Begin typing your search above and press return to search.

ప్ర‌గ‌తిభ‌వ‌న్ గ‌డీల‌ను బ‌ద్ధ‌లు కొడ‌తాన‌న్నారు

By:  Tupaki Desk   |   5 April 2018 4:18 AM GMT
ప్ర‌గ‌తిభ‌వ‌న్ గ‌డీల‌ను బ‌ద్ధ‌లు కొడ‌తాన‌న్నారు
X
తెలంగాణ రాష్ట్రంలో మ‌రో రాజ‌కీయ పార్టీ పురుడు పోసుకున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాత్ర ఎంతో.. పొలిటిక‌ల్ జేఏసీ పేరిట కోదండ‌రాం న‌డిపిన ఉద్య‌మాన్ని త‌క్కువ చేసి చూడ‌లేం. నాలుగేళ్ల కేసీఆర్ పాల‌న‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న మాష్టారు.. తాజాగా తెలంగాణ జ‌న‌స‌మితి పేరుతో రాజ‌కీయ పార్టీని స్టార్ట్ చేయ‌టం తెలిసిందే.

తాజాగా ఆ పార్టీ జెండాను ఆయ‌న ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా జెండా రూపొందించిన దానికి సంబంధించి ఆస‌క్తిక‌ర అంశాల్ని వెల్ల‌డించారు. పాల‌పిట్ట‌.. ఆకుప‌చ్చ రంగుల‌తో రూపొందించిన టీజేఎస్ (తెలంగాణ జ‌న స‌మితి) జెండాకు తిరుగులేద‌ని.. ఎక్క‌డైనా విజ‌యం త‌థ్య‌మ‌నే న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు.

పాల‌పిట్ట‌కు అప‌జ‌య‌మ‌న్న‌ది తెలీద‌న్నారు. పాల‌పిట్ట రంగును అద్దుకున్న టీజేఎస్ ఎక్క‌డైనా విజ‌యం సాధిస్తుంద‌న్నారు. ఉద్య‌మ ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా టీజేఎస్ పాల‌న ఉంటుంద‌న్నారు. కేసీఆర్ హ‌యాం నియంత పాల‌న‌ను త‌ల‌పించేలా ఉంద‌ని.. బాధితులు న్యాయం కోసం పోరాటం చేస్తుంటే అరెస్ట్ లు చేస్తున్నార‌న్నారు.

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు న్యాయం చేసేందుకు రాజ‌కీయ పార్టీ అవ‌స‌ర‌మైంద‌ని.. ఇప్ప‌టివ‌ర‌కూ 99 శాతం న‌డిచామ‌ని.. మ‌రొక్క శాతం మిగిలి ఉంద‌న్నారు. ఆచార్య జ‌య‌శంక‌ర్ సార్ తో క‌లిసి తెలంగాణ ప్ర‌యాణాన్ని స్టార్ట్ చేశౄమ‌ని.. అవే ఆశ‌యాల్ని క‌చ్ఛితంగా సాధించి తీరుతామ‌న్నారు. ప్ర‌జ‌ల‌కు మంచి చేయ‌టానికే త‌మ పార్టీ ఆవిర్భ‌వించింద‌న్నారు.

సైకిల్ తో బ‌య‌లుదేరిన కాన్షీరాం..చీపురు చేత‌బ‌ట్టిన కేజ్రీవాల్ రాజ్యాధికారాన్ని సాధించ‌లేదా? అన్న ఆయ‌న‌.. తెలంగాణ‌లో ఏక వ్య‌క్తి పాల‌న‌కు వ్య‌తిరేకంగా తాము పోరాడ‌తామ‌న్నారు. కేవ‌లం పాల‌కుల్లో మార్పు కోస‌మే కాదు.. పాల‌న తీరులో మార్పు తీసుకురావ‌ట‌మే త‌మ ల‌క్ష్యంగా కోదండం చెప్పారు.

ఇప్ప‌టిదాకా ఉన్న సంఘాలేవీ ఇక‌పై ఉండ‌వ‌ని.. అంద‌రూ జ‌న‌స‌మితిగానే ఉంటారంటూ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం జ‌రిగిన ఉద్య‌మంలో కీల‌క‌పాత్ర పోషించిన వారికే జ‌న‌స‌మితిలో ప్రాధాన్య‌త ఉంటుంద‌ని.. తెలంగాణ కోసం అమ‌రులైన వారే జ‌న‌స‌మితికి స్ఫూర్తి అన్న విష‌యాన్ని చెప్పారు. అమ‌రుల స్ఫూర్తి మ‌ర్చిపోతే.. తెలంగాణ వాదాన్ని.. అస్తిత్వాన్ని.. ఆకాంక్ష‌ల్నే కాదు.. మ‌న‌ల్ని మ‌నం మ‌రిచిన‌ట్లేన‌ని కోదండం చెప్పారు.

ఇదే వేదిక మీద‌.. తెలంగాణ విద్యావంతుల వేదిక ఛైర్మ‌న్ గుర‌జాల ర‌వీంద‌ర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి కోదండ‌రాం దిక్సూచి అని వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్ర మంత్రివ‌ర్గంలో మ‌హిళ‌ల‌కు అవ‌కాశం లేద‌ని.. ద‌ళితుల‌పై ముఖ్య‌మంత్రి మొస‌లి క‌న్నీరు కారుస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఎస్సీ..ఎస్టీ చ‌ట్టంపై సుప్రీం తీర్పుపై మాట్లాడుతున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. నేరేళ్ల ఘ‌ట‌న‌పై ఏం స‌మాధానం చెబుతార‌న్నారు. ద‌ళితుల‌పై ఇసుక మాఫియా లారీల‌ను ఎక్కించి చంపితే ఏం చేస్తున్నారంటూ అడ్వొకేట్ ర‌చ‌నారెడ్డి సూటిగా ప్ర‌శ్నించారు. తెలంగాణ జ‌న‌స‌మితి పుణ్య‌మా అని.. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అండ్ కోను ప్ర‌శ్నించేందుకు స‌రికొత్త గొంతులు తెర మీద‌కు వ‌స్తాయ‌న‌టంలో ఎలాంటి సందేహాలు లేన‌ట్లే.