Begin typing your search above and press return to search.

కూటమిలో కోదండ కరివేపాకేనా...!?

By:  Tupaki Desk   |   17 Nov 2018 4:52 AM GMT
కూటమిలో కోదండ కరివేపాకేనా...!?
X
ప్రొఫెసర్ కోదండరాం మేథావి. ఉద్యమ నేత. తెలంగాణ ఉద్యమం సమయంలో జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్. ఇవన్నీ గతం. కోదండరాం తెలంగాణ ప్రజల్లోనే ఓ విలువలున్న మనిషి నిలబడిన కాలం. ఆ గతం ఇప్పుడు మసకబారిందా..? రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా మారిన కోదండ రాం తనకు కూడా బాలారిష్టాలు తప్పవని అనుకుంటున్నారా...? మహాకూటమి ఆయనని వాడుకుని వదిలేస్తుందనుకుంటున్నారా...? అంటే అవుననే సమాధానం వస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో హిట్లర్ పాలన సాగుతోందని, ఈ నియంత విధానాలకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతో కోదండరాం తాను ఎంతో వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు. అంతే కాదు.... తెలంగాణ ఏర్పాటుకు తీవ్ర వ్యతిరేకమని భావించడమే కాదు నిశ్చితాభిప్రాయం కూడా కలిగిన కోదండరాం ఒకే ఒక్క ఎజెండాతో మహాకూటమికి స్నేహహస్తం అందించారు. అదే ఆయన తన రాజకీయ జీవితంలో చేసిన అతి పెద్ద చారిత్రక తప్పిదం అని ఆయన సన్నిహితులే కాదు... రాజకీయ పండితులు కూడా అంటున్నారు.

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా మహాకూటమిలో కాంగ్రెస్ - తెలుగుదేశం - తెలంగాణ జన సమితి - సిపిఐ పార్టీలు సంకల్పం చెప్పుకున్నాయి. ఇందులో భాగంగా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడాలని నిర్ణయించారు. అయితే రాజకీయంగా ఇతర పార్టీల కంటే కాసింత ఎక్కువ అనుభవం - ట్రిక్కులు - జిమ్మిక్కులు తెలిసిన కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీల ముందు తెలంగాణ జన సమితి - సిపిఐలు నిలబడలేకపోయాయి. ముఖ్యంగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండ రాం కాంగ్రెస్ రాజకీయాల ముందు నిలబడలేకపోయారు. ఎంతకూ తేల్చని పొత్తులు - ఖరారు కాని స్థానాలు - రెండు రోజులకొకసారి కాంగ్రెస్ ఇచ్చే లీకులతో కోదండ రాంకు దిమ్మ తిరిగిపోయిందంటున్నారు. చివరికి కోదండరాం కోరుకున్న జనగామ స్ధానాన్ని ఆయనకే కేటాయిస్తున్నామనే ఫీలింగ్ తీసుకువచ్చి మూడు నాలుగు రోజుల పాటు మీడియాలో ఊదరగొట్టారు. చివరకు కోదండరాంను ఢిల్లీ పిలిపించుకుని రాహుల్ గాంధీయే స్వయంగా మాట్లాడి జనగామ కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసేలా ఒప్పించారు. దీంతో మహాకూటమిలో కోదండరాం పరిస్థితి కూరలో కరివేపాకులా మారుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి. అనుమానాలే కాదు భవిష్యత్ చిత్రపటం అదే అని రాజకీయ పండితులు తీర్మానించేస్తున్నారు కూడా. పాపం కోదండరాం అని సరిపెట్టుకోవడం మాత్రమే మిగిలి ఉంది.