Begin typing your search above and press return to search.

కోదండ‌రాం..మ‌రో చిరు..లోక్‌ స‌త్తా జేపీయేన‌ట‌

By:  Tupaki Desk   |   6 Feb 2018 4:37 AM GMT
కోదండ‌రాం..మ‌రో చిరు..లోక్‌ స‌త్తా జేపీయేన‌ట‌
X
సుదీర్ఘ చ‌ర్చ‌కు తెర‌దించుతూ తెలంగాణ రాజ‌కీయ క‌ద‌న‌రంగంలోకి దిగుతున్న‌ట్లు ఎట్ట‌కేల‌కు తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం ప్ర‌క‌టించేశారు. త‌మ‌తో క‌లిసి సాగుతున్న ప‌లువురి ఆకాంక్ష‌ల‌ను గౌర‌విస్తున్నామ‌ని అదే స‌మ‌యంలో తెలంగాణ‌ను కాపాడుకునేందుకు రాజ‌కీయాల్లో వస్తున్నాన‌ని కోదండ‌రాం త‌న త‌దుప‌రి ప్ర‌యాణం గురించి వివ‌రించారు. అయితే జేఏసీ చైర్మ‌న్ పొలిటిక‌ల్ జ‌ర్నీ న‌ల్లేరుపై న‌డ‌క వంటిదేనా? తెలంగాణ‌లో ఆయ‌న స‌త్తా ఎంత వంటి ఆస‌క్తిక‌ర అంశాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.

ప్రొఫెస‌ర్ కోదండ‌రాం రాజ‌కీయ ఎంట్రీపై ఎదుర‌వుతున్న ప్ర‌ధాన ప్ర‌శ్న‌...ఆయ‌న ముందుగా నో చెప్పిన దానికి ఇప్పుడు ఎస్ చెప్ప‌డంలో మ‌ర్మం ఏమిట‌నే!. జేఏసీలో కోదండ‌రాంతో క‌లిసి సాగిన అనంత‌రం ఆయ‌న‌కు గుడ్‌ బై చెప్పిన అడ్వకేట్ ప్రహ్లాద్ టీజేఏసీని రాజకీయ పార్టీగా మార్చాలని పట్టుబడితే ఆయన్ను కోదండ‌రాం తీవ్రంగా మందలించారు. జేఏసీ రాజకీయ పార్టీ కాదని - కేవలం ఉద్యమ సంస్థ అని స్ప‌ష్టం చేశారు. అయితే అలాంటి మాట‌లు ఇంత వరకూ చెబుతూ వచ్చిన ప్రొఫెసర్ కోదండరాం ఉన్నఫళంగా పార్టీ పెట్టాలన్న ఆలోచనకు ఎందుకు వచ్చినట్లు? దీని వెనుక మ‌ర్మం ఏంటి అనే ప్ర‌శ్న‌లు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

ఇక కీల‌క అంశ‌మైన మ‌ద్ద‌తు విష‌యంలో కూడా అస్ప‌ష్ట‌త కొనసాగుతోంది. ప్రొఫెసర్ కోదండరాం పార్టీ స్థాపిస్తే ఆయన వెంట వచ్చేదెవరూ? అనేది ఇటు జేఏసీ స‌హా అటు రాజ‌కీయ‌పార్టీల నేత‌ల‌కు ఎదురవుతున్న ప్ర‌శ్న‌. ప్ర‌స్తుతం ప్రొఫెసర్ కోదండరాం బ‌లం విద్యార్థులుగా జేఏసీ భావిస్తోంది. అయితే పార్టీ పెడితే... ఆయ‌న వెంట విద్యార్థి లోకం ఏ మేరకు కదులుతుందనేది ప్రధాన ప్రశ్న. ఎందుకంటే...ఎందుకంటే అన్ని పార్టీలూ యువజన - విద్యార్థి విభాగాలను ఏర్పాటు చేసుకుని - వివిధ ఆందోళన కార్యక్రమాల్లో వారిని భాగస్వాములుగా చేస్తున్నాయి. దీంతో స‌హ‌జంగానే విద్యార్థులు కూడా టీఆర్‌ ఎస్ - బీజేపీ - కాంగ్రెస్ వైపు వెళ్ళేందుకు చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. దీంతో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ప్రొఫెస‌ర్ వెంట‌ కదులుతారా? అనే మీమాంస జేఏసీలో ఉంది. వివిధ పార్టీల్లోని అసంతృప్తివాదులు, చివరకు తమకు పోటీ చేసేందుకు టిక్కెట్ దక్కదు అనుకునే వారు, లేదా చట్ట సభలకు పోటీ చేసేందుకు అవకాశం లభిస్తుందనుకునే వారు ఆయన పార్టీలో చేరేందుకు అవకాశం ఉందని అంటున్నారు.

మ‌రోవైపు ప్రొఫెసర్ కోదండరాం కూడా ఒక ఎన్నికల వరకూ కొంత వరకు పోటీ ఇవ్వగలిగినా, ఆ తర్వాత కొనసాగించగలరా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పెద్ద ఎత్తున ఆద‌రణ క‌లిగి ఉన్న‌ మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి నిలదొక్కుకోలేక చివరకు కాంగ్రెస్‌ లో ఆ పార్టీని విలీనం చేయక తప్పలేదు. అంతకు ముందు నాదెండ్ల భాస్కర రావు - మాజీ డీజీపీ భాస్కర రావు - లోక్‌ సత్తా జయప్రకాశ్ నారాయణ్ తదితరులు ప్రయోగాలు చేసి చతికిలపడ్డారు. అదే దారిలో ప్రొఫెస‌ర్ జ‌ర్నీ ఉంటుందా..అనే డౌట్లు అప్పుడే మొద‌ల‌య్యాయి.