Begin typing your search above and press return to search.

సంక‌ట ప‌రిస్థితిలో కోదండ‌రాం!

By:  Tupaki Desk   |   27 Oct 2018 11:47 AM GMT
సంక‌ట ప‌రిస్థితిలో కోదండ‌రాం!
X
ప్రొఫెస‌ర్ కోదండ‌రాం....ఐదేళ్ల క్రితం తెలంగాణ‌తో పాటు దేశ‌వ్యాప్తంగా ఈ పేరు మార్మోగిపోయింది. ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మంలో కీల‌కమైన పాత్ర పోషించ‌న వారిలో కోదండ‌రాం ఒక‌రు. ఉస్మానియాతో పాటు తెలంగాణ‌లోని ప‌లు యూనివ‌ర్సిటీల్లోని విద్యార్థులంద‌రినీ ఏక‌తాటిపైకి తెచ్చిన ఘ‌న‌త కోదండ‌రాంది. అయితే, కోట్లాదిమంది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ అనాలోచిత నిర్ణ‌యాలు కోదండ‌రాంకు న‌చ్చ‌లేదు. దీంతో, కేసీఆర్ కు వ్య‌తిరేకంగా సొంత‌పార్టీ `తెలంగాణ జ‌న స‌మితి`ని ప్రారంభించారు. దీంతో, కేసీఆర్ వ్య‌తిరేక శ‌క్తుల‌న్నీ టీజేఎస్ తో చేరి టీఆర్ ఎస్ ను గద్దె దించుతాయ‌ని భావించారు. అయితే, కేసీఆర్ ముందస్తు వ్యూహంతో టీజేఎస్ ప్లాన్ విఫ‌ల‌మ‌వ‌డంతో ఇప్పుడు టీజేఎస్ ఉనికే ప్ర‌శ్నార్థ‌క‌మైంది. మ‌హాకూట‌మిలో `సీట్ల‌`పంప‌కాల అన్యాయం జ‌ర‌గ‌డంతో కోదండ‌రాం పరిస్థితి ముందు నుయ్యి...వెనుక గొయ్యి అన్న చందంగా త‌యారైంది.

తాను క‌ల‌లుగ‌న్న తెలంగాణ రాలేద‌ని కోదండ‌రాం 2015లో అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. దీంతో, కేసీఆర్ కు దీటుగా ఓ పార్టీని పెట్టి 2019 ఎన్నిక‌ల్లో అన్ని స్థానాల్లోనూ బ‌రిలోకి దిగాల‌ని అనుకున్నారు. అయితే, అనూహ్యంగా కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డంతో మ‌హా కూట‌మితో కోదండ‌రాం జ‌తక‌ట్టాల్సిన ప‌రిస్థితులు వ‌చ్చాయి. అయితే, తాజాగా ఆ పార్టీలో సీట్ల పంప‌కంలో కూడా టీజేఎస్ కు అన్యాయం జరిగింద‌ని తెలుస్తోంది. టీజేఎస్ ను చిన్న పార్టీగా ప‌రిగ‌ణించి...అర‌కొర సీట్లు ఇచ్చేందుకు టీడీపీ, కాంగ్రెస్ లు ప్ర‌తిపాద‌న‌లు పెట్ట‌డం కోదండ‌రాంకు మింగుడుప‌డ‌డం లేదు. ఆఖ‌రికి సీపీఐ కంటే టీజేఎస్‌కు తక్కువ సీట్లు అని తెలియ‌డంతో కోదండ‌రాం ఇర‌కాటంలో ప‌డ్డార‌ట‌. ఇటు మ‌హా కూట‌మి నుంచి బ‌య‌ట‌కు రాలేక‌...వ‌చ్చినా సొంత‌గా పోటీ చేసే ప‌రిస్థితులు లేక‌...స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ట‌. మ‌రి, కోదండ‌రాం మాస్టారి భ‌విష్య‌త్తు ఏవిధంగా ఉంటుందో వేచి చూడాలి.