Begin typing your search above and press return to search.

కోదండ‌రాం నెక్ట్సేంటి....అగ్గిపెట్టె అడ్ర‌స్ గ‌ల్లంతు

By:  Tupaki Desk   |   11 Dec 2018 9:31 AM GMT
కోదండ‌రాం నెక్ట్సేంటి....అగ్గిపెట్టె అడ్ర‌స్ గ‌ల్లంతు
X
తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల్లో అనూహ్య ఫ‌లితం వ‌చ్చింది. ప్రొఫెస‌ర్ కోదండ‌రాం సార‌థ్యంలో ఏర్పాటైన‌ తెలంగాణ జనసమితి పార్టీ గల్లంతు అయ్యింది. ఆ పార్టీ అభ్యర్థులు అందరూ ఓటమి చెందారు. ఏ నియోజకవర్గంలోనూ ప్రభావం చూపకలేకపోయారు. పోరాడి - కొట్లాడి మరీ 8 సీట్లు దక్కించుకున్నా.. ఏ స్థానంలోనూ కనీసం పోటీ ఇవ్వలేకపోయారు. మూడు, నాలుగు స్థానాలతో సరిపెట్టుకున్నారు. కోదండరాం ఆధ్వర్యంలోని తెలంగాణ జన సమితి మొదటిసారి బరిలోకి దిగింది. కాంగ్రెస్ - టీడీపీ - సీపీఐతో కలిసి బరిలోకి దిగింది. మొదటిసారే ఖాతా తెరవలేకపోయింది.

టీఆర్ ఎస్ వ్య‌తిరేక‌తే ప్ర‌ధాన అజెండాగా ఉద్య‌మ నేప‌థ్యమే అండ‌గా తెలంగాణ జనసమితిని కోదండ‌రాం ఏర్పాటు చేశారు. ఒంట‌రిగా పోటీ చేస్తామ‌న్న కోదండ‌రాం అనంత‌రం కాంగ్రెస్‌-టీడీపీ- సీపీఐతో ప్రజాకూటమిలో జ‌ట్టుక‌ట్టారు. పొత్తులో భాగంగా ఆ పార్టీ రాష్ట్రంలో తొమ్మిది స్థానాల్లో పోటీకి దిగింది. వీటిలో నాలుగు అంబర్‌ పేట (నిజ్జన రమేష్‌) - మల్కాజిగిరి (దిలీప్‌ కుమార్‌) - సిద్దిపేట (భవానీ రెడ్డి) - వర్దన్నపేట (దేవయ్య) స్థానాల్లో సొంతంగానూ - మిగిలిన ఐదు దుబ్బాక (రాజ్‌ కుమార్‌) - వరంగల్‌ తూర్పు (గాదె ఇన్నయ్య) - ఆసిఫాబాద్‌ (ఆత్రంసక్కు) - మిర్యాలగూడ (విద్యాధర్‌ రెడ్డి) - మహబూబ్‌ నగర్‌ (రాజేందర్‌ రెడ్డి) స్థానాల్లో కాంగ్రెస్‌ తో కలిసి `స్నేహపూర్వక` బరిలో నిలిచింది. ఈ పోటీ ద‌శ‌లోనే ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు వినిపించాయి. ఎనిమిది స్థానాలు ఇస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చిందని ఆ హామీని కూడా నిలబెట్టుకోలేకపోయిందని టీజేఎస్ నేత‌లే వాపోతున్నారు. తాము 12 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తే నాలుగింటిలో సొంతంగానూ - మిగిలిన ఐదింటిలో కాంగ్రెస్‌ తో కలిసి స్నేహపూర్వక బరిలో నిలవాల్సి వచ్చిందని అంటున్నారు. కాంగ్రెస్‌ తమను మోసిం చేసిందని ఆ పార్టీ వర్గాలు బహిరంగంగానే విమర్శిస్తున్నాయి.

తెలంగాణ జన సమితి పార్టీ ఘోర ఓటమితో కోడందరాం మాస్టారు చిన్నబోయారు. పార్టీ ఆఫీస్ వెలవెలబోయింది. కనీస స్థాయిలో కూడా పోటీ ఇవ్వలేకపోవటంపై ఆ పార్టీలోనే అంతర్మథనం ప్రారంభం అయ్యింది. ఇప్పటికే ఆ పార్టీ కీలక నేత రచనారెడ్డి ఇప్పటికే బయటకు రావటం జరిగింది. కూటమి మాయలో మాస్టారు ఉన్నారని బహిరంగంగానే విమర్శలు - ఆరోపణలు చేస్తూ బయటకు వచ్చారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత అదే నిజం అయ్యింది. టీజేఎస్ పార్టీ సింబల్ అయిన అగ్గిపెట్టె వెలగలేదు.. పార్టీని ప్రజలు ఆదరించలేదు.