Begin typing your search above and press return to search.

ప్రభుత్వాన్ని అలా అడిగేస్తారా కోదండం సార్?

By:  Tupaki Desk   |   17 Aug 2016 5:27 AM GMT
ప్రభుత్వాన్ని అలా అడిగేస్తారా కోదండం సార్?
X
స్మార్ట్ ఫోన్ అన్నదే ప్రపంచానికి తెలీని కాలం. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే టీవీలు.. వీడియో గేములు లాంటివి అప్పడప్పుడే కొత్తగా వస్తున్న నాటి ముచ్చట ఇది. అప్పట్లో పొద్దుపోకపోతే పిల్లలు కథ కావాలంటే ‘చేప కథ’ చెప్పేవాళ్లు. చేపా.. చేపా ఎందుకు ఎండలేదంటే.. ఆ బుజ్జి చేప మరో ముచ్చట ఆలోచించకుండా తాను ఎందుకు ఎండలేదో చెప్పేసేది.

కథ కాబట్టి ప్రాణం లేని చేప తనను ఎండలో పెట్టి ఎండబెట్టినా నిజమే చెప్పేది. కానీ.. అన్ని తెలిసిన వారు కావాలని చేసే పనులకు కారణాలు చెబుతారనుకోవటం అమాయకత్వమే అవుతుంది. దాదాపుగా ఇలాంటి వైఖరినే ప్రదర్శిస్తున్నారు తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి.. ఉద్యమం ఫలించి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తన దారిన తాను పోతూ.. తాను ప్రజలకు మాత్రమే జవాబుదారి అంటూ పదవుల్లాంటివి తనకు అస్సలు పడవంటూ ఉండిపోయారు.

నాటి కేంద్ర ప్రభుత్వాన్ని తన ఉద్యమంతో ఉక్కిరిబిక్కిరి చేసిన కోదండం మాష్టారు..ఉద్యమం తర్వాత సినిమాల్లో మాదిరే యూనివర్సిటీకి పోయి పాఠాలు చెప్పుకున్నారు. సినిమాల్లో అలాంటి సీన్ తర్వాత శుభం కార్డుపడుతుంది. కానీ.. అది రీల్ లైఫ్.. రియల్ లైఫ్ లో ముచ్చట వేరుగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జరుగుతున్నసీన్లు చూస్తేనే.. ఎలాంటి పరిస్థితులు ఏర్పడనున్నాయన్న విషయం అర్థం చేసుకోవచ్చు.

మొన్నటికి మన్న తన ఫోన్ ను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని ఆరోపించిన కోదండం మాష్టారు.. తాజాగా తన ఫోన్ ట్యాప్ మీద మీడియాలో వచ్చిన కథనాలపై కోదండరాం తాజాగా రియాక్ట్ అయ్యారు. తన ఫోన్ పై నిఘా ఎందుకు పెట్టింది? ఫోన్ కాల్స్ ను ట్యాప్ చేయాల్సిన అవసరం ఏం వచ్చిందో ప్రభుత్వమే సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

మీడియాలో వస్తున్న ట్యాప్ కథనాలపై తనవ్యక్తిగత మిత్రులు.. శ్రేయోభిలాషులు మాట్లాడుతున్నారని.. ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని కోరుకుంటున్నరు. ప్రజాస్వామిక ప్రభుత్వాలు ప్రజాస్వామికంగా వ్యవహరించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలోనూ.. రాష్ట్రం ఏర్పడి అభివృద్ధి కోసం కోట్లాది మంది తరఫున మాట్లాడే తాము చట్టానికి లోబడే పని చేస్తామని.. రాజ్యాంగ పరిధికి లోబడే వ్యవహరిస్తామని చెప్పుకొచ్చారు. ప్రజల కోసం పని చేసే జేఏసీ లాంటి సంస్థలపై నమ్మకం ఉంచాలన్నారు. అనుకుంటాం కానీ కోదండం మాష్టారు చెప్పినట్లుగా ప్రజల కోసం పని చేసే తమ లాంటి వారి ఫోన్లు ట్యాప్ అవుతున్న విషయంపై ఆ పని చేస్తున్న ప్రభుత్వమే వివరణ ఇవ్వాలనటం చూస్తుంటే.. ఇదేమైనా ఎండని చేప కథా? ఎందుకు ఎండలేదంటే సమాధానం చెప్పేయటానికి. ఎండని చేప మాదిరి ఫోన్ ట్యాపింగ్ యవ్వారంపై ప్రభుత్వం పెదవి విప్పుతుందా? అలాంటి పరిస్థితే ఉంటే.. ట్యాపింగ్ వరకూ ఇష్యూ వెళుతుందా..? ఈ చిన్న విషయం కోదండం మాష్టారికి ఎందుకు అర్థం కానట్లు..?