Begin typing your search above and press return to search.

కేసీఆర్ పై మాస్టారి సెంటిమెంట్ ప్ర‌యోగం!

By:  Tupaki Desk   |   4 Feb 2017 4:14 AM GMT
కేసీఆర్ పై మాస్టారి సెంటిమెంట్ ప్ర‌యోగం!
X
సెంటిమెంటు ఎంత బలమైందో, దాన్ని సరిగ్గా వాడుకుంటే ఎంత ఎత్తుకు వెళ్లొచ్చో చెప్పకనే చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్! మా నీరు మాక్కావాలే.. మా భూములు మాక్కావాలే.. మా ఉద్యోగాలు మాక్కావాలే.. అంటూ తెలంగాణ మొత్తం ఒకబలమైన సెంటిమెంట్ ను తనదైన శైలిలో ఇంజెక్ట్ చేయగలిగారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఏ విషయం బలమైనదని భావించారో అదే విషయం అత్యంత శ్రద్ధ పెట్టారు.. ఉద్యోగాలు అనే విషయాన్ని కీలకం చేశారు. ఫలితంగా పోరాటం విద్యార్థుల చేతుల్లోకి వెళ్లింది.. అనంతర పరిణామాలు అందరికీ ఎరుకే! అయితే తాజాగా కేసీఆర్ కు అనధికారిక ప్రతిపక్షంగా మారిన కోదండ‌రామ్ సరిగ్గా ఇదే విషయాన్ని, ఇదే సెంటిమెంట్ ను కేసీఆర్ పై ప్రయోగించబోతున్నారు.

ఏమాటకామాట చెప్పుకోవాలంటే తెలంగాణ‌లో కేసీఆర్ స‌ర్కారుకు మరీ ఇబ్బందులు తెప్పించే స్థాయిలో ప్ర‌తిప‌క్షాలేవీ లేవనే చెప్పుకోవాలి! ఫిరాయింపుల పుణ్య‌మా.. మరేదైనా కారణమా అనేసంగతి కాసేపు పక్కనపెడితే ప్రస్తుతం తెలంగాణలో తెరాస బ‌ల‌మైన రాజ‌కీయ శ‌క్తి! ఈ క్రమంలో ప్రతిపక్షాల వల్లకాని "సర్కారుపై ఒత్తిడి" కార్యక్రమం విషయంలో కోదండ‌రామ్ కాస్త వ్యూహాత్మకంగానే ముందుకు కదులుతున్నట్లు అనిపిస్తుంది. దశలవారీగా కేసీఆర్ స‌ర్కారుపై హీట్ పెంచే ప్రయత్నానికి పూనుకున్న కోదండరాం తాజాగా.. ఏ విషయమైతే తెలంగాణ ఉద్య‌మ ఉద్ధృతిని పెంచేందుకు మూల‌కార‌ణ‌ం, బలమైన కారణం అయ్యిందో ఇప్పుడు అదే విషయాన్ని తెరమీదకు తెచ్చి ఉద్య‌మించేందుకు సిద్ధ‌మౌతున్నారు.

అవును... యువ‌త‌ను ఏకం చేస్తూ స‌ర్కారుపై ఉద్యమించాలనేదే కోదండం గారి తాజా ప్లాన్. ఈ క్రమంలో ఈ నెల 22న నిరుద్యోగుల‌తో భారీ ర్యాలీ నిర్వ‌హించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. హైద‌రాబాద్‌ లోని సుంద‌ర‌య్య విజ్ఙాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వ‌ర‌కూ ఈ భారీ ర్యాలీ నిర్వ‌హించ‌బోతున్నారు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధ‌న ఉద్య‌మంలో నిరుద్యోగుల - విద్యార్థుల పాత్ర ఎంత కీల‌కం అనే విషయం అందరికీ తెలిసిందే... రాష్ట్రం వ‌స్తే ఉద్యోగాలు వ‌స్తాయంటూ నాడు యువ‌త ఉద్య‌మించిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఇదే విషయంపై దృష్టి పెట్టిన మాస్టారు... తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న‌దే మ‌న ఉద్యోగాల కోస‌మ‌నీ, కానీ ఆ దిశ‌గా కేసీఆర్ స‌ర్కారు నియామ‌కాలు చేప‌ట్ట‌డం లేదని ఆగ్ర‌హిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటివరకూ 15 వేల ఉద్యోగాలు మాత్ర‌మే భ‌ర్తీ చేశార‌నీ, ఎందరో నిరుద్యోగులు పోటీ ప‌రీక్ష‌ల కోసం కోచింగులు తీసుకుని ఎదురుచూస్తున్నార‌ని.. ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింద‌ని కోదండ‌రామ్ విమ‌ర్శించారు.

ఈ లెక్కన చూసుకుంటే.. ప్రభుత్వంపై ఈసారి కోదండం మాస్టారు బాగానే గురిపెట్టినట్లు అనిపిస్తుంది. ఏ సమస్యలను వెలుగులోకి తీసుకొస్తే.. బలమైన పోరాటం మొదలవుతుందో, ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టగల శక్తి ఏకమవుతుందో సరిగ్గా అదే విషయాన్ని పట్టుకున్నారు! అయితే ఈ విషయాలపై తెలంగాణ సర్కారు ఎలా స్పందిస్తుంది.. ర్యాలీకి అనుమతి ఇస్తుందా.. ప్రత్యేక హోదా విషయంలో ఉద్యమిస్తున్న యువతిపై ఏపీ సర్కారు మొన్న విశాఖలో ఏమి చేసిందో అదే చేస్తుందా.. లేక, మాస్టారితోనూ విద్యార్థులతోనూ చర్చలు నడుపుతుందా.. ప్రస్తుతానికైతే సస్పెన్స్!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/