Begin typing your search above and press return to search.

టీ సర్కారు పై కోదండం మాష్టారి నిరసన

By:  Tupaki Desk   |   1 Aug 2015 4:28 PM GMT
టీ సర్కారు పై కోదండం మాష్టారి నిరసన
X
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించి.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎలాంటి పదవులు తీసుకోకుండా.. ఒక ఉద్యమకారుడిగా ఉండిపోయిన ఒకేఒక్క ఉద్యమ అగ్రనేత కోదండం మాష్టారు.

తన మాటలతో మంటలు పుట్టించే కోదండం మాష్టారి తెలంగాణ ఉద్యమ ఎంట్రీ ఎంత ప్రభావం చూపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఉద్యమంలో రాజకీయ పార్టీల మీద విశ్వాసం సన్నగిల్లిన వేళ.. రాజకీయ జేఏసీతో తెరపైకి వచ్చి.. తెలంగాణ ఉద్యమ పగ్గాలు చేపట్టి.. తెలంగాణ రాష్ట్ర సాధన వరకూ అలుపెరగకుండా పయనించిన కోదండం మాష్టారు.. తాజాగా తెలంగాణ అధికారపక్షం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై గళం విప్పారు.

తెలంగాణ అధికారపక్షానికి దన్నుగా ఉంటూ అప్పుడప్పుడు సున్నితమైన చురకలు వేసే ఆయన.. తాజాగా మాత్రం.. తెలంగాణ అధికారపక్షం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద తాము నిరసన తెలియజేస్తామని వ్యాఖ్యానించారు. ఇంతకాలం తెలంగాణ అధికారపక్షానికి దన్నుగా నిలిచిన ఆయన.. తాజా అందుకు భిన్నంగా అడుగులే వేసే విషయంపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో.. తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తెలంగాణ జాతిపిత దివంగత ప్రొఫెసర్ జయశంకర్ 81వ జయంతి సందర్భంగా ఆగస్టు 6న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతామని కోదండం వెల్లడించారు. శనివారం పొలిటికల్ జేఎసీ సమావేశనం అనంతరం ఆయనీ ప్రకటన చేశారు. ఉస్మానియా ఆసుపత్రిని ఆగస్టు 3న సందర్శిస్తానని చెప్పిన కోదండం మాష్టారు తీరు చూస్తుంటే.. తెలంగాణ అధికారపక్షానికి సరికొత్త ప్రజాప్రతిపక్షంగా మారే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

భావోద్వేగాల్ని ఎలా పెంచాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిసినంతగా.. కోదండం మాష్టారుకు తెలుసన్న వాదన నేపథ్యంలో.. రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.