట్టవిరుద్ధంగా వెళుతుందన్న అభిప్రాయం కలిగేలా ఉండటం గమనార్హం.