Begin typing your search above and press return to search.

కేసీఆర్ సర్కారుపై కోదండానికి కోపమొచ్చింది

By:  Tupaki Desk   |   25 July 2016 9:50 AM GMT
కేసీఆర్ సర్కారుపై కోదండానికి కోపమొచ్చింది
X
తెలంగాణ సర్కారుపై విమర్శలు చేసేందుకు ఆచితూచి వ్యవహరించిన ప్రొపెసర్ కోదండరాం ఈ మధ్యన మొహమాటపు పరదాల్ని పక్కన పెట్టేయటం తెలిసిందే. ప్రభుత్వ తీరును తప్పు పట్టే విషయంలో ఆయన గతంలో మాదిరి కాకుండా.. తప్పునుతప్పుగా ఎత్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ పాలన మొదలు.. వివిధ అంశాల మీద ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతున్న ఆయన.. తాజాగా మల్లన్నసాగర్ ముంపు ప్రాంతాల ప్రజలపై పోలీసుల లాఠీఛార్జ్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

మల్లన్నసాగర్ భూనిర్వాసితులపై పోలీసుల లాఠీ ఛార్జ్ ను తీవ్రంగా ప్రశ్నిస్తున్న కోదండం మాష్టారు.. ఈ రోజు ఆయా ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించుకోవటం.. పోలీసులు ఆయన్ను ఆ ప్రాంతాల్లో పర్యటించేందుకు అనుమతించకపోవటం తెలిసిందే. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉందన్న కోదండం.. లాఠీఛార్జ్ బాధితుల్ని పరామర్శించేందుకు వెళుతున్న వారిని అరెస్ట్ చేయటం ఏమిటంటూ ప్రశ్నించారు.

నిర్వాసితులపై లాఠీ ఛార్జ్ అభ్యంతరకరమన్న ఆయన.. ముంపు గ్రామాల్లో మొహరించిన పోలీసుల్ని వెనువెంటనే వెనక్కి రప్పించాలని డిమాండ్ చేశారు. ఎప్పుడూ లేని విధంగా పోలీసుల తీరును.. ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోదండం మాష్టారి మాటలపై తెలంగాణ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.