Begin typing your search above and press return to search.

పార్టీ పెట్టి కోదండరాం త‌ప్పు చేశాడా?

By:  Tupaki Desk   |   5 April 2018 3:30 PM GMT
పార్టీ పెట్టి కోదండరాం త‌ప్పు చేశాడా?
X
తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ - రిటైర్డ్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం ల‌క్ష్యం నెర‌వేరే అవ‌కాశం లేదా? ప్రొఫెస‌ర్‌గా ఉంటూ ఉద్య‌మంలో పాలుపంచుకున్న కోదండరాం అనంత‌రం ప్ర‌జా వేదిక‌గా గ‌ళం విప్పి ఇప్పుడు పార్టీ ద్వారా ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్న‌ప్ప‌టికీ ఫ‌లితం నెర‌వేరే అవ‌కాశం త‌క్కువేనా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. తెలంగాణ జ‌న‌స‌మితి పేరుతో కోదండ‌రాం స్థాపించిన కొత్త పార్టీ స‌క్సెస్ గురించి ఈ చ‌ర్చ‌లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాల‌తో బ‌లంగా ఉన్న టీఆర్ ఎస్‌ - ఇటీవ‌లి కాలంలో ప్ర‌జ‌ల‌కు పెద్ద ఎత్తున చేరువ అవుతున్న కాంగ్రెస్‌ ను - ప్ర‌త్యేక‌మైన ఓటు బ్యాంక్‌ ను క‌లిగి ఉన్న బీజేపీకి దీటుగా టీజేఎస్ ఎలా నిల‌దొక్కుకోగ‌లుగుతుంద‌నే సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది.

రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశాన్ని మొద‌ట వ్య‌తిరేకించిన ప్రొఫెస‌ర్ కోదండ‌రాం ఎట్ట‌కేల‌కు అదే నిర్ణ‌యం తీసుకున్నారు. తెలంగాణ జ‌న‌సమితి పేరుతో త‌న జెండా - అజెండాను రూపొందించి రాబోయే ఎన్నిక‌ల కోసం సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో ఆ పార్టీ విజ‌య‌వ‌కాశాల‌పై చ‌ర్చ జ‌రుగుతోంది. టీజేఎస్‌ కు ఇప్ప‌టివ‌ర‌కు జేఏసీ రూపంలో త‌ప్ప మ‌రే బ‌ల‌మైన నిర్మాణం లేదు. కోదండ‌రాం వెంట న‌డిచే వారిలో విద్యార్థులు - నిరుద్యోగ‌ యువ‌త శాత‌మే ఎక్కువ‌. అయితే మొత్తం విద్యార్థి - యువ‌త ఓట్ల‌లో కోదండ‌రాం ఖాతాలో చేరేవి ఎన్ని అనే సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. ఎందుకంటే వామ‌ప‌క్షాలు మొదలుకొని ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌ - బీజేపీ స‌హా అధికార టీఆర్ ఎస్ వ‌ర‌కు యువ‌త‌ - విద్యార్థి విభాగాలు ఉన్నాయి. అవి కూడా చురుగ్గానే ప‌నిచేస్తున్నాయి. తెలంగాణ‌లోని మొత్తం నిరుద్యోగ యువ‌త‌ - విద్యార్థుల్లో ఈ పార్టీల‌కు సంబంధించిన విభాగాల్లోనే దాదాపు 60-70% వ‌ర‌కు ఉంటార‌ని ఒక అంచ‌నా. దీంతో కోదండ‌రాంకు మ‌ద్ద‌తుగా నిలిచే వారు ఎవ‌ర‌నే సందేహం స‌హ‌జంగానే వ‌స్తుంది. కీల‌క‌మైన ఈ ఓటు బ్యాంకు విష‌యంలో అస్ప‌ష్ట‌త‌నే క‌నిపిస్తుంది.

మ‌రోవైపు గృహిణులు - రైతులు - ఉద్యోగుల ఓట్ల‌ను ఎంత మేర‌కు కోదండ‌రాం చీల్చ‌గ‌ల‌ర‌నే సందేహం సహ‌జంగానే వ్య‌క్త‌మ‌వుతుంది. అధికార టీఆర్ ఎస్‌ - ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను కాద‌ని త‌న‌కు ఆయా వ‌ర్గాల‌ను చేరువ చేసుకోవ‌డం కోదండ‌రాం ముందున్న అతిపెద్ద స‌వాల్ అని అంటున్నారు. ఇక పొత్తులు కూడా అంత ఆశాజ‌న‌కంగా ఏమీ ఉండ‌వ‌క‌పోవ‌చ్చున‌ని చెప్తున్నారు. కాంగ్రెస్‌ లో చేరేందుకు ఆహ్వానం అందిన‌పుడు అందుకు సిద్ధం కాకుండా ఇప్పుడు సొంత పార్టీ పెట్టుకొని అదే పార్టీతో పొత్తు పెట్టుకోవ‌డం ఏమేర‌కు ఫ‌లితాల‌ను ఇస్తుందంటున్నారు. కాంగ్రెస్‌ లో చేరి ఉంటే టార్గెట్ కేసీఆర్ అనే కోదండ‌రాం ల‌క్ష్యం నెర‌వేరేందుకు మ‌రింత అవ‌కాశం ఉండేద‌ని ఇప్పుడు ఆ ల‌క్ష్యం యొక్క ఫ‌లితం సందేహాస్ప‌ద‌మేన‌ని చ‌ర్చించుకుంటున్నారు.