Begin typing your search above and press return to search.

సెకండ్ కేపిట‌ల్‌ గా భాగ్య‌న‌గ‌రి!..ఏపీకే లాభ‌మ‌ట‌!

By:  Tupaki Desk   |   24 Jan 2018 1:12 PM GMT
సెకండ్ కేపిట‌ల్‌ గా భాగ్య‌న‌గ‌రి!..ఏపీకే లాభ‌మ‌ట‌!
X
ఇప్పుడు తెలుగు నాట కొత్త చ‌ర్చ మొద‌లైంది. ఏపీలో ఈ చ‌ర్చ ఇంకా విస్తృతం కాకున్నా... తెలంగాణ‌లో మాత్రం అంద‌రి నోటా ఇదే చ‌ర్చ జ‌రుగుతోంది. అదే... భాగ్య‌న‌గ‌రిగా మ‌నం పిలుచుకునే హైద‌రాబాదును దేశానికి రెండో రాజ‌ధానిగా చేస్తే త‌మ‌కేమీ అభ్యంత‌రం లేద‌ని, అంతేకాకుండా అలాంటి కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని తాము స్వాగ‌తిస్తామ‌ని టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు చేసిన ప్ర‌క‌ట‌నే. నిజానికి దేశానికి రెండో రాజ‌ధానిగా హైద‌రాబాదు అంటే ప్ర‌తి తెలుగు వాడు గ‌ర్వించ‌ద‌గ్గ విష‌య‌మే. ఎందుకంటే... దేశ రాజ‌ధాని ఢిల్లీ త‌ర్వాత ఆ న‌గ‌రాన్ని మించే స్థాయిలో ఉన్న ముంబై, కోల్‌క‌తా ఉన్నా... దేశానికి రెండో రాజ‌ధానిగా హైద‌రాబాదుకే కేంద్రంలోని పెద్ద‌లు ఓటేస్తున్న వైనం నిజంగానే మ‌నం గ‌ర్వించ‌ద‌గ్గ విష‌య‌మే. ఇదే రీతిన ఆలోచించిన మీద‌టే కేసీఆర్ కూడా ఈ ప్ర‌తిపాద‌న గనుక వ‌స్తే... తాము సాద‌రంగా స్వాగ‌తిస్తామ‌ని, త‌మ రాష్ట్ర రాజ‌ధాని దేశానికే రెండో రాజ‌ధానిగా అయితే అంత‌కంటే ఆనందం ఏముంటుంద‌ని కూడా కేసీఆర్ వ్యాఖ్యానించారు.

కేసీఆర్ ఏ స‌మ‌యాన ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించారో గానీ... దీనిపై పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు తెర లేచింద‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్ర రాజ‌దానిగా ఉన్న హైద‌రాబాదు... భ‌విష్య‌త్తులో దేశానికి రెండో రాజ‌ధానిగా అయితే త‌మ‌కు ఒన‌గూరే లాభాలేమిటి? ఎదుర‌య్యే న‌ష్టాలేమిటి? అన్న కోణంలో జ‌నం ఆలోచ‌న‌లో ప‌డిపోయారు. అయినా ఈ ప్ర‌తిపాద‌న ఇప్ప‌టిది కాదు అనే చెప్పాలి. రాష్ట్ర విభ‌జ‌న‌కు సంబంధించి ఏ త‌ర‌హా చ‌ర్య‌లు చేప‌డితే బాగుంటుందో చెప్పాలంటూ నాటి యూపీఏ స‌ర్కారు ఏర్పాటు చేసిన శ్రీ‌కృష్ణ క‌మిష‌న్‌.. హైద‌రాబాదును దేశానికి రెండో రాజ‌ధానిని చేసి రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెరో రాజ‌ధానిని నిర్మించి ఇస్తే స‌రిపోతుంద‌ని ఓ స‌ల‌హా ఇచ్చారు. అంత‌కుముందు కూడా హైద‌రాబాదును దేశానికి రెండో రాజ‌ధాని చేస్తే బాగుంటుంద‌న్న వాద‌న కూడా వినిపించింది. అయితే తెలుగు నేల రెండుగా విడిపోవ‌డం, రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత హైద‌రాబాదు తెలంగాణ‌కు రాజ‌ధానిగా మార‌డం జ‌రిగిపోయింది.

ఈ క్ర‌మంలో ఆ ప్ర‌తిపాద‌న అట‌కెక్కింది. మ‌ళ్లీ కేసీఆర్ ప్ర‌స్తావించే దాకా ఈ విష‌యంపై ఏ ఒక్క‌రు కూడా చ‌ర్చించిన దాఖ‌లా లేద‌నే చెప్పాలి. కేసీఆర్ దీనిపై ఓ ప్ర‌క‌ట‌న చేసిన మ‌రుక్ష‌ణ‌మే తెలంగాణ వాదులంతా ఆశ్చ‌ర్యానికి గుర‌య్యార‌ట‌. ప్ర‌ధానంగా తెలంగాణ జేఏసీకి నేతృత్వం వ‌హిస్తున్న ప్రొఫెస‌ర్ కోదండ‌రాం... అయితే కేసీఆర్ వ్యాఖ్య‌ల‌తో పూర్తిగా విభేదిస్తూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్‌... తెలంగాణ ప్ర‌జ‌లకు తీర‌ని ద్రోహం చేసిన ఏపీ పాల‌కుల‌కు, మొత్తంగా ఏపీ ప్రజ‌ల‌కు లాభం చేకూరేలానే ఈ ప్ర‌క‌ట‌న చేశార‌ని ఆరోపించారు. దేశానికి రెండో రాజ‌ధాని అంటే... హైద‌రాబాదును తెలంగాణ నుంచి వేరు చేసిన‌ట్టేన‌ని, అలా చేస్తే... హైద‌రాబాదు నుంచి వ‌చ్చే ఆదాయం కేంద్రానికి వెళ్లిపోతుంద‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

హైద‌రాబాదును దేశానికి రెండో రాజ‌ధానిగా చేస్తే... ఈ కోణంలో తెలంగాణ‌కు న‌ష్ట‌మ‌ని చెప్పిన కోదండ‌రాం... ఈ నిర్ణ‌యం ఏపీకి ఏ రీతిన లాభం చేకూరుస్తుంద‌న్న విష‌యాన్ని మాత్రం వివ‌రించ‌లేద‌నే చెప్పాలి. కాస్తంత లోతుగానే ప‌రిశీలించాల్సిన ఈ విష‌యంపై కోదండ‌రాం పైపైనే మాట్లాడేయ‌డంతో జ‌నానికి కూడా క్లారిటీ రాలేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయినా తెలంగాణ ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగ‌సిప‌డుతున్న త‌రుణంలో ఈ ప్ర‌తిపాద‌న వ‌స్తే... తామంతా కాద‌న్న విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. నాడు ఉద్య‌మ పార్టీగా ఉన్న టీఆర్ ఎస్‌ తో పాటుగా ఆ పార్టీ అధినేత‌గా ఉన్న కేసీఆర్ కూడా ఈ ప్రతిపాద‌న‌ను తిర‌స్క‌రించిన వైనాన్ని కూడా ఆయ‌న గుర్తు చేశారు. నాడు స‌రికాద‌న్న ప్ర‌తిపాద‌న‌... నేడు కేసీఆర్‌కు ఎలా క‌రెక్ట్‌గా అనిపిస్తోందో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌న్న కోణంలో వ్యంగ్యాస్త్రాలు సంధించిన కోదండ‌రాం... కేవ‌లం ఏపీకి ల‌బ్ధి చేకూర్చేందుకే హైద‌రాబాదును దేశానికి రెండో రాజ‌ధానిని చేసినా త‌న‌కు అభ్యంత‌రం లేద‌ని కేసీఆర్ వ్యాఖ్యానించి ఉంటార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.