Begin typing your search above and press return to search.

గాంధీ జీన్స్ ప్యాంటు ఎంతో కోదండం రాజకీయాలంతా?

By:  Tupaki Desk   |   30 Sep 2015 4:50 AM GMT
గాంధీ జీన్స్ ప్యాంటు ఎంతో కోదండం రాజకీయాలంతా?
X
నిత్యం చేసేది రాజకీయాలే అయినా.. తనకు రాజకీయాలంటే అస్సలు తెలీదని.. ఉద్యమాలు.. పోరాటాలే తన ఊపిరి అంటూ కొంగొత్త రాగం తీస్తున్నారు కోదండం మాష్టారు. తెలంగాణ ఉద్యమంలో తన మార్క్ ప్రదర్శించి.. తెలంగాణవాదులందరిని ఒక జట్టుగా చేయటంలో కోదండం మాష్టారి ప్రతిభను ఎవరూ తక్కువ చేసి చూపించలేరు.

ఉద్యమంలో కీలకభూమిక పోషించినా.. ఆయనపై ఎలాంటి ఆరోపణలు రాకపోవటం చిన్న విషయమేమీ కాదు. తెలంగాణ కల సాకారం అయ్యాక అందరి మాదిరే పదవుల కోసం ఆశించకుండా.. తాను చదువు చెప్పే కాలేజీకి వెళ్లి పిల్లలకు పాఠాలు చెప్పిన తీరు సమకాలీన ప్రపంచంలో కాస్త కొత్త అనుభవమే. అలాంటి ఆయన.. ఈ రోజు పదవీ విరమణ చేస్తున్నారు.

సినిమాల్లో మాదిరి సమాజాన్ని మార్చటం కోసం.. ఉద్యమ దిశగా సమాజాన్ని సమాయుత్తం చేయటం కోసం ఒక మాష్టారు నడుం బిగించి.. దాన్ని విజయవంతం చేసి.. దాంతో వచ్చే పదవుల్ని చేపట్టకుండా సాదాసీదాగా తన బతుకు తాను బతకటం లాంటివి రీల్ లైఫ్ లో చూస్తుంటాం. కానీ.. రియల్ లైఫ్ లో కూడా సాధ్యమేనని తన చేతలతో చేసి చూపించారు.

అయితే.. తనకు రాజకీయాలు నప్పవని.. తాను రాజకీయాల్లోకి రావటం అంటే.. గాంధీ మహాత్ముడు జీన్స్ ఫ్యాంటు వేసినట్లు ఉంటుందని చెప్పుకున్న కోదండం కాస్తంత అతిశయోక్తిగానే చెప్పాలి. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని రాజకీయాలు చేసింది కోదండం మాష్టారికే కాదు.. ఆయన్ను క్లోజ్ గా చూసేవారికి తెలియంది కాదు. అలా అని కోదండం మాష్టారు ఏదో తప్పు చేశారని కాదు.

పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించే క్రమంలో.. రాజకీయ జేఏసీ పగ్గాలు చేపట్టి.. కొమ్ములు తిరిగిన రాజకీయ పార్టీ నేతల్ని తన చుట్టూ తిప్పుకోవటం కోదండం మాష్టారికే చెల్లుతుంది. కేసీఆర్ కు షాడో అన్నట్లుగా కోదండం మీదున్న ఆరోపణ ఉన్నప్పటికీ.. తెలంగాణ ఉద్యమం ఒక దశకు వచ్చేసరికి ఆయనకు ఇబ్బందికరంగా మారటం తెలిసిందే.

అలాంటిది కోదండం మాష్టారికి రాజకీయం చాలా కొత్త పని అన్నట్లుగా మాట్లాడటం కాస్తంత విచిత్రంగా అనిపించక మానదు. గాంధీ మహాత్ముడు జీన్స్ ఫ్యాంటు వేసినట్లుగా తాను రాజకీయాలు చేయటమని వ్యాఖ్యానించటం ఆయన తన గురించి కాస్త గొప్పలు చెప్పుకున్నట్లుగానే భావించాలి. తెలంగాణ అధికారపక్ష అసంతృప్తులంతా కోదండం దరికి చేరటం.. ఆయన్ను రాజకీయాల్లోకి రమ్మని చెప్పటం.. ఆ దిశగా వెళితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్న అంశంపై కాసింత లెక్కలేయటం లాంటివి కోదండరాం శిబిరంలో జరిగిన మాట వాస్తవం.

కానీ.. అలాంటిదేమీ లేదన్నట్లుగా కోదండం మాష్టారు చెబుతున్నారంటే.. అదీ.. ఆయన ‘రాజకీయం’ అని చెప్పక తప్పదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజకీయం చేయటానికి అనువైన వాతావరణం లేకపోవటంతో పాటు.. తెలంగాణ అధికారపక్షంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావటం లేదన్నది కోదండం మాష్టారికి తెలియంది. అందుకే.. ఇప్పుడు రాజకీయం గురించి మాట్లాడే కన్నా.. రాజకీయాలన్నవి తనకు ఆసక్తి కలిగించని అంశాలుగా చెబుతూ.. ఉద్యమాలు.. పోరాటాలే తనకు మక్కువ అన్న మాటలు చెబుతున్నారని చెప్పాలి. తనను తాను రాజకీయ నాయకుడిగా చెప్పుకునే కన్నా.. పోరాట యోథుడిగా చెప్పుకోవటమే భవిష్యత్తుకు మంచిదన్న విషయం కోదండం మాష్టారికి తెలీదా? అందుకే.. ఆయన నోట గాంధీ జీన్సు మాట వచ్చింది. అయితే.. తన రాజకీయం కోసం మహాత్ముడి పేరును వాడటం కోదండం మాష్టారి ‘రాజకీయ’ చాతుర్యం కాదా..?