Begin typing your search above and press return to search.

కేసీఆర్ 'జైలు' మాటను తప్పు పట్టిన కోదండం

By:  Tupaki Desk   |   26 Aug 2016 7:12 AM GMT
కేసీఆర్ జైలు మాటను తప్పు పట్టిన కోదండం
X
కొన్నిసార్లు అంతేనేమో. ఆవేశం హధ్దులు దాటినా.. ఆగ్రహం కట్టలు తెంచుకున్నా హీరో అయ్యే అవకాశాన్ని మిస్ చేస్తుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి ఇదే రీతిలో ఉంది. తమ ప్రభుత్వం మీద చేసిన ఆరోపణల్ని నిరూపిస్తే రోడ్డు మీద నుంచే నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి రాజీనామా చేస్తానని.. రాజకీయ సన్యాసం చేస్తానంటూ చెప్పిన మాటలకు అక్కడ చేరిన నాయకులు.. కార్యకర్తలు.. అభిమానుల హర్షాతిరేకాలు మరింత ప్రోత్సహించాయేమో కానీ.. అప్పటివరకూ బాగానే మాట్లాడిన కేసీఆర్ ఉన్నట్లుండి తనలోని మరో కోణాన్ని ప్రదర్శించారు.

తమ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తే కేసులు పెట్టేస్తామని.. జైలుకు పంపుతామంటూ వ్యాఖ్యలు చేశారు. ఆరోపణలు నిరూపిస్తే రాజీనామానే అన్న పెద్దమనిషి కేసులు పెడతాం.. జైలుకు పంపుతామన్న మాట రావటంతో తెలంగాణ ముఖ్యమంత్రి మాటలపై అభ్యంతరాలు వెల్లువెత్తాయి. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా కేసీఆర్ మాటల్ని తప్పు పట్టే ప్రక్రియ గురువారం జోరుగా సాగింది. బస్తీమే సవాల్ అన్న మాటతో ఆగిపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి పై ఇంత భారీగా మాటల దాడి జరిగి ఉండేది కాదేమో. కానీ.. అందుకు భిన్నంగా స్వరాన్ని పెంచటంతో ప్రతిపక్షాలకున్న స్వేచ్ఛను ముఖ్యమంత్రి హరించేలా బెదిరింపులకు దిగుతున్నారంటూ ఎదురుదాడి మొదలెట్టారు.

రాజకీయ పార్టీలతో పాటు.. ఉద్యమనేతలుగా గుర్తింపు పొందోనోళ్లు సైతం కేసీఆర్ మాటల్ని తప్పు పట్టే వారి జాబితాలోకి చేరిపోయారు. తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం కూడా విమర్శకుల జాబితాలో చేరిపోయారు. అభివృద్ధి చేసే విషయంలో విమర్శలు వస్తాయని.. విమర్శించిన వారిని నేరగాళ్లుగా చూడటం సరికాదంటూ ఆయన తన అభ్యంతరాన్ని బయటపెట్టారు.

తప్పుడు ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీ నాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపుతామంటూ కేసీఆర్ మాటలు సరికావన్న కోదండం మాష్టారు.. ఇలాంటి వ్యవహారశైలి స్వేచ్ఛాయుత చర్చకు భంగం కలిగిస్తుందని.. ఇలాంటి పద్దతిని విడిచిపెట్టాలని హితవుపలికారు. పార్టీల ప్రజాప్రతినిధులుగా తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేసే హక్కు నేతలకు ఉందని.. ప్రజాజీవితంలో ఉన్న వారు విమర్శలు ఎదుర్కొనక తప్పదని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఉదంతంలో సుప్రీంకోర్టు చేసిన తాజా వ్యాఖ్యల్ని కోదండం మాష్టారు గుర్తు చేశారు. కోదండం మాష్టారి హితోక్తులపై టీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో..?