Begin typing your search above and press return to search.

మ‌న‌సులో మాట చెప్పిన కోదండరాం

By:  Tupaki Desk   |   29 Sep 2015 4:43 AM GMT
మ‌న‌సులో మాట చెప్పిన కోదండరాం
X
తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సెప్టెంబ‌ర్ 30న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న నేప‌థ్యంలో కోదండరాం మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్రత్యేక తెలంగాణ‌ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీజేఏసీకి ఆయన సారథిగా ఉండి ఉద్యోగ సంఘాలను,రాజకీయ పార్టీలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి ముందుకు నడిపించిన ఘనత ఆయనదే అని చెప్పాలి. ఆయన సారథ్యంలో తెలంగాణ ఉద్యమానికి ఓ ఊపు వచ్చింది. జేఏసీ చేపట్టిన ప్రతీ కార్యక్రమంలో కోదండరామ్‌ ది కీలక పాత్ర. కానీ ప్రత్యేక రాష్ట్రం సాకారమవడంతో కోదండరాం జోరు ఒకింత‌ తగ్గింది. అయితే తాజాగా ప‌ద‌వీ విర‌మ‌ణ సంద‌ర్భంగా ఆయ‌న త‌న మ‌న‌సులోని మాట‌ను వెల్ల‌డించారు.

ప్రొఫెసర్‌ గా వచ్చే రిటైర్‌ కాబోతున్నప్ప‌టికీ....తాను ఉద్యమ నాయకుడిగానే ఉండాలని కోరుకుంటున్న‌ట్లు కోదండరాం తెలిపారు. ప్ర‌జాసంఘాలతో కలిసి ఉద్యమ పంథాను కొనసాస్తాన‌ని ఆయ‌న తెలిపారు. తెలంగాణలో జ‌రుగుతున్న రైతు మ‌ర‌ణాల‌పై, వ‌రంగ‌ల్‌ ఎన్‌ కౌంటర్‌ జరిగిన తీరు తప్పు అని అభిప్రాయపడ్డ కోదండరాం...తెలంగాణ‌లో ఇలాంటి ప‌రిస్థితి రాకుండా ఉండేందుకు త‌న‌వంతుగా ప్ర‌య‌త్నం చేస్తాన‌ని తెలిపారు. విద్యా, వైద్యారోగ్య రంగాన్ని సంస్క‌రించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంద‌న్నారు. అందుకోసం తాను పూర్తిస్థాయి స‌మ‌యాన్ని తెలంగాణ జేఏసీకి కేట‌యిస్తాన‌ని తెలిపారు. ప్ర‌జాసంఘాలు, ప్ర‌జ‌ల‌తో క‌లిసి వాస్త‌వ స్థితిగ‌తుల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువెళ‌తాన‌ని ప్ర‌క‌టించారు. తాను రాజకీయాల్లోకి వెళ్తానన్నది కేవలం ఊహాగానాలేనని ఆయ‌న స్పష్టం చేశారు. తెలంగాణ జేఏసీ ప‌క్షాన రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూనే...ప్ర‌జ‌ల గొంతుక‌గా నిలుస్తాన‌ని తెలిపారు.

తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ఆందోళ‌న‌ల‌తో ఇప్ప‌టికే అధికారప‌క్షం ఇరుకున ప‌డుతుండగా...కోదండ‌రాం రూపంలో వ‌చ్చే ప్ర‌జాగ‌ళాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏ విధంగా ఎదుర్కుంటారో చూడాలి మ‌రి.