Begin typing your search above and press return to search.

జేఏసీ అలా చేయ‌దంటున్న కోదండ‌రాం

By:  Tupaki Desk   |   25 Dec 2016 4:41 AM GMT
జేఏసీ అలా చేయ‌దంటున్న కోదండ‌రాం
X
తెలంగాణ జేఏసీపై నెల‌కొన్న అంచ‌నాలు - విశ్లేష‌ణ‌ల‌పై జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం క్లారిటీ ఇచ్చారు. జేఏసీ రాజకీయ పార్గీగా మారదని ఆయ‌న స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు కోరుకుంటే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ పార్టీలు వస్తాయి కానీ.. తాము మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోమని కోదండ‌రాం స్పష్టం చేశారు. జేఏసీ నాయ‌కులు ర‌చించిన‌ ‘తెలంగాణ‌ ఉద్యమ చరిత్ర మా పోరాటం’ పుస్తకాన్ని హుస్నాబాద్ టీఆర్ ఎస్‌ ఎమ్మెల్యే వొడితెల సతీష్ తో కలిసి కోదండ‌రాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయ‌న‌ మాట్లాడుతూ ఉద్యమకాలంలో తాము ఉన్నత విలువలు నెలకొలిపే విధంగా ముందుకు నడుస్తామన్నారు.

తెలంగాణలోని పలు సమస్యలపై ఉద్యమించేందుకు ప్రజాసంఘాలతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పనిచేస్తామని కోదండ‌రాం అన్నారు. తెలంగాణలో తాము నిర్వాసితుల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఇరవై జిల్లాల్లో నూతన కమిటీలు వేశామని, మిగిలిన 11 జిల్లాల్లో నూతన కమిటీలు త్వరలో వేస్తామన్నారు. 25న విస్తృతస్థాయి సమావేశం హైదరాబాద్‌లో ఉందని, దీనిలో జేఏసీ పనితీరుపై తగు ప్రణాళికలు తయారు చేస్తుందని కోదండ రాం అన్నారు. తెలంగాణలో విద్య - వైద్యం మొత్తం పెట్టుబడిదారుల చేతిలో ఉండడంతో సామాన్యులకు న్యాయం జరగడం లేదని, నూతనంగా విద్యా - వైద్యంపై కొత్త విధానాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు. త్వరలో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో మాసపత్రికను తెస్తామని, అదేవిధంగా వెబ్ సైట్‌ ను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీసుకు వస్తామని కోదండ‌రాం ప్ర‌క‌టించారు.

ఇదిలాఉండ‌గా...జేఏసీ చైర్మన్ కోదండ‌రాం సమక్షంలో తెలంగాణ జేఏసీ - తెలంగాణ రాష్ట్ర సమితి నేతల మధ్య వాగ్వాదం జరిగింది. సభలో గాయకులతో పాటలు పాడిస్తుండగా తెలంగాణ జాతీయ గీతం పూర్తిగా పాడకుండా సభికులు అడ్డుకున్నారని, అదే విధంగా వక్తలు ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరును ఎండిగట్టారని టీఆర్‌ ఎస్ శ్రేణులు సభలో గొడవకు దిగారు. సభలో పలుమార్లు టీఆర్‌ ఎస్ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. సుమారు అరగంట పాటు తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ముల్కనూర్ ఎస్సై గొడవను అదుపులోకి తెచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/