Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కొత్త ట్విస్ట్‌ తో అయోమ‌యంలో కోదండ‌రాం

By:  Tupaki Desk   |   10 Nov 2018 11:27 AM GMT
కాంగ్రెస్ కొత్త ట్విస్ట్‌ తో అయోమ‌యంలో కోదండ‌రాం
X
ఓవైపు మ‌హాకూట‌మి సీట్ల లెక్క తేల‌క‌పోవ‌డంతో అదే ఆందోళ‌న కొన‌సాగుతుండ‌గా...మ‌రోవైపు ఎన్నిక‌ల్లో పోటీ చేసే గుర్తు విష‌యంలో తెలంగాణ జ‌న‌స‌మితి నాయ‌కుడు - రిటైర్డ్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఊహించ‌ని ముంద‌స్తు ఎన్నిక‌లతోనే ఆయ‌న స‌త‌మ‌తం అవుతుండ‌గా...బ‌రిలో దిగే స‌మ‌యంలో కాంగ్రెస్‌ తో పొత్తు ఆయ‌న‌కు కొత్త చిక్కును తెచ్చిపెట్టింది. ఏ గుర్తుతో పోటీ చేయ‌డం అనేది టెన్ష‌న్‌గా మారింది. కోదండరాం పార్టీ తెలంగాణ జనసమితికి ఈ మధ్యే అగ్గిపెట్టి గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. కానీ ఆ గుర్తు ప్రజల్లోకి ఇంకా వెళ్లలేదు. అంత‌లోనే ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో మ‌హాకూట‌మికి పెద్ద‌న్న‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న కాంగ్రెస్ పార్టీ కోదండ‌రాంను హెచ్చరిస్తున్న‌ట్లు స‌మాచారం. అగ్గిపెట్టె గుర్తుతో రిస్క్ చేయడం ఎందుకని కోదండ‌రాంను ప్ర‌శ్నిస్తున్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో తెలంగాణ జనసమితి అభ్యర్థులు కాంగ్రెస్ గుర్తుపైనే పోటీ చేయాల‌ని ఒత్తిడి చేస్తున్న‌ట్లు స‌మాచారం.

టీజేఎస్‌ కు ఎన్నికల సంఘం అగ్గిపెట్టె గుర్తు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, ఈ గుర్తు గురించి - పార్టీ అభ్య‌ర్థుల గురించి దాదాపుగా 25 రోజులు మాత్ర‌మే ఉన్న ప్ర‌చార స‌మ‌యంలో ఎలా జ‌నాల్లోకి తీసుకువెళ్ల‌గ‌ల‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఓట‌ర్లు అగ్గిపెట్టె గుర్తును పోలి ఉండే కారు గుర్తుకు వేసే ప్ర‌మాదం కూడా లేక‌పోలేదంటుటున్నారు. అందుకే సుప‌రిచిత‌మైన హ‌స్తం గుర్తుపై పోటీ చేయాల‌ని కాంగ్రెస్ ఒత్తిడి చేస్తున్న‌ట్లు స‌మాచారం. కాగా, ఈ విష‌యంలో ఎన్నిక‌ల అధికారుల స‌ల‌హా మేర‌కు ప్రొఫెస‌ర్ కోదండ‌రాం ముందుకు సాగ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ప్రొఫెస‌ర్ కోదండ‌రాం ఇప్ప‌టికే ఇద్ద‌రు పార్టీ ప్ర‌తినిధుల‌ను ఢిల్లీ పంపించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం అధికారుల‌తో వివ‌రాలు ఆరా తీయించిన‌ట్లు స‌మాచారం. టీజేఎస్ అభ్య‌ర్థులుగా కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేయ‌వ‌చ్చా? ఒక‌వేళ పోటీ చేస్తే వారు ఏ పార్టీ అభ్య‌ర్థులుగా గుర్తించ‌బ‌డ‌తారు? వంటి వివ‌రాలు ఆయ‌న అడిగి తెలుసుకున్న‌ట్లు స‌మాచారం. అయితే, స‌భ్యుల‌ను ఏ పార్టీకి చెందిన వారిగా గుర్తించే తుది నిర్ణ‌యం స్పీక‌ర్ చేతిలో ఉంటుంద‌ని సీఈసీ వ‌ర్గాలు చెప్పిన‌ట్లు స‌మాచారం. దీంతో కోదండ‌రాం డైల‌మాలో ఉన్న‌ట్లు స‌మాచారం. దీనికి తోడు ఇపుడు కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేస్తే జ‌నాల్లోకి టీజేఎస్‌ పార్టీ వెళ్ల‌డం క‌ష్ట‌మ‌వుతుంది. రేపు పొద్దున సొంత గుర్తు ప్ర‌చారం చేసుకోవ‌డానికి ఆటంకాలు వ‌స్తాయో అన్న ఆవేద‌న కోదండ‌రాంలో ఉంద‌ట. ఈరోజు పార్టీ అధ్య‌క్షుడిగా కోదండ‌రాం హ‌స్తం గుర్తును ప్ర‌చారం చేసి, జ‌నం దానికి క‌నెక్ట‌యితే భ‌విష్య‌త్తులో త్వ‌ర‌లోనే వ‌చ్చే పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పార్టీ న‌ష్ట‌పోతుందేమో అన్న భ‌యం కూడా ఉంది.