Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ పై కోదండ‌రాం కామెంట్స్

By:  Tupaki Desk   |   26 Sep 2015 6:57 AM GMT
కేసీఆర్‌ పై కోదండ‌రాం కామెంట్స్
X
తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ జేఏసీ నూత‌న కార్యాల‌యంలోకి మారిన సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ పరోక్షంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి, తెలంగాణ ప్ర‌భుత్వంపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. తెలంగాణలో జ‌రుగుతున్న రైతు మ‌ర‌ణాల‌పై ప్ర‌భుత్వం స‌రైన రీతిలో స్పందించాల‌న్నారు. పాల‌కుల నిర్ల‌క్ష్యం వ‌ల్లే రైతుల ఆత్మ‌హ‌త్య‌లు జ‌రుగుతున్నాయ‌ని ఆక్షేపించారు. తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల‌కు ప్ర‌క‌టించిన ప‌రిహారాన్ని జూన్ 2 త‌ర్వాత మరణించిన రైతులకు కూడా అందించాలని కోరారు. అలాగే వరంగల్‌ లో జరిగిన ఎన్‌ కౌంటర్‌ బాధాకరమని, అలాంటి పద్ధతి మంచిది కాదన్నారు. ఎన్‌ కౌంటర్‌ జరిగిన తీరు తప్పు అని అభిప్రాయపడ్డ కోదండరాం... వారిని బందించి కాల్చినట్టే కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

తాను రాజకీయాల్లోకి వెళ్లానన్నది కేవలం ఊహాగానాలేనని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలపై తమకు ఎలాంటి కోపతాపాలు లేవని, వారితో కలిసి పనిచేయలేమని స్పష్టం చేశారు. తమ పంథాలో తాము ముందుకు సాగుతామన్నారు. మ‌రోవైపు త‌న రాజ‌కీయ అరంగేట్రం గురించి క్లారిటీ ఇచ్చారు. 'నాకు అధికార దాహం లేదు... నేనెప్పుడూ ప్రజల పక్షమే' అని ప్రొ. కోదండరాం ప్ర‌క‌టించారు. ప్రజా సమస్యలపై పోరడతానని చెప్పారు. ఇందులో ఎవరికీ అనుమానం అక్కర్లేదన్నారు. ఈనెల 30న ప్రొఫెస‌ర్‌ గా ప‌ద‌వీవిర‌మ‌ణ చేయ‌నున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత తెలంగాణ జేఏసీ ఛైర్మన్ హోదాలో పూర్తిస్థాయిలో తెలంగాణ పున‌ర్‌ నిర్మాణం కోసం ప‌నిచేస్తాన‌ని తెలిపారు.