Begin typing your search above and press return to search.

కోదండ‌రాంకి భ‌లే ఛాన్సులే !

By:  Tupaki Desk   |   3 May 2018 7:24 AM GMT
కోదండ‌రాంకి భ‌లే ఛాన్సులే !
X
ఒక్కోసారి కొన్ని క‌లిసొస్తుంటాయంతే... లేక‌పోతే ఒక మాస్టారు జాతీయ పార్టీల‌ను బెదిరించే స్థాయికి ఎద‌గ‌డం, ఆ పార్టీలు అధ్య‌క్షులు ఆయ‌న‌తో ప‌లు మంత‌నాలు జ‌ర‌ప‌డం సాధార‌ణ విష‌య‌మేమీ కాదు. ఉద్య‌మం స‌మ‌యంలో కేసీఆర్ టీంలో మంచి పోస్టు కొట్టేసిన వారిలో కోదండ‌రాం ఒక‌రు. జేఏసీ నాయ‌కుడిగా ఆయ‌న పీక్ టైంలో మంచి హోదాను ఎంజాయ్ చేశారు. అనుకోని ప‌రిణామాల నేప‌థ్యంలో టైం క‌లిసొచ్చి కేసీఆర్ సీఎం కావ‌డం... పోరాటం-కొట్లాట అనే వారిని నోర్లు క‌ట్టేస ప్ర‌య‌త్నం చ‌క‌చ‌కా జ‌రిగిపోయింది.

అలా కేసీఆర్ ప‌క్క‌న లేక‌పోవ‌డంతో కోదండ‌రాం ప్ర‌భ కొంచెం త‌గ్గింది. కొంత‌కాలం ఆయ‌న కూడా సైలెంటుగా ఉన్నాడు. కొన్నాళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఆంధ్రా పాల‌న కంటే దారుణంగా ఉందంటూ కేసీఆర్ మీద చిన్న‌గా పోరాటం మొద‌లుపెట్టి ఇపుడు ఏకంగా పార్టీయే పెట్టారు. ఆయ‌న పెట్టారా? ఆయ‌న వెనుక ఎవ‌రున్నారు అనేది వేరే విష‌యం గాని... రాజ‌కీయాల్లో స‌ర‌యిన వ్యూహాలు ఉండాలే గానీ కింగ్ మేక‌ర్ కంటే కింగ్‌ ల‌కే ఎద‌గ‌డానికి అవ‌కాశం ఎక్కువ అవ‌కాశం ఉంటుంది.

ఇపుడు కోదండ‌రాంకు మంచి అవ‌కాశం వ‌చ్చింది. తెలంగాణ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు తెలంగాణ జ‌న స‌మితి సిద్ధమ‌వుతోంది. అన్ని పంచాయ‌తీల్లో త‌మ పార్టీ పోటీ ప‌డుతుంద‌ని కోదండ‌రామ్ వెల్ల‌డించారు. బ‌హిరంగంగా అభ్య‌ర్థుల కోసం పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధికి కృషి చేయాల‌న్న ఆస‌క్తి ఉన్న యువ‌త‌ - మ‌హిళ‌లతో పాటు ఎవ‌రైనా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని, మీ పొలిటిక‌ల్ కెరీర్‌ కు ఈ ఎన్నిక‌ల‌ను అవ‌కాశంగా మార్చుకోవాల‌ని పిలుపునిచ్చారు. ఆస‌క్తి ఉన్న‌వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని పిలుపునిచ్చారు. అన్ని ద‌ర‌ఖాస్తులకు వేగంగా స్పందించేందుకు ఒక క‌మిటీని కూడా ఏర్పాటు చేసిన‌ట్టు కోదండ‌రామ్ చెప్పారు. గ్రామాభివృద్ధి దేశాభివృద్ధికి కీల‌కం అని అందుకే అక్క‌డి నుంచి త‌మ పార్టీ ప్ర‌స్థానం మొద‌లుపెడుతుంద‌ని కోదండ‌రాం అన్నారు.

అయితే, పార్టీ పెట్టిన వెంట‌నే పంచాయ‌తీ ఎన్నిక‌లు కోదండ‌రాం ఒక ర‌కంగా వ‌రం అనే చెప్పాలి. ఎందుకంటే ఒక కొత్త పార్టీకి, అది కూడా రాజ‌కీయ చ‌రిష్మా లేని వ్య‌క్తికి ఎమ్మెల్యే అభ్య‌ర్థులు దొర‌క‌డం క‌ష్టం. అదే పంచాయ‌తీల‌కు అభ్య‌ర్థులు దొర‌క‌డం చాలా సులువు. అసంతృప్తులు, ఇత‌ర పార్టీల్లో అవ‌కాశం రాని వారు, సొంతూరుకి ఏమైనా చేద్దామ‌నుకున్న వారు, ఊర్లో ప్రిస్టేజ్ కోసం ఎదుటి వారి మీద గెల‌వాలి అనుకునే వారు ఇలాంటి వారు ఎంతో మంది ఉంటారు. వారికి జ‌న స‌మితి మంచి వేదిక అవుతుంది. పంచాయ‌తీ ఎన్నిక‌లు అంటే అభ్య‌ర్థులకు ఓట‌ర్లంద‌రూ తెలిసిన వారే ఉంటారు. ఒక వేళ అభ్య‌ర్థి గెలిస్తే క్రెడిట్ అత‌నితో పాటు పార్టీకి వ‌స్తుంది. ఓడిపోతే అభ్య‌ర్థి అక్కౌంట్లో ప‌డుతుంది. ఒక వేళ టీఆర్ ఎస్ అసంతృప్తులు భారీ ఎత్తున ఈ పార్టీ మ‌ద్ద‌తుదారుల‌కు వ్య‌క్తిగ‌త మ‌ద్ద‌తు ఇచ్చి, స్థానిక ప‌రిస్థితులు అనుకూలిస్తే పార్టీ క‌చ్చితంగా నిల‌బ‌డే అవ‌కాశం ఉంటుంది. క‌నీసం వ‌చ్చే ఎన్నిక‌ల్లో వామ‌ప‌క్షాలకు అయినా పోటీ ఇవ్వ‌గ‌లిగే స్థాయికి టీజేఎస్ ఎదిగే అవ‌కాశం ఉంటుంది. క‌నీసం 20 శాతం పంచాయ‌తీలు క‌నుక ద‌క్కించుకుంటే ఇక కోదండ‌రాంకి తిరుగే లేదు. మ‌రో 30 స్థానాల‌కు గ‌ట్టి పోటీ ఇవ్వ‌గ‌లిగినా కోదండ‌రాం పార్టీకి మంచి భ‌విష్య‌త్తు ఉంటుంది.