Begin typing your search above and press return to search.

సీఎంగా కేసీఆర్‌ కు కోదండం వేసిన మార్కులెన్ని?

By:  Tupaki Desk   |   16 May 2018 7:47 AM GMT
సీఎంగా కేసీఆర్‌ కు కోదండం వేసిన మార్కులెన్ని?
X
తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంత కృషి చేశారో.. అదే స్థాయిలో కృషి చేసిన ఉద్య‌మనేత ఎవ‌రైనా ఉన్నారా? అంటే.. అది టీజేఏసీకి కీగా మారిన కోదండం మాష్టారి పేరును చెప్పాల్సిందే. ఉద్య‌మ‌నేత‌గా.. ఉద్య‌మంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన టీజేఏసీ కీల‌క వ్య‌క్తిగా వ్య‌వ‌హ‌రించిన మాష్టారు ఇప్పుడు తెలంగాణ జ‌న‌స‌మితి పేరుతో రాజ‌కీయ పార్టీని ఏర్పాటు చేయ‌టం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా ఒక ప్ర‌ముఖ ఛాన‌ల్ తో ఆయ‌న మాట్లాడారు. కేసీఆర్ స‌ర్కారు మీద విమ‌ర్శ‌లు చేస్తున్నా.. అవ‌న్నీ ఆచితూచి అన్న‌ట్లే ఉన్నాయి త‌ప్పించి సూటిగా.. షాకిచ్చేలా లేక‌పోవటం గ‌మ‌నార్హం. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఏ త‌ర‌హా ఆర్థిక న‌మూనా ఉండేదో.. దాన్ని ఇప్పుడు కూడా అమ‌లు చేస్తున్నార‌ని.. కాంట్రాక్ట‌ర్ల‌కు లాభాలు తెచ్చే ప్రాజెక్టుల‌పై త‌ప్పించి సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే విధానాల్ని అమ‌లు చేయ‌టం లేద‌ని తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసిన కోదండం మాష్టారి.. ఇంట‌ర్వ్యూలో భాగంగా అడిగిన కొన్ని ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చేందుకు ఆయ‌న త‌ట‌ప‌టాయించ‌టం క‌నిపిస్తోంది.

ఉద్య‌మ‌నేత‌గానో.. జేఏసీ నేత‌గా ఉన్న‌ప్పుడు వ్య‌వ‌హార‌శైలి కాస్త అటూఇటూగా ఉంటే ఫ‌ర్లేదు. కానీ.. రాజ‌కీయ పార్టీ పెట్టేసి.. రేపొద్దున కేసీఆర్ వైఫ‌ల్యాల మీద విరుచుకుప‌డాల్సిన మాష్టారు.. కేసీఆర్ మీద విమ‌ర్శ‌లు చేసేందుకు వెన‌క్కి త‌గ్గ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ ఇంట‌ర్వ్యూలో పాల‌కుడిగా కేసీఆర్‌ కు ఎన్ని మార్కులు వేస్తారంటూ కోదండం మాష్టారిని ప్ర‌శ్నిస్తే.. అందుకు ఆయ‌న చెప్పిన స‌మాధానం వింటే కోదండం మాష్టారి పార్టీ ఎలా ప‌ని చేస్తుందో ఇట్టే అంచ‌నా వేసేయొచ్చు. చెప్పాల్సిన మాట‌ను సూటిగా చెప్ప‌టం పోయి.. న‌ర్మ‌గ‌ర్భంగా స‌మాధానాలు ఇస్తే.. ప్ర‌జ‌ల్లోకి వెళుతుందా? జ‌న బాహుళ్యంలోకి కేసీఆర్ మీద త‌నకున్న వ్య‌తిరేక‌త అర్థ‌మ‌వుతుందా? అన్న‌ది ప్ర‌శ్న‌.

పాల‌కుడిగా కేసీఆర్ కు వేసే మార్కులెన్ని అన్న ప్ర‌శ్న‌కు కోదండం చెప్పిన స‌మాధానం చూస్తే.. "ప్రశ్న ఒకటి అయితే సమాధానం ఒకటి చెపితే దానికి సున్నా మార్కులు తప్పితే ఏమన్నా వస్తాయా? ఉద్యమ ఆకాంక్షల వెలుగులో తెలంగాణలో పనులు జరగలేదని ప్రశ్నిస్తే సమాధానమే లేదు. అందరికీ బతుకుదెరువు చూపించాలి అన్నాం. ఇదే ఉద్యమ ఆకాంక్ష. ఇది ఉద్యమ ఆకాంక్షలను గుర్తిస్తున్న ప్రభుత్వం కాదు. ద్వేషంతో ఇలా అనడంలేదు. నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిని పల్లెత్తు మాట అనలేదు మేం. వారు ముఖ్యమంత్రిగా, మేం పౌరులుగా ఉంటుం డటం వల్ల తలెత్తుతున్న సమస్యలే ఇవి" అంటూ బ‌దులిచ్చారు. కోదండం మాష్టారి క‌వి హృద‌యం అర్థ‌మైందా? సామాన్యుల‌కు ఇలాంటి స‌మాధానాలు త‌ల‌కెక్కుతాయంటారా?