Begin typing your search above and press return to search.

చివరకు మీరొక్కరే మిగులుతారేమో కోదండం సార్?

By:  Tupaki Desk   |   17 March 2016 4:27 AM GMT
చివరకు మీరొక్కరే మిగులుతారేమో కోదండం సార్?
X
తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ రాజకీయ జేఏసీ పాత్రను ఎవరూ మర్చిపోలేరు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలను ఒక వేదిక మీదకు తీసుకురావటమే కాదు.. కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావటంలో తెలంగాణ పొలిటికల్ జేఏసీ పాత్ర గణనీయమైనది. తెలంగాణ ఏర్పాటులో చారిత్రక పాత్ర పోషించిన జేఏసీ అస్తిత్వానికి ఇప్పుడు ముప్పు వాటిల్లింది.

జేఏసీలో పని చేసిన నేతలు ఒక్కొక్కరుగా జారిపోతే.. జేఏసీలో కీలకంగా పని చేసిన ఉద్యోగ సంఘాలు కూడా తప్పుకోనున్నట్లు తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జేఏసీలో కోదండం మాష్టారు ఒక్కరే మిగిలే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాజకీయ జేఏసీ కొనసాగించటంలో అర్థం లేదని ఉద్యోగ సంఘాల నేత రవీందర్ రెడ్డి లాంటోళ్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి.. జేఏసీ నోటి నుంచి మాట వస్తుందంటే.. ప్రధాన రాజకీయ పక్షాలు సైతం ఆసక్తిగా ఎదురుచూసిన పరిస్థితి. ఈ రోజు తన ఆస్తిత్వానికే ముప్పు ఏర్పడటం కాలమహిమ కాకుండా మరింకేమీ ఉంటుంది.

జేఏసీసీని మూసేయాలన్న డిమాండ్ ఒక పక్క వినిపిస్తుంటే.. మరోవైపు.. దీనికి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న కోదండం మాష్టారు మాత్రం.. జేఏసీని కొనసాగిస్తామని చెబుతున్నారు. ఆయన కొనసాగిస్తామన్నా.. ఆయన వెంట నడిచే నేతలు మాత్రం కనిపించని పరిస్థితి. కేసీఆర్ ప్రభ ఓ రేంజ్ లో వెలిగిపోతున్న ప్రస్తుత తరుణంలో కోదండం మాష్టారి మాటల్ని వినే పరిస్థితి ఉందా? అన్నదే అసలు ప్రశ్న. ఆ విషయాన్ని కోదండం మాష్టారు సైతం గుర్తించినట్లుగా కనిపించట్లేదనే చెప్పాలి.