Begin typing your search above and press return to search.

కోదండం మాష్టారికి కోపం వచ్చేసింది

By:  Tupaki Desk   |   15 July 2016 8:00 AM GMT
కోదండం మాష్టారికి కోపం వచ్చేసింది
X
ప్రతి విషయాన్ని తప్పు పట్టటం.. తెలంగాణ ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఆలోచించి చేపట్టిన ప్రాజెక్టుల్లో లోపాలు వెతకటం ఎంతమాత్రం సరికాదంటూ ఇరిగేషన్ విభాగ నిపుణుడు విద్యాసాగర్ రావు చేసిన విమర్శలు ఒక పక్క.. టీఆర్ఎస్ నేతల మండిపాటు మరో వైపున వింటున్న కోదండరాం మాష్టారికి కోపం వచ్చేసింది. ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో.. దాదాపు అలాంటి విధానాలే సొంత రాష్ట్రంలోనూ చోటు చేసుకోవటంపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్న కోదండరాం తాజాగా తనను తప్పు పడుతూ విమర్శలు చేస్తున్న వారికి చెక్ పెట్టేందుకు నడుం బిగించారు.

ఆచితూచి మాట్లాడితే పని కావటం తర్వాత సంగతి.. తన ఇమేజ్ ను డ్యామేజ్ చేయటంతో పాటు.. తాను నమ్ముకున్న విధానాలు సైతం దారుణంగా దెబ్బ తింటాయన్న విషయాన్ని గుర్తించిన ఆయన.. గళం విప్పారు. తాను చేస్తున్న విమర్శలు రాజకీయ పూరితం కావని.. ప్రజల మనోభావాల్ని ఆధారంగా చేసుకొని మాత్రమే చేస్తున్నవన్న మాటను చెప్పే ప్రయత్నం చేశారు.

తనపై తెలంగాణ అధికారపక్షానికి చెందిన కొందరు చేస్తున్న విమర్శల్ని తిప్పి కొట్టే ప్రయత్నం చేసిన కోదండం మాష్టారి మాటల్ని చూస్తే.. ‘‘ప్రజల్లో వచ్చే భావ సంఘర్షణను పరిగణలోకి తీసుకొని మంచి చెడులపై స్పందించాల్సిన అవసరం ఉంటుంది. అంతే తప్ప.. ప్రజా సమస్యలపై ఎవరూ అసలేమీ మాట్లాడవద్దంటే అలాంటి తీరు అందరికి ప్రమాదకరం. నా వెనుక కాంగ్రెస్ హస్తం ఉందంటూ చేస్తున్న విమర్శల్లో అర్థం లేదు. నా వెనుక ప్రజల హస్తం తప్ప కాంగ్రెస్ హస్తం లేదు. ప్రజల కష్ట సుఖాలను పరిగణలోకి తీసుకొని ప్రాజెక్టులు రూపొందించాలే కానీ.. ప్రజల బాగోగులతో సంబంధం లేకుండా ప్రాజెక్టుల్ని రూపొందించకూడదు. అలా చేస్తే సమస్యలు తప్పవు’’ అని వ్యాఖ్యానించారు.

మల్లన్న సాగర్ ప్రాజెక్టు రీడిజైనింగ్ విషయాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని.. ముంపు తగ్గించేలా ప్రణాళికలు రూపొందించాలని కోదండం కోరారు. భూసేకరణలో జరుగుతున్న సమస్యలపై చర్చలు జరపటంతో పాటు.. సేకరించిన భూమిని అవసరాలకు వినియోగించకుండా నిరుపయోగంగా ఉంచిన విషయాన్ని తమ అధ్యయనంలో తేలిందని చెప్పిన ఆయన.. భూసేకరణ వల్ల ప్రజలకు సమస్యలే తప్ప మేలు జరగదని తేల్చారు. తాము మరిన్ని ప్రాంతాల్లో పర్యటించి 15 రోజుల్లో సమగ్ర నివేదికను సిద్ధం చేస్తామని చెప్పిన ఆయన.. మహబూబ్ నగర్ జిల్లాలో సాగునీట ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తున్నట్లు ప్రకటించారు.

తెలంగాణ ఉద్యమం వచ్చిందే నీళ్లు.. నిధులు.. నియమకాలకు సంబంధించని.. అయితే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నియమకాల విషయంలో ఎలాంటి కదలిక లేదని వ్యాఖ్యానించారు. నిరుద్యోగులు తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నట్లుగా చెప్పటం ద్వారా ఇరిగేషన్ ప్రాజెక్టుల తర్వాత తన తదుపరి లక్ష్యం ఏమిటన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.